వృద్ధాశ్రమాల ఏర్పాటు అవసరం.. వారిని చూసుకునే బాధ్యత పిల్లలదే

by Mahesh |
వృద్ధాశ్రమాల ఏర్పాటు అవసరం.. వారిని చూసుకునే బాధ్యత పిల్లలదే
X

దిశ, తెలంగాణ బ్యూరో: పిల్లలకు చెందిన బేబీ కేర్ కేంద్రాల తరహాలో సమాజంలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు అవసరమని హైకోర్టు జస్టిస్ జీ. రాధా రాణి అన్నారు. చండ్ర రాజేశ్వర రావు (సీఆర్) ఫౌండేషన్ వృద్ధాశ్రమ 23 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్, కొండాపూర్ సీఆర్. ఫౌండేషన్ ప్రాంగణంలో ఆదివారం వార్షికోత్స సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ రాధా రాణి మాట్లాడుతూ.. సంపాదన మొత్తం పిల్లలకే ఇచ్చి, వారిపై ఆధారపడడం బాధకరమని, పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాలని, మన తదనంతరం సంపాదన ఇచ్చుకోవచ్చని సూచించారు.

ఇది వరకే ఎవరైనా గిఫ్ట్ డీడీలు చేస్తే, ఇప్పటికీ వాటిని రద్దు చేసుకునే వెసులుబాటు కూడా ఉన్నదని వివరించారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత ఆడ, మగ ఇద్దరిపైనా ఉంటుందని, అది మన కర్తవ్యమన్నారు. వృద్ధుల అనుభవాలు విజ్ఞానపు ఘనులని, ఆ విజ్ఞానాన్ని ఇతరులకు అందించాలని సూచించారు. దేశంలో 15 కోట్ల వృద్ధుల జనాభా ఉన్నదని, 2050 నాటికి మరో మూడు రెట్లు పెరుగుతుందన్నారు.

వృద్ధాశ్రమాలంటే అనాథాశ్రమాలనడం పొరపాటు : సురవరం సుధాకర్ రెడ్డి

ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వృద్ధాశ్రమాలంటే అనాధ ఆశ్రమాలు అనే పొరపాటు అభిప్రాయాలు ఉన్నాయని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ఉద్యోగాల పేరుతో పిల్లలు దూరంగా ఉన్నప్పుడు, అనేక కారణాలతో పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, వారు తమ తల్లిదండ్రులకు తగిన సమయాన్ని కేటాయించలేక పోతున్న నేపథ్యంలో వృద్ధాశ్రమలు అవసరమని తెలిపారు. చండ్ర రాజేశ్వరరావు గొప్ప దేశ భక్తుడని, నిజాం నిరంకుశ పాలనకు, తీవ్రమైన ఫ్యూడల్ వ్యవస్థ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ ఆదేశాల ప్రకారం సుబ్బారెడ్డి మారు పేరుతో రెడ్డి హాస్టల్ చేరి, ఇతర విద్యార్థుల్లో రావి నారాయణ రెడ్డి, గురువారెడ్డి వామపక్ష భావాలు కలిగిన వారితో కలిసి, ఫ్యూడల్ వ్యతిరేక పోరాట ఆవశ్యకత వివరించారని తెలిపారు.

రాజేశ్వర్ రావు మరణానంతరం ఆయన కోరిక మేరకు చిన్న వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసేందుకు సి.ఆర్. ఫౌండేషన్ ఏర్పాటు చేశామన్నారు. సీఆర్. ఫౌండేషన్ అధ్యక్షుడు కె.నారాయణ మాట్లాడుతూ.. మన జీవితాన్ని మనమే సరిదిద్దుకోవాలని అన్నారు. వృద్దులు నిరాశ నిస్పృహలకు గురికావద్దని, సూచించారు. ఈ కార్యక్రమంలో సీఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, కార్యదర్శులు చెన్నమనేని వెంకటేశ్వర్ పి. జె. చంద్రశేఖర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, చెన్నకేశవరావు, డాక్టర్ రజనీ తదితరులు హాజరయ్యారు.

Advertisement

Next Story