రిజిస్ట్రేషన్ రద్దు.. రీఫండ్ ఏదీ? ధరణి పోర్టల్‌తో రైతులకు ట్రబుల్

by Rajesh |
రిజిస్ట్రేషన్ రద్దు.. రీఫండ్ ఏదీ? ధరణి పోర్టల్‌తో రైతులకు ట్రబుల్
X

దిశ, వెల్గటూర్ : రాష్ట్రంలో ధరణి పోర్టల్ లీలలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటివరకు పోర్టల్ వల్ల రైతులు పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి రాగా ప్రస్తుతం మరో కొత్త పంచాయితీ వెలుగులోకి వచ్చింది. ధరణి పోర్టల్ ద్వారా భూములు ఇతరత్రా రిజిస్ట్రేషన్ కోసం రైతులు చెల్లించిన చలాన్ డబ్బులు రైతులు అనివార్య కారణాలవల్ల రిజిస్ట్రేషన్ రద్దు చేసుకుంటే రీఫండ్ కావడం లేదని ఆందోళన చెందుతున్నారు. చలానా రూపంలో లక్షలాది రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ చేసి సంవత్సర కాలంగా ఎదురుచూస్తున్నా రిఫండ్ కావడం లేదని మండిపడుతున్నారు.

రిజిస్ట్రేషన్ కోసం బుక్ చేసుకున్న స్లాట్ను రద్దు చేసుకుంటే వారం పది రోజుల్లోనే చలాన్ డబ్బులు రిఫండ్ అయ్యేవి. ప్రస్తుతం సంవత్సరం గడిచినా కావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కానీ ఏడాది కాలంగా రైతులు రద్దు చేసుకున్న రిజిస్ట్రేషన్లకు సంబంధించిన చలాన్ డబ్బులు రిఫండ్ కావడం లేదు. ఇదేంటని రెవెన్యూ అధికారులను అడిగితే మాకేం తెలియదు, మాకు సంబంధం లేదు, మాకు ఇచ్చారా? కలెక్టరేట్‌ని వెళ్లి అడగండని అంటున్నారని రైతులు వాపోతున్నారు.

రిజిస్ట్రేషన్లు ఎందుకు రద్దవుతున్నాయి..?

రైతులు ఎదుర్కొంటున్న అనివార్య కారణాలతో పాటు అధికంగా అధికారులు చేసిన తప్పిదాల వల్లే చాలావరకు రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా రద్దు అవుతున్నాయి. తద్వారా చలానా డబ్బులు ప్రభుత్వ ఖజానాలోనే ఉండిపోతున్నాయి. అధికారులు ధరణి పోర్టల్‌లో రైతులకు సంబంధించిన భూములను తప్పుగా నమోదు చేయడం. రికార్డుల్లో ఎక్స్ టెంట్ తక్కువ ఎక్కువగా చూపించడం. రైతుల భూములను కమర్షియల్ భూములుగా నమోదు చేయడం.

ఎస్సారెస్పీ పరం పోగు, అసైన్డ్ భూములుగా రైతుల భూములను రికార్డుల్లో చూపెట్టడం, ఇవే కాకుండా కొన్ని కోర్టు కేసులు ఉన్న భూములకు స్లాట్ బుక్ చేసుకున్న రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా రద్దు అవుతున్నాయి. ఫలితంగా రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన చలానా డబ్బులు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయితే ప్రభుత్వ ఖజానా నుంచి తిరిగి రావడం లేదు. అప్పో సప్పో చేసి తెచ్చుకున్న డబ్బులతో రిజిస్ట్రేషన్ చేసుకుందామనుకున్న రైతులకు ఇటు రిజిస్ట్రేషన్ కావడం లేదు, చలాన్ కోసం చెల్లించిన డబ్బులు తిరిగిరాక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

ఎందరో బాధితులు..

వెల్గటూరు మండలం కోటిలింగాల గ్రామానికి చెందిన ఓ యువకుడు తన తండ్రి పేరున గల భూమిని గిఫ్ట్ డీడ్ ద్వారా తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రూ.40 వేలు చలానా ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్ కోసం చెల్లించారు. అనివార్య కారణాల వల్ల రిజిస్ట్రేషన్ రద్దు చేసుకొని మూడు నెలలు అవుతున్నా ఇప్పటికీ డబ్బులు రీఫండ్ కాక పోవటం విశేషం. గన్నేరువరం మండలానికి చెందిన కోన మను అనే వ్యక్తి 11 గుంటల రిజిస్ట్రేషన్ కోసం రూ.18,000 చలానా కట్టి ఆరు నెలల క్రితం స్లాట్ రద్దు చేసుకున్నారు.

ఇప్పటికీ డబ్బులు రీఫండ్ కాలేదు. సంవత్సర కాలంగా డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులు ఉన్నారు. జగిత్యాల జిల్లాలో సుమారుగా రూ. కోటి వరకు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. వెల్గటూర్ మండల కేంద్రం‌లోని రెండు మీసేవా కేంద్రాల నిర్వాహకులను విచారణ చేస్తేనే ఇరువురి వద్ద సుమారుగా రూ.3లక్షల వరకు పెండింగ్లో ఉన్నాయని పేర్కొనటం విశేషం. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఒకటికి రెండింతలు పెంచి తెలంగాణ ప్రభుత్వం రైతులను దోచుకుంటుందని విమర్శిస్తున్నారు.

Advertisement

Next Story