ఉప్పల్‌లో IPL మ్యాచ్ జరుగనివ్వం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన

by GSrikanth |
ఉప్పల్‌లో IPL మ్యాచ్ జరుగనివ్వం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రతిష్టాత్మక మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్‌లో తొలిసారి సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి. అయితే, ఈ మ్యాచ్‌కు ముందే వరుస వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న మైదానంలో విద్యుత్ అధికారులు కరెంట్ తీసేయగా.. ఇవాళ మ్యాచ్ జరుగనివ్వం అని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ జట్టులో హైదరాబాద్ ప్లేయర్లు లేకపోవడం దారుణమన్నారు.

స్టేడియం ముందు కూర్చొని ఎలా ఆడుతారో మేమూ చూస్తామని హెచ్చరించారు. మ్యాచ్‌ టికెట్లు ఆన్‌లైన్‌లో 20 నిమిషాల్లోపే విక్రయాలు పూర్తవడం ఏంటని ప్రశ్నించారు. HCAతో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తామని అన్నారు. హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లకు టికెట్స్ దొరకకపోవడం దారుణమన్నారు. ఐపీఎల్ టికెట్లు మొత్తం బ్లాక్ మార్కెట్ దందా జరుగుతోందన్నారు. వేలాది టికెట్లు బ్లాక్ మార్కెట్‌లో అమ్మకాలు చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ మార్కెట్‌లో అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. బ్లాక్ మార్కెట్ దందాపై ముఖ్యమంత్రి, స్పోర్ట్స్ మినిస్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed