నేడే నీతి ఆయోగ్ సమావేశం.. బహిష్కరిస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటన

by Gantepaka Srikanth |   ( Updated:2024-07-26 22:30:26.0  )
నేడే నీతి ఆయోగ్ సమావేశం.. బహిష్కరిస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరుగుతున్న నీతి ఆయోగ్ 9వ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బహిష్కరించారు. ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడానికి నిరసనగా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్... రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రాల సమాఖ్యగా రాజ్యాంగం స్పష్టత ఇచ్చిందని, అన్ని రాష్ట్రాల సమీకృత, సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని ఆ తీర్మానంలో సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచీ ఇదే ధోరణి కొనసాగిందని కేంద్రంపై ఆరోపణలు చేసిన సీఎం... కేంద్ర వైఖరికి తీవ్ర అసంతృప్తిని, నిరసనను తెలియజేస్తున్నదని పేర్కొన్నారు. ఏకగ్రీవంగా ఈ తీర్మానం ఆమోదం పొందింది.

ఈ తీర్మానపై చర్చ సందర్భంగానే అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగానే ఈ నెల 27న జరగనున్న నీతి ఆయోగ్ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. అందులో భాగంగానే శుక్రవారం జరగనున్న సమావేశానికి హాజరుకావడంలేదు. ‘ఇండియా’ కూటమి పార్టీలకు చెందిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఈ సమావేశాన్ని బహిష్కరించారు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్‌వీందర్ సింగ్ సుఖు తదితరులు ప్రకటించారు. గతంలోనూ నీతి ఆయోగ్ సమావేశాన్ని మాజీ సీఎం కేసీఆర్ రెండు సార్లు బహిష్కరించారు. నీతి ఆయోగ్ ఒక నిరర్ధక సంస్థ అని, ఈ సమావేశంతో రాష్ట్రాలకు ఒరిగేదేమీ ఉండదని, సహకార సమాఖ్య స్ఫూర్తి ఉండదని ఓపెన్‌గానే చెప్పిన కేసీఆర్ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి ప్రధానికి సైతం లేఖ రాశారు.

కేంద్రంలో మోడీ నేతృత్వంలో గతంలో ఎనిమిదిసార్లు నీతి ఆయోగ్ జనరల్ కౌన్సిల్ సమావేశాలు జరగ్గా ఇప్పుడు థర్డ్ టర్ములో ఫస్ట్ మీటింగ్ జరుగుతున్నది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు జనరల్ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed