- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపాధి నిధులకు కేంద్రం బ్రేక్.. ఆగిపోయిన రూ. 500 కోట్ల నిధులు
దిశ, తెలంగాణ బ్యూరో: పంచాయతీ భవనాల కోసం విడుదలైన నిధులు వెనక్కి వెళ్లాయి. దాదాపు రూ. 500 కోట్ల ఈజీఎస్ ఫండ్స్ ఆగిపోయాయి. ఆర్థిక సంవత్సరం ముగియడంతో.. ఉపాధి హామీ నిధులకు బ్రేక్ పడింది. ఉపాధి హామీలో మంజూరైన నిధులను వినియోగించుకోవడంలో రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం చేసింది. రాష్ట్రం వాటాగా ఎంతో కొంత నిధులిస్తే.. పనులు ముందుకు సాగేవి. కనీసం ఆ పనులు ప్రారంభమయ్యేవి. కానీ, ఒక్క పని కూడా మొదలుపెట్టకపోవడంతో.. దాదాపు రూ. 500 కోట్లు ఆగిపోయాయి. వీటిలో అత్యధికంగా గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలతో పాటుగా ఇతర కార్యాలయాల నిర్మాణాలే.
కొత్త భవనాలు కొన్నే
రాష్ట్రంలో కొత్త పంచాయతీల ఏర్పాటుతో మొత్తం సంఖ్య 12,769కి చేరాయి. దీనిలో 6,457 పంచాయతీలకు సొంత భవనాలు లేవు. వీటికి కొత్త భవనాల కోసం ఉపాధి నిధులను వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా రాష్ట్రం వాటాగా రూ. 400 కోట్లు ఇస్తామని 2019లోనే ప్రకటించారు. ఒక్కో పంచాయతీకి ఉపాధి హామీ నుంచి రూ. 13 లక్షలను వినియోగించుకునే అవకాశం ఉంది. దీనికి అదనంగా కొంత నిధులను కలుపుకుని, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా అనుమతి ఇస్తే పంచాయతీ భవనాల నిర్మాణ పనులు మొదలయ్యేవి. కొత్త పంచాయతీ భవనాలను నిర్మిస్తామని ప్రభుత్వం ఉపాధి హామీ నుంచి 4,159 భవనాలను అనుమతిచ్చింది. పలు దఫాలుగా వీటిని విడుదల చేశారు. మొదటి విడతలో 1666, రెండో విడుతలో 977, మూడో విడతలో 1074 ఇవ్వగా.. గతేడాది ఆర్థిక సంవత్సరంలో 442 పంచాయతీ భవనాల నిర్మాణాలకు ఆమోదం ఇచ్చారు. కానీ వీటిలో నిర్మాణాలు ప్రారంభించినవి కేవలం 1255 మాత్రమే. మిగిలిన భవనాల నిర్మాణాలకు నిధులు సరిపోవనే కారణంగా పనులు మొదలుపెట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా రూ. 400 కోట్ల నుంచి తమ గ్రామ పంచాయతీ భవనానికి నిధులు ఇవ్వాలంటూ విన్నవించుకుంటూనే ఉన్నారు. కనీసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటా నుంచైనా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కానీ, ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు.
విడుదలైన నిధులు వాపస్
2021–22 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి హామీ నుంచి పంచాయతీ భవనాలు, ఇతర భవనాల నిర్మాణాలకు విడుదల చేసిన నిధులన్నీ ఆపేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీలకు నోటీసులిచ్చింది. ఇప్పటి వరకు పంచాయతీ, ఇతర భవనాల నిర్మాణాలకు రూ.13 లక్షల చొప్పున కేటాయించి, మంజూరు పత్రాలు ఇచ్చామని, వాటిని నిర్ణీత గడువులో మొదలుపెట్టకపోవడంతో ఈ నిధులు వెనక్కి వెళ్లినట్లు వెల్లడించారు. ఇలా ఉపాధి హామీ నుంచి గ్రామ పంచాయతీ భవనాలు, పలు పనులకు కేటాయించిన రూ. 500 కోట్లపైమేరకు నిధులు ఆగిపోయాయి.
మరోవైపు ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన మార్పులతో కూడా ఈ పనులకు బ్రేక్ పడినట్లు అయింది. ఉపాధి హామీలో పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఉపాధి హామీలో కూలీలకు 60 శాతం, మెటీరియల్‌కు 40 శాతం నిధులు ఖర్చు చేయాలనే నిబంధ నలున్నాయి. గతంలో ఉన్న సాఫ్ట్‌వేర్ మెటీరియల్ పేమెంట్ కొంత మేరకు పెరిగినా సిస్టమ్ సహకరించడమే కాకుండా బిల్లుల విడుదలయ్యేయి. కానీ కొత్త సాఫ్ట్‌వేర్ నుంచి మెటీరియల్ కాంపోనెంట్ కింద ఒక్క శాతం పెరిగిన నిధులు రావు. బిల్లులు పెండింగ్ పడిపోతాయి. అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఉపాధి మెటీరియల్ కాంపొనెంట్ పనుల ప్రగతిని పరిశీలిస్తే.. 2018-19లో 51.19 శాతం, 2020-21లో 44.22 శాతం, 2021-22లో 44.94 శాతం మెటీరియల్ కాంపోనెంట్‌కు నిధులు ఖర్చు చేశారు. తాజా మార్పులతో ఇకపై 40 శాతం కన్నా ఒక్క రూపాయి అధికంగా ఉన్నా సాఫ్ట్‌వేర్ తీసుకోదు. ఈ కారణాలతో కూడా కొన్నిచోట్ల ఉపాధి హామీ నుంచి నిర్మాణ పనులు మొదలుపెట్టలేదనే విమర్శలున్నాయి.