కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ ధర్నాలు.. స్టేట్‌లో పొలిటికల్ హీట్!

by Sathputhe Rajesh |
కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ ధర్నాలు.. స్టేట్‌లో పొలిటికల్ హీట్!
X

దిశ, తెలంగాణ న్యూస్ నెట్‌వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రెండు ప్రధాన పార్టీలు పోటాపోటీ నిరసనలకు దిగాయి. ధర్నాలు, నిరసనలు, దిష్టిబొమ్మల దహనాలతో హోరెత్తించాయి. ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో ధర్నాలు, కాంగ్రెస్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. తెలంగాణ రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎందుకంత అక్కసు అంటూ బీఆర్ఎస్ శ్రేణులు కన్నెర్ర చేశాయి.

ఇక బీఆర్ఎస్ ధర్నాలకు కౌంటర్‌గా కాంగ్రెస్ సైతం అన్ని మండల కేంద్రాల్లోని సబ్ స్టేషన్ల ముందు కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తున్నదని, 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. అలాగే రాహుల్ అనర్హత వేటుకు వ్యతిరేకంగా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ధర్నాలు పోలిటికల్ హీట్ పెంచింది.

రేవంత్‌కు ఎందుకు కడుపు మంట..

రేవంత్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ బోగస్ అని రేవంత్ మాటలతో అర్థమైందన్నారు. వ్యవసాయ రంగానికి బీఆర్ఎస్ సర్కార్ 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే కాంగ్రెస్‌కు రేవంత్‌కు ఎందుకు కడుపు మంట అని ప్రశ్నించారు.

మూడు గంటలు కరెంటు చాలన్న రేవంత్.. బేషరతు రైతుల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం విద్యుత్ సౌదా ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రేవంత్ రెడ్డికి పరిశ్రమలకు ఇవ్వొద్దు అనే ధైర్యం ఉందా?అని సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

గాంధీ‌భవన్‌లో మౌన దీక్ష

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా పార్టీ నేతలు దేశవ్యాప్తంగా ఇవాళ ఆందోళనకు దిగారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, సీనియర్ నాయకులు కోదండరెడ్డి, సునీతారావ్ తదితరులు పాల్గొన్నారు.

పార్టీల పట్టు.. జనం పాట్లు

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేపట్టిన ధర్నాలతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రేవంత్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఖైరతాబాద్‌లోని విద్యుత్ సౌధ ముందు ధర్నాకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆఫీసులకు వెళ్లే సమయంలో బీఆర్ఎస్ ధర్నాకు దిగడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సెక్రటేరియట్ నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వరకు, అసెంబ్లీ నుంచి లక్డీకపూల్, షాదాన్ కాలేజ్ నుంచి ఖైరతాబాద్ సిగ్నల్ వరకు ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంజాగుట్ట, అమీర్ పేట్, బేగంపేట్ నుంచి వచ్చే వాహనాలు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్ వల్ల పది నిమిషాల జర్నీకి దాదాపు రెండు గంటల సమయం పట్టడంపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల్లోనూ రహదారులపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటా పోటీ నిరసనలతో వాహనాదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు.

Advertisement

Next Story