హాట్ టాపిక్‌గా కేబినెట్ విస్తరణ.. లిస్టులో ఉన్నదెవరో?

by Shiva |   ( Updated:2024-06-21 02:30:20.0  )
హాట్ టాపిక్‌గా కేబినెట్ విస్తరణ.. లిస్టులో ఉన్నదెవరో?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేబినెట్ విస్తరణపై మళ్లీ డిస్కషన్స్ మొదలయ్యాయి. ‘సూపర్ సిక్స్’ లిస్టులో ఎవరెవరు ఉంటారోనని పార్టీలో జోరుగా చర్చ కొనసాగుతున్నది. తమ నేతకు కన్ఫామ్ అయిందంటూ ఆయా లీడర్ల అనుచరులు గాంధీభవన్ లో హడావిడి చేస్తున్నారు. ప్రాథమిక ఎంపిక ఆధారంగా ఇప్పటికే నలుగురి నేతలకు లైన్ క్లియర్ అయిందని, మరో ఇద్దరు నేతలను ఎంపిక చేయాల్సి ఉన్నదని టీపీసీసీ నేతలు చెబుతున్నారు. అయితే తాజాగా ఏఐసీసీ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ త్వరలో రాష్ట్ర విజిట్ కు వస్తుండటంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. కేబినెట్ బెర్తులను భర్తీ చేసేందుకు ఇప్పటికే సెలెక్షన్ అయినప్పటికీ.. త్రీ మెన్ కమిటీ రిపోర్టును కూడా పరిగణలోకి తీసుకునే చాన్స్ ఉన్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది.

త్రీ మెన్ కమిటీ రిపోర్టుపై టెన్షన్

లోక్ సభ ఎన్నికల ఫలితాలపై త్రీ మెన్ కమిటీ అధ్యయనం చేయనున్నది. పార్టీ అభ్యర్థి నుంచి మొదట ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పనిచేస్తున్న ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ పై సభ్యులు ఆరా తీయనున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని బేరీజు వేయనున్నారు. 17 లోక్ సభ స్థానాల్లో 8 సీట్లు గెలిచినప్పటికీ, మిగతా నియోజకవర్గాల్లో ఎందుకు ఓడిపోయామని ఈ కమిటీ అధ్యయనం చేయనున్నది. ఆ అనాలసిస్ లో తమకు వ్యతిరేకంగా అభిప్రాయాలు వస్తే, భవిష్యత్తు ఏమిటో అని మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్న నేతలు ఆందోళన చెందుతున్నారు. పార్టీ వర్గాల లీకులు ప్రకారం సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, బాలు నాయక్, షబ్బీర్ అలీ, మల్‌రెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్, ప్రేమ్‌సాగర్ రావు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందే..

కేబినెట్ విస్తరణ లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందే చేయాలని పార్టీ నేతలు హైకమాండ్ ను కోరుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కేబినెట్ విస్తరణ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీఎంతో కలిపి 12 మంది మంత్రులు ఉన్నారు. మరో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వీటిని జిల్లాలు, క్యాస్ట్ ఈక్వేషన్స్ ను పరిగణనలోకి తీసుకొని భర్తీ చేస్తామని గతంలోనే సీఎం చెప్పారు. దీంతో మంత్రి పదవుల కోసం పలువురు ఎమ్మెల్యేలు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత కేబినెట్ లో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. దీంతో కేబినెట్ విస్తరణలో ఈ జిల్లాలకు అవకాశం కల్పిస్తూనే, సామాజిక వర్గాల వారీగా భర్తీ చేయనున్నామని పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. ఇదే అంశంపై టీపీసీసీ నేతలు త్వరలో సీఎం తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. దీంతోపాటు నామినేటెడ్, కార్పొరేషన్ పదవులను కూడా ప్రకటించాలనే డిమాండ్ వినిపిస్తున్నది. ఇప్పటికే తమకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని గాంధీభవన్ కు దరఖాస్తులు చేరడం గమనార్హం.

ప్రస్తుతం ఇలా..

నల్లగొండ, కరీంనగర్, వరంగల్‌లో ఒక్కో జిల్లాలో ఇద్దరు చొప్పున మంత్రులుండగా, ఖమ్మం నుంచి ఏకంగా ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు. మహబూబ్‌నగర్‌లో సీఎంతో పాటు మరొక మంత్రి ఉండగా, మెదక్ జిల్లాలో ఒక మినిస్టర్ ఉన్నారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్‌కు ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు ఈ జిల్లాలకు అవకాశం కల్పిస్తూ మినిస్టర్లను ఎంపిక చేయనున్నారు. ప్రస్తుత కేబినెట్ లో సీఎంతో కలిపి ఏడుగురు ఓసీ, ఇద్దరు బీసీ, ఇద్దరు ఎస్సీ, ఒకరు ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. ఇప్పుడు మైనార్టీ వర్గానికి స్థానం కల్పిస్తూనే, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మంత్రి పదవులు పెంచే చాన్స్ ఉన్నదని ఆయా వర్గాల లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story