'తెలంగాణ రైతులను ఆదుకోని కమీషన్ రావు దేశాన్ని ఉద్దరిస్తాడట..!'

by Nagaya |   ( Updated:2022-12-26 13:58:18.0  )
తెలంగాణ రైతులను ఆదుకోని కమీషన్ రావు దేశాన్ని ఉద్దరిస్తాడట..!
X

దిశ, డైనమిక్ బ్యూరో : అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటే ఏంటో జర చెప్పండి బీఆర్ఎస్ కేసీఆర్ గారు? అంటూ వైఎస్సార్టీపీ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌‌పై షర్మిల వరుసగా ప్రశ్నల వర్షం కురిపించారు. దేశంలోనే రాష్ట్రాన్ని అప్పుల్లో అగ్రస్థానంలో పెట్టడం రైతుకు భరోసానా అని నిలదీశారు. ఒక్కో రైతు నెత్తి మీద లక్షన్నర అప్పు పెట్టడం అభివృద్ధా అని అడిగారు. రాష్ట్రంలోని 37లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టడం మీ బీఆర్ఎస్ నినాదమా..? అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అంతేకాకుండా, 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమే కిసాన్ సర్కార్ అంటారా ? అని మండిపడ్డారు. సబ్సిడీ పథకాలను బంద్ పెడితే రైతు సంక్షేమ ప్రభుత్వమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక చేత్తో రైతుబంధు ఇచ్చి.. మరో చేత్తో వెనక్కి తీసుకోవడం రైతును ఆదుకున్నట్లా అని ఫైర్ అయ్యారు. ఉచిత ఎరువులు అని చెప్పి పంగనామాలు పెట్టడం, బ్యాంకుల ఎదుట రైతులను మోసగాళ్లను చేయడం... పంట నష్టపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం.. ఇదేనా "అబ్ కీ బార్ కిసాన్" సర్కార్! అని నిలదీశారు. మీది అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ కాదు. "ఆప్ కి బర్బాత్ సర్కార్" అంటూ విమర్శించారు. కన్న తల్లికి అన్నం పెట్టలేనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నాడట అని సెటైర్లు వేశారు. ఈ బంగారు గాజుల లెక్కనే ఉన్నది దొర కేసీఆర్ తీరు కూడా అని షర్మిల కామెంట్స్ చేశారు. ఇక్కడ రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు, పంటకు గిట్టుబాటు ధర రాదు, రుణమాఫీ జాడ లేదు, కౌలు రైతుకు దిక్కేలేదంటూ మండిపడ్డారు. రైతును అప్పుల పాలు చేసి కోటీశ్వరులు చేశానని చెప్పే నీ బర్బాత్ సర్కార్ మాటలు నమ్మే రోజులు పోయాయని అన్నారు. ఇక్కడి రైతులను ఆదుకోని కమీషన్ రావు దేశాన్ని ఉద్దరిస్తాడట..! అంటూ సైటైర్లు వేశారు.

Advertisement

Next Story

Most Viewed