గేర్ మార్చిన CM రేవంత్.. జెట్ స్పీడ్‌లో స్కీములు, అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం..!

by Satheesh |   ( Updated:2024-03-11 03:13:53.0  )
గేర్ మార్చిన CM రేవంత్.. జెట్ స్పీడ్‌లో స్కీములు, అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎలక్షన్ కోడ్​రానున్న నేపథ్యంలో మంత్రులు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను వీలైనంత తొందరగా పూర్తి చేసుకోవాలని, వారం రోజుల్లోనే కంప్లీట్ అయితే ఇంకా మంచిదంటూ హింట్ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు మార్చి సెకండ్ వీక్‌లోనే వచ్చే అవకాశం ఉంది. దానికి తగినట్లుగానే మార్చి ఫస్ట్ వీక్ నుంచే యాక్టివిటీస్‌ను రేవంత్​ ముమ్మరం చేశారు. కోడ్ వస్తే గ్యారెంటీలు, హామీలతో పాటు అభివృద్ధి, అధికారిక కార్యక్రమాలకు వీలుండదనే ఉద్దేశంతో వీటిని ఈ నెల మొదటి రోజు నుంచే స్పీడప్ చేశారు.

దానికి కొనసాగింపుగానే ఈ నెల 11న కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌ను సీఎం, మంత్రులు ప్రారంభిస్తున్నారు. ఆరు గ్యారెంటీల్లో మరికొన్నింటినీ గాడిలో పెట్టేందుకు ఈ నెల 12న మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 ఆర్థిక సాయం స్కీమ్‌పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అదే రోజు సాయంత్రం లక్ష మంది మహిళలతో ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి వడ్డీలేని రుణాన్ని అందించే పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. వీలైతే అదే వేదిక మీద మహాలక్ష్మీ గ్యారంటీపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశమున్నది.

ఈ గ్యారెంటీలు, హామీలు, వెల్ఫేర్ స్కీమ్‌లను ప్రారంభించటం ద్వారా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో అనుకూల మైలేజ్ పొందాలన్నది పార్టీ ఉద్దేశం. ఇప్పటికే 4 గ్యారెంటీలను అమలు చేశామని, ఇందిరమ్మ ఇండ్లను కూడా ప్రారంభించనున్నట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క తదితరులు భారీ స్థాయిలో ప్రచారం చేశారు. ఇక అభివృద్ధి పనుల విషయంలో ఊహకు అందనంత వేగంగా ఒకే రోజున మూడు చొప్పున గత వారం రోజులుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో నగరంలో హడావుడి వాతావరణం నెలకొన్నది.

ఇందిరమ్మ ఇండ్ల స్కీం ప్రారంభమైతే 5 గ్యారెంటీలు పూర్తయినట్లు అవుతుంది. ఇంకా 8 హామీలు గాడిన పడాల్సి ఉన్నది. ఈ నెల 17 నాటికి వంద రోజులు కంప్లీట్ అవుతున్నందున అప్పటికల్లా ఎన్ని అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతామంటున్న కాంగ్రెస్.. షెడ్యూలు వచ్చేలోపు ఎన్ని ప్రారంభానికి నోచుకుంటాయన్నది కీలకం కానుంది. వంద రోజుల గడువు ముగిసేలోపే షెడ్యూలు వస్తే గ్యారంటీల లాంచింగ్‌కు బ్రేకులు పడతాయి.

గత రెండు వారాల్లో రేవంత్‌రెడ్డి యాక్టివిటీస్ ఇవీ..

ఫిబ్రవరి 27: మహాలక్ష్మిలోని రూ. 500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతిలోని 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యారంటీలకు సచివాలయంలో ప్రారంభోత్సవం. అదే రోజు సాయంత్రం చేవెళ్ళలో భారీ బహిరంగ సభ.

ఫిబ్రవరి 28 : మీడియా అకాడమీ చైర్మన్‌గా శ్రీనివాసరెడ్డి నియామకం

ఫిబ్రవరి 29 : మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, 11,062 పోస్టుల భర్తీ కోసం..

మార్చి 1: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణలోనూ అమలు చేయాలని అధికారిక నిర్ణయం.

మార్చి 4 : ఎల్బీ స్టేడియంలో సుమారు 6 వేల మందికి టీచర్లు, జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాల పంపిణీ

మార్చి 6 : రైతు నేస్తం కార్యక్రమంలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్సు సౌకర్యం కల్పించేందుకు హామీ. అదే రోజు మహబూబ్‌నగర్‌లో ప్రజాదీవెన సభలో ఆ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి పేరు ప్రకటన.

మార్చి 7 : ప్యారడైజ్ - షామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అల్వాల్‌లోని టిమ్స్ దగ్గర శంకుస్థాపన. హైదరాబాద్‌లో బాబూ జగ్జీవన్‌రామ్ భవన్ ప్రారంభోత్సవం.

మార్చి 8 : పాతబస్తీలోని ఇబ్రహీంబాగ్‌లో ముస్లిం మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలు, కాలేజీ ప్రారంభోత్సవం. ఎంజీబీఎస్ - ఫలక్‌నుమా మెట్రో రైల్ కొత్త లైన్ నిర్మాణానికి ఫారూక్‌నగర్ బస్ డిపో దగ్గర శంకుస్థాపన

మార్చి 9 : స్వయం సహాయక మహిళా బృందాలకు బ్యాంకు లింకేజీ సౌకర్యానికి శ్రీకారం. బైరామల్ గూడ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం. ఉప్పల్‌లో నల్లచెరువు మురికినీటి శుద్ధీకరణ ప్లాంట్‌కు ప్రారంభోత్సవం. ప్యారడైజ్-బోయిన్‌పల్లి డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి కండ్లకోయ దగ్గర శంకుస్థాపన.

మార్చి 10 : ఉద్యోగులు, ఉపాధ్యాయులతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశం.

మార్చి 11 : కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌కు ప్రారంభోత్సవం

మార్చి 12 : మహిళలకు వడ్డీ లేని రుణాల పథకం పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా లక్ష మంది మహిళలతో పరేడ్ గ్రౌండ్స్​లో భారీ బహిరంగసభ

Advertisement

Next Story

Most Viewed