ఈనెల 8న మంచిర్యాలలో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-04 03:11:05.0  )
ఈనెల 8న మంచిర్యాలలో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అన్యాయంగా ఎంపీ పదవి నుంచి తొలగించారంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షను చేపట్టి అదే రోజున భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట సత్యాగ్రహ దీక్షను చేపడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ తో పాటు ఉత్తర తెలంగాణ పాత జిల్లాలైన నిజామాబాద్, కరీంనగర్ వరంగల్ జిల్లాల నుంచి భారీగా జనాలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

రేవంత్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష

మంచిర్యాల జిల్లా కేంద్రంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షను ఈనెల 8వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు కార్యక్రమం ఖరారైంది. మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట దీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నందున కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడుతున్నది.

సింగరేణి కార్మికులు గణనీయంగా ఉండే మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని ఎన్నుకోవడం వెనుక పార్టీకి బహుళ ప్రయోజనాలు ఉంటాయని యోచిస్తున్నారు. తూర్పు జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుందని అలాగే పొరుగున ఉన్న పెద్దపల్లి కరీంనగర్ భూపాలపల్లి తదితర జిల్లాల్లోనూ పార్టీకి ఈ దీక్ష ద్వారా జవసత్వాలు తీసుకురావచ్చన్న ఆలోచనలు భాగంగానే రేవంత్ రెడ్డి మంచిర్యాల కేంద్రాన్ని ఎంచుకున్నట్లు సమాచారం.

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే రాక

ఈనెల 8న రేవంత్ రెడ్డి చేపట్టనున్న సత్యాగ్రహ దీక్షను అనంతరం జరిగే బహిరంగ సభను జయప్రదం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. కనీసం లక్ష మందితో సభను నిర్వహించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్లతో మంతనాలు జరిపారు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్ష బహిరంగ సభలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరవుతుండడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది.

ఆయనతోపాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్ ఠాక్రే, పార్టీ సీనియర్ నేతలు జైరాం రమేష్, రోహిత్ చౌదరి తదితరులతోపాటు తెలంగాణకు చెందిన పార్టీ సీనియర్లందరూ ఈ సభకు హాజరవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి భారీగా జన సమీకరణకు పార్టీ అధిష్టానం నియోజకవర్గాల వారీగా బాధ్యులను నియమిస్తోంది.

విభేదాలు సమస్య పోతాయా..?

ఈనెల 8వ తేదీన మంచిర్యాలలో నిర్వహిస్తున్న టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి సత్యాగ్రహ దీక్షతోపాటు పార్టీ భారీ బహిరంగ సభల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతల నడుమ ఉన్న విభేదాలు సమసి పోతాయా... లేదా అన్నది పార్టీ కార్యకర్తల్లో నెలకొంది సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన యాత్ర సందర్భంగా కూడా జిల్లా పార్టీలో ఉన్న విభేదాలు బయటపడ్డాయి. తూర్పు జిల్లాను మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు శాసిస్తుండగా... పశ్చిమ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గ్రూప్ రాజకీయాలు నడుపుతున్నారు. తాజా పార్టీ విస్తరణ కార్యక్రమాల సందర్భంగా ఆయన నేతలంతా ఏకతాటిపైకి రావాలని కార్యకర్తలు ఆశిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు హాజరవుతున్న సభలో విభేదాలు బయటపడితే పార్టీ ఇమేజ్ దెబ్బ తింటున్న అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది.

సభ నిర్వహణ బాధ్యతలు ప్రేమ్ సాగర్‌కు...

మంచిర్యాలలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహార దీక్షతో పాటు భారీ బహిరంగ సభ ఏర్పాట్లను టీపీసీసీ సీరియస్‌గానే భావిస్తోంది. భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్న నేపథ్యంలో కార్యక్రమం జయప్రదం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. సభ నిర్వహణ బాధ్యతలను మాజీ శాసనమండలి సభ్యుడు కే ప్రేమ్ సాగర్ రావుకు అప్పగిస్తున్నట్లు తెలిసింది. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ తొలి సభను ఇంద్రవెల్లిలో జయప్రదం చేసే విషయంలో ప్రేమ్ సాగర్ రావు కృషి ఉంది. ఈ నేపథ్యంలోనే మంచిర్యాల బాద్యతలను సైతం ఆయనకే అప్పగిస్తున్నట్లు తెలిసింది.

Also Read..

ప్రధాని పదవి రేసులో కేసీ‌ఆర్.. ఆ కూటమికి చైర్‌పర్సన్ కావడానికి పక్కా ప్లాన్!

Advertisement

Next Story

Most Viewed