Dil Raju: రాజకీయాల కోసం సినీ పరిశ్రమను వాడుకోవద్దు: కేటీఆర్‌కు దిల్ రాజు కౌంటర్

by Ramesh N |   ( Updated:2024-12-31 12:17:32.0  )
Dil Raju: రాజకీయాల కోసం సినీ పరిశ్రమను వాడుకోవద్దు: కేటీఆర్‌కు దిల్ రాజు కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని ఎఫ్‌డీసీ చైర్మన్, నిర్మాత దిల్ రాజు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ఫిల్మ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ పేరుతో 'ఎక్స్' ఖాతా ద్వారా ఒక ప్రకటన వచ్చింది. అందులో.. సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటు మాటున జరిగిన వ్యవహారం కాదని అందరికీ తెల్సిందేని చెప్పుకొచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పయనంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి.. రాష్ట్రాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి, మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం కాంక్షించారని తెలిపారు.

హైదరాబాదును గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చిదిద్దాలనే సీఎం బలమైన సంకల్పాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా మేమందరం స్వాగతించడం జరిగిందని పేర్కొన్నారు. అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని మా మనవి.. అంటూ కోరారు. రాజకీయ దాడి, ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరిని కోరారు. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed