Bihar: జంగిల్ రాజ్ కావాలా? అభివృద్ధి కావాలా?

by S Gopi |
Bihar: జంగిల్ రాజ్ కావాలా? అభివృద్ధి కావాలా?
X

దిశ, నేషనల్ బ్యూరో: '2025లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, బీహార్‌ను నక్సల్స్ రహితంగా మార్చినట్టే, వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాన్ని శాశ్వత వరద సమస్య నుంచి విముక్తి చేస్తామని హామీ ఇస్తున్నాను' అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం అన్నారు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌ మధ్య బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో రాష్ట్రంలోని 38 జిల్లాల్లో సగం జిల్లాలు వరద నీటిలో చిక్కుకున్న నేపథ్యంలో అమిత్ షా పై వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ స్వస్థలమైన బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల బీహార్ పర్యటనలో భాగంగా జరిగిన ర్యాలీలో ప్రసంగించిన అమిత్ షా.. మీరు లాలూ-రబ్రీ జంగిల్ రాజ్‌ని ఎంచుకోవాలా, నరేంద్ర మోడీ-నితీష్ కుమార్‌ల డబుల్ ఇంజిన్, అభివృద్ధి-ఆధారిత ప్రభుత్వాన్ని ఎంచుకోవాలా అనేది నిర్ణయించుకోండి. 2004-05లో బీహార్ వార్షిక ప్రణాళిక పరిమాణం రూ. 23,000 కోట్లు. 2024-25లో ఇది రూ. 3,23,000 కోట్లతో అనేక రెట్లు పెరిగింది. గత రెండు దశాబ్దాల్లో బీహార్ ఎంత వేగంగా అభివృద్ధి జరిగిందో ఈ గణాంకాలు చెబుతున్నాయి. లాలూ-రబ్రీ గత పాలనలో వరద కుంభకోణం, తారు కుంభకోణం, అన్నింటికంటే దాణా కుంభకోణం. అన్ని రకాల కుంభకోణాలకు సాక్ష్యంగా వారి పాలన సాగింది. దాణా కుంభకోణంలో లాలు లక్ష్యం ఒకటే, తన కుమార్తెను ఎంపీని చేయడం, తర్వాత కొడుకును బీహార్ సీఎం చేయడమేనని అమిత్ షా విమర్శల హీట్ పెంచారు.

ఎన్డీఏను వదులుకోను

అంతకుముందు, పాట్నాలో జరిగిన సహకార మంత్రిత్వ శాఖ కార్యక్రమంలో, అమిత్ షా, నితీష్ ఒకే వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నితీష్.. తాను ఇకపై ఎన్డీఏను వదులుకోబోనని స్పష్టం చేశారు. గత దశాబ్దంలో, నేను వారితో (ఆర్‌జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌ను ఉద్దేశించి) రెండు పర్యాయాలు చేరాను, ఆపై రెండుసార్లు ఎన్డీఏలోకి తిరిగి వచ్చాను. ఇకమీదట ఎన్నడూ ఎన్డీఏను వదిలిపెట్టనని హామీ ఇస్తున్నాను' అని చెప్పారు.

Next Story

Most Viewed