కాంగ్రెస్ పార్టీలో జాక్‌పాట్ కొట్టిన నల్గొండ జిల్లా లీడర్లు

by GSrikanth |
కాంగ్రెస్ పార్టీలో జాక్‌పాట్ కొట్టిన నల్గొండ జిల్లా లీడర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో నల్గొండ జిల్లా లీడర్లు జాక్‌పాట్ కొట్టారు. ఎందుకంటే ఆ జిల్లాకు చెందిన నేతల ఫ్యామిలీకి రెండేసి టికెట్లు దక్కాయి. కానీ, ఖమ్మం లీడర్ల మధ్య నెలకొన్న పోటీని తట్టుకోలేక హస్తం పార్టీ అధిష్టానం ఒక కుటుంబానికి ఒకే టికెట్ అనే కండీషన్‌ను పెట్టింది.దీంతో ఎంపీ టికెట్‌ను తమ ఫ్యామిలీ మెంబర్లకు ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల ప్రతిపాదనలను పక్కన పెట్టింది. ఒకే కుటుంబానికి రెండు పదవులు ఇస్తే విమర్శలు వస్తాయని భావించిన ఏఐసీసీ.. తొలితరం కాంగ్రెస్ లీడర్‌గా ముద్రపడిన మాజీ ఎంపీ ఆర్.సురేందర్ రెడ్డి కొడుకు రాఘురామ్ రెడ్డికి చాన్స్ ఇచ్చింది.

లక్కు చిక్కింది..

ఉమ్మడి నల్గొండ జిల్లా నేతల డిమాండ్లకు ఏఐసీసీ మొదటి నుంచి ప్రయారిటీ ఇస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి జానారెడ్డి చిన్న కొడుకు జయవీర్ రెడ్డికి నాగర్జున సాగర్ టికెట్ దక్కగా, నల్గొండ ఎంపీ టికెట్‌ను ఆయన పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డికి ఇచ్చింది. హుజూర్ నగర్ టికెట్‌ను ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతికి కోదాడ టికెట్ ఇవ్వడంతో పాటు ఉత్తమ్‌కు మంత్రి పదవి దక్కింది. ఇక నల్గొండ ఎమ్మెల్యే టికెట్‌ను కొమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇవ్వగా,ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇచ్చింది.ప్రస్తుతం వెంకటరెడ్డి ఒక్కరే కేబినెట్‌లో కొనసాగుతుండగా, ఎంపీ ఎన్నికల తర్వాత రాజగోపాల్ రెడ్డి సైతం మంత్రి అవుతారనే ప్రచారం సాగుతున్నది.

రఘురామి రెడ్డికు చాన్స్..

ఖమ్మం ఎంపీ టికెట్‌ను తమ ఫ్యామిలీ మెంబర్లకు ఇప్పించుకునేందుకు ఆ జిల్లా మంత్రులు ముగ్గురు తెగ పోటీ పడ్డారు.భార్య నందిని కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి కోసం మంత్రి పొంగులేటి, కొడుకు యుగేందర్ కోసం మంత్రి తుమ్మల ప్రయత్నించారు. భట్టి, పొంగులేటి మధ్య ఉన్న పోటీని చూసి తుమ్మల మధ్యలోనే డ్రాప్ అవ్వగా.. భట్టి, పొంగులేటి మాత్రం చివరి నిమిషం వరకు తీవ్రంగా ప్రయత్నించారు.ఈ ఇద్దరు మంత్రుల మధ్య నెలకొన్న పోటీని గ్రహించిన అధిష్టానం ఒక ఫ్యామిలీకి ఒకే పదవి అనే కండీషన్‌ను తెరమీదికి తెచ్చి మాజీ ఎంపీ ఆర్.సురేందర్ రెడ్డి కొడుకు రఘురామి రెడ్డికి చాన్స్ ఇచ్చింది.

Advertisement

Next Story