డిసెంబర్ 9న రాష్ట్రానికి సోనియా.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు

by karthikeya |
డిసెంబర్ 9న రాష్ట్రానికి సోనియా.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీని డిసెంబర్ 9న హైదరాబాద్‌కు ఆహ్వానించాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. సెక్రెటేరియట్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణతల్లి విగ్రహాన్ని ఆమె చేతుల మీదుగా ఆవిష్కరింపజేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 9వ తేదీని తెలంగాణ కాంగ్రెస్ కీలకంగా భావిస్తున్నది. ఆ రోజున కేంద్ర హోంమంత్రి హోదాలో చిదంబరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. పవర్‌లోకి వచ్చిన తర్వాత ఆ రోజున అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని సర్కారు నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సోనియా చేతుల మీదుగా ఆవిష్కరింపజేయాలని సీఎం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది.

స్పీడ్‌గా పనులు

ఆవిష్కరణకు రెండు నెలలే సమయం ఉండడంతో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. సెక్రటేరియట్ పోర్టికో ముందు ఏర్పాటు చేయనున్న విగ్రహాన్ని మొదలుకొని మెయిన్ గేటు వరకు రెండు వైపులా వాటర్ ఫౌంటేన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఫౌంటెన్స్ మధ్యలో ఉన్న స్థలంలో రెండున్నర ఫీట్ల ఎత్తుతో గ్రైనెట్ అమర్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. జేఎన్‌టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ తయారు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ డిజైన్ విషయంలో సీఎం రేవంత్ కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని సూచించినట్టు తెలిసింది.

భారీ బహిరంగ సభకు ప్లాన్

డిసెంబర్ 7న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కానున్నది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలకు ప్లాన్ చేస్తున్నారు. ఎలాగూ డిసెంబర్ 9న సోనియాగాంధీ రాష్ట్రానికి వస్తుండటంతో, హైదరాబాద్‌లో లేదా వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సర్కారు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ పాలనలో అమలువుతున్న ఆరు గ్యారంటీల అమలు, ఇతర సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ఈ సభలో ప్రజలకు వివరించనున్నట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed