నేడు కౌన్సిల్ సమావేశం.. అధికార పార్టీని ఇరకాటంలో పెట్టే వ్యూహం

by Hamsa |   ( Updated:2023-05-03 04:05:19.0  )
నేడు కౌన్సిల్ సమావేశం.. అధికార పార్టీని ఇరకాటంలో పెట్టే వ్యూహం
X

దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం బుధవారం భేటీ కానుంది. గత నెల 27న జరగాల్సిన ఈ సమావేశాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. సమావేశం బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభించనున్నట్లు సమాచారం. మేయర్ బిజీ షెడ్యూల్ కారణంగా నేటి కౌన్సిల్ సమావేశాన్ని గంట ఆలస్యంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే అధికార, విపక్షాలకు చెందిన కార్పొరేటర్లు ప్రజాసమస్యలపై ప్రశ్నలను సిద్దం చేసుకుని మేయర్‌కు సమర్పించారు. అంతేగాక, నగరంలో అకాల వర్షాలు, అస్తవ్యస్తమైన శానిటేషన్, కళాసీగూడలోని నాలాలో పడి చిన్నారి మృతి చెందిన ఘటన, వరద ముంపు నివారణ చర్యలు విపక్షాల సభ్యులు సిద్దమవుతున్నట్లు సమాచారం.

అధికార గులాబీ పార్టీ పాలక మండలి పెద్దలను ఇరుకున పెట్టేందుకు వ్యూహాన్ని సిద్దం చేసినట్లు సమాచారం. దీంతో పాటు శానిటేషన్‌కు ప్రతి నెల కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నా, కనీసం సకాలంలో చెత్తసేకరణ, రవాణా జరగకపోవటంపై అధికారులను నిలదీసేందుకు కాంగ్రేస్, మజ్లిస్, బీజేపీ పార్టీలు సిద్దమవుతున్నట్లు తెలిసింది. కౌన్సిల్ వాయిదా వేయటంపై బీజేపీ సభ్యులు గళం విప్పనున్నట్లు సమాచారం. ముఖ్యంగా రంజాన్ మాసంలోనూ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో సక్రమంగా నీటి సరఫరా కాకపోవటం, విద్యుత్ సరఫరాలో అంతరాయం, ప్రార్థన స్థలాల వద్ద అరకోర ఏర్పాట్లు చేయటంపై మజ్లిస్ సైతం అధికారులను నిలదీయనున్నట్లు సమాచారం.

ముందుగానే ప్రశ్నల స్వీకరణ

గత నెల 27న కౌన్సిల్ సమావేశం నిర్వహించాలన్న యోచనతో నెల రోజుల ముందే సభ్యుల నుంచి ప్రశ్నలను స్వీకరించినట్లు సమాచారం. ఒక్కో పార్టీకి చెందిన సభ్యుల నుంచి వందల సంఖ్యలో ప్రశ్నలు వచ్చినట్లు సమాచారం. కానీ ఇందులో ఏఏ ప్రశ్నను కౌన్సిల్‌లో ప్రస్తావించాలన్న విషయాన్ని మేయర్ నిర్ణయించనున్నారు. బీజేపీ, కాంగ్రేస్ పార్టీలు సికింద్రాబాద్ కళాసీగూడలో నాలాలో పడి చిన్నారి మృతి చెందిన ఘటనను సీరియస్‌గా ప్రస్తావించాలని, ఈ ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే కారణంగా సభ దృష్టికి తేవాలని భావిస్తున్నట్లు సమాచారం.

Also read: బిగ్ న్యూస్: మహారాష్ట్రపై కన్నేసిన KCR.. BRS బలోపేతానికి గులాబీ బాస్ నయా వ్యూహం!

Advertisement

Next Story