CPIM Telangana: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయి

by Gantepaka Srikanth |
CPIM Telangana: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయి
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వానికి(Congress Govt) సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(John Wesley) కీలక విజ్ఞప్తులు చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ‘రాష్ట్రంలో రైతులు పండించిన మిర్చికి ధర దారుణంగా పడిపోతున్నది. క్వింటాల్‌కు రూ25,000 వుండాల్సిన పరిస్థితి నుండి రూ.12,000లకు తగ్గించి వ్యాపారులు రైతులకు గిట్టుబాటు లేకుండా చేస్తున్నారు. ఫలితంగా మిర్చి రైతుల ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయి. ఖమ్మం జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకోగా ఒక రైతు గుండెపోటుతో మరణించారు. మిర్చి బోర్డును ఏర్పాటు చేసి మద్దతు ధర నిర్ణయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేయాలని, మార్క్‌ఫెడ్‌ ద్వారా మిర్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని సీపీఐ(ఎం) తెలంగాణ(CPIM Telangana) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

పంటకాలంలో వ్యాపారులు మార్కెట్లల్లో ధరలు తగ్గించడం, రైతుల నుండి సరుకు వ్యాపారులకు చేరిన తర్వాత ధరలను రెట్టింపు చేయడం జరుగుతున్నది. కాంగ్రెస్‌ మేనిఫెస్టో(Congress Manifesto)లో మిరప పంట క్వింటాల్‌కు కనీస మద్ధతు ధర రూ.15,000లు ఇస్తామని ప్రకటించారు. ఒకవైపు వ్యవసాయ ఖర్చులు పెరిగాయి.. మరోవైపు దిగుబడులు బాగా తగ్గాయి. ఎకరాకు 30,40 క్వింటాళ్ళు దిగుబడి రావాల్సి ఉండగా క్రిమీ, కీటకాల వల్ల ఎకరాకు దిగుబడి 12 క్వింటాళ్ళకు తగ్గింది. ఎకరాకు పెట్టుబడి రూ.1.5 లక్షల నుండి రూ.2.00 లక్షల వరకు పెట్టారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ ధరల ప్రకారం పెట్టిన పెట్టుబడులు కూడా రాని స్ధితి ఉంది. దీంతో వివిధ జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు.

రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ(State Marketing Department) జోక్యం చేసుకొని క్వింటాల్‌కు రూ.25,000లు ధర ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ మార్కెట్లలో ప్రభుత్వ నియంత్రణ పెరగాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో మిరపకు మంచి ధర ఉన్నందున వ్యాపారులకు పోటీగా మార్క్‌ఫెడ్‌ రూ.25,000లు క్వింటాల్‌కు కొనుగోలు చేసినప్పటికీ ఎలాంటి నష్టం రాదు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్రకమిటీ కోరుతున్నదని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed