తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం!.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2024-06-22 08:46:40.0  )
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం!.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, రైతులపై మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలను విధిస్తే.. కాంగ్రెస్ కిసాన్ న్యాయ్ కు కట్టుబడి ఉందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. రుణమాఫీ పై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన మోడీ ప్రభుత్వం పై పలు విమర్శలు చేశారు. తెలంగాణలోని 40 లక్షలకు పైగా రైతు కుటుంబాలను రుణమాఫీ చేసేందుకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని హర్షం వ్యక్తం చేశారు.

అలాగే 16 సంవత్సరాల క్రితం, కాంగ్రెస్-యుపిఎ ప్రభుత్వం 3.73 కోట్ల మంది రైతులకు సంబంధించిన రూ. 72 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మరియు వడ్డీలను మాఫీ చేసిందని, ఆ తర్వాత అనేక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుల రుణాలను మాఫీ చేశామని గుర్తుచేశారు. ఒకవైపు మోడీ ప్రభుత్వం దేశంలోని రైతులపై మూడు నల్ల చట్టాలను విధించి, ముళ్ల తీగలు, డ్రోన్ల నుండి టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, లాఠీ దెబ్బలతో నెలల తరబడి వేధిస్తే.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ “కిసాన్ న్యాయ్” కింద సరసమైన ధరలు, రుణమాఫీ కమిషన్, బీమా చెల్లింపుల ప్రత్యక్ష బదిలీ, న్యాయమైన వ్యవసాయ దిగుమతి-ఎగుమతి పాలసీకి హామీ ఇచ్చిందని తెలిపారు. మా ఈ ఎజెండా చెక్కుచెదరకుండా ఉంటుందని ఖర్గే స్పష్టం చేశారు.

Advertisement

Next Story