- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కమల’ దళపతిపై మరికొన్ని గంటల్లో క్లారిటీ.. BJP హై కమాండ్ నిర్ణయంపై స్టేట్ పాలిటిక్స్‌లో తీవ్ర ఉత్కంఠ..!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర బీజేపీలో తలెత్తిన సంక్షోభంపై హైకమాండ్ తేల్చే సమయం ఆసన్నమైంది. నాయకత్వ మార్పు ఉంటుందా లేదా అనే దానిపై నేడు క్లారిటీ రానున్నది. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్ నేత అమిత్ షా, ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోష్ తదితరులంతా రాష్ట్ర నాయకత్వం మార్పుపై సుదీర్ఘంగా చర్చించారని, త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.
ప్రధాని అధ్యక్షతన ఢిల్లీలో సోమవారం జరిగే కేబినెట్ భేటీలో మార్పులు చేర్పులపై చర్చించి కొద్దిమందిని పార్టీ అవసరాల కోసం తప్పించే అవకాశమున్నది. ఇప్పటికే అలాంటి మంత్రులకు సూచనప్రాయంగా సమాచారాన్ని చేరవేసినట్లు వార్తలు వస్తున్నాయి. స్టేట్ బీజేపీ చీఫ్‌ను మార్చడంతోపాటు సీనియర్లకు ప్రాధాన్యత ఇచ్చే అంశం కొలిక్కి రానున్నది.
నేతలు చేజారిపోకుండా..
బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను కిషన్‌రెడ్డికి అప్పగించనున్నట్లు జాతీయ, రాష్ట్ర నాయకుల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈటల రాజేందర్‌ను ఎన్నికల కమిటీ చైర్మన్‌గా నియమించనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఈ తరహా కొత్త మెకానిజాన్ని బీజేపీ ఫస్ట్ టైమ్ ఏర్పాటు చేస్తున్నది.
పార్టీలో సంస్థాగతంగా జరిగే మార్పులతో అసంతృప్తి తలెత్తి, నేతలు జారిపోకుండా ఇతర బాధ్యతలతో సంతృప్తి పర్చాలని పార్టీ హై కమాండ్ భావిస్తున్నది. సీనియర్ నేతలకు తగిన ప్రాధాన్యతను ఇవ్వాలనుకుంటున్నది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో జరిగే మార్పులు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వీలుగా తగిన ఎత్తుగడలు వేస్తున్నది.
ఐదు రాష్ట్రాలపై ఫోకస్..
అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలపై పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. కర్ణాటకలో అధికారాన్ని కోల్పోయిన అంశాన్ని సీరియస్‌గా తీసుకుని అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం తగిన వ్యూహాలపై ఫోకస్ పెట్టింది. ఐదు రాష్ట్రాల ప్రభావం రాజ్యసభలో బలాబలాలపై తేడా రావడంతోపాటు వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు ఎన్నికలపై ప్రభావం చూపుతుందని హైకమాండ్ ఆలోచిస్తున్నది. పార్లమెంటు ఎన్నికలకు ఏడాది ముందు నుంచే కసరత్తు మొదలుపెట్టింది.
క్యాడర్‌లో గందరగోళం
రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే విషయంలో ఢిల్లీ, హైదరాబాద్ స్థాయిలో వేర్వేరు వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేతలకు కూడా ఏం జరగనున్నదో స్పష్టంగా తెలిసే అవకాశం లేకుండా పోయింది. అన్ని స్థాయిల్లోనూ గందరగోళం నెలకొన్నది. తెలంగాణ స్టేట్ చీఫ్‌గా బండి సంజయ్‌ను మార్చితే దాని ప్రకంపనలు ఎలా ఉంటాయో, ఎలాంటి అసంతృప్తి తలెత్తుతుందో, పార్టీ నుంచి వెళ్లిపోయే ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో జాతీయనేతలు లెక్కలు వేసుకుంటున్నారు.
రాష్ట్రంలో పలువురు నేతల మధ్య ఎడమొహం-పెడమొహం తరహా వాతావరణం ఉన్నందున ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రభావం ఎటు దారితీస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. వరంగల్‌లో ఈ నెల 8న ప్రధాని కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం కోసం ఆదివారం జరిగిన సన్నాహక సమావేశంలో ఈటల రాజేందర్, బండి సంజయ్ తూర్పు-పడమరగానే వ్యవహరించారు. పార్టీ నాయకత్వంలో ఎలాంటి మార్పూ ఉండదంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
గత వారం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్ సైతం ఇదే విషయాన్ని నొక్కిచెప్పారు. అయినా రాష్ట్ర స్థాయి నేతల్లో అనుమానాలు అలాగే ఉండిపోయాయి. గందరగోళం కంటిన్యూ అవుతూనే ఉన్నది. రాష్ట్రంలో సీనియర్ నేతలుగా ఉన్న బండి సంజయ్, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, విజయశాంతి, వివేక్, జితేందర్‌రెడ్డి, రఘునందన్‌రావు.. ఇలా అనేక మందిలో ఏదో ఒక రకమైన విభేదాలు, భిన్నాభిప్రాయాలు, అసంతృప్తి, తగిన ప్రాధాన్యత లేదనే నిరుత్సాహం వ్యక్తమవుతున్నది. చాలాకాలం పాటు నర్మగర్భంగా ఉండిపోయిన ఇవి ఇప్పుడు ట్వీట్‌ల ద్వారా రోడ్డెక్కాయి. ఈటల రాజేందర్ తాజాగా హిందీలో సైతం ట్వీట్ చేయడం బీజేపీ అగ్ర నేతలను ప్రసన్నం చేసుకోవడంలో భాగమేననే వాదన తెరపైకి వచ్చింది.
కర్ణాటక రిజల్టు తర్వాత రాష్ట్ర బీజేపీ నేతల మధ్య తారాస్థాయికి చేరిన విభేదాలు, అంతర్గత సంక్షోభాన్ని కొలిక్కి తేవాలని భావిస్తున్న హై కమాండ్ ఢిల్లీలో సోమవారం జరిగే కీలక భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొన్నది. మరికొన్ని గంటల్లో కనీస స్థాయిలో లీకుల రూపంలో వెల్లడి కావచ్చని నేతలు భావిస్తున్నారు.