ఫామ్ ల్యాండ్ పేరిట అక్రమ వెంచర్.. 111 జీవో అమలెక్కడ?

by Ramesh Goud |
ఫామ్ ల్యాండ్ పేరిట అక్రమ వెంచర్.. 111 జీవో అమలెక్కడ?
X

దిశ, శంషాబాద్ : 111 జీవో తమకు మాకు వర్తించదనే విధంగా ఇష్టం వచ్చినట్లు నక్ష రోడ్ల సైతం కబ్జా చేసి కొందరు అక్రమంగా వెంచర్ నిర్మించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ తోండుపల్లిలోని సర్వే నంబర్ 212, 213లలో ఫామ్ ల్యాండ్ పేరిట 10 ఎకరాల్లో 111 జీవో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వెంచర్ చేస్తున్నారు. ఈ వెంచర్లో ఒక ఎకర మేర నక్ష రోడ్డును సైతం కబ్జా చేసి వెంచర్ నిర్మాణం చేపట్టారు. శంషాబాద్ మున్సిపాలిటీ, శంషాబాద్ మండలం పూర్తిగా ఉండడంతో ఈ ప్రాంతంలో వెంచర్లు అక్రమ నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు ఉండవు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం 111 జీవోను లెక్కచేయకుండా కొందరి రాజకీయ నాయకుల అండదండలతో యథేచ్ఛగా అక్రమ వెంచర్ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.

10 ఎకరాల వ్యవసాయ భూమిలో ఫామ్ ల్యాండ్ పేరిట గుంటల్లో రిజిస్ట్రేషన్ చేస్తూ గజాల్లో డబ్బులు వసూలు చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు 111 జీవోకు ఏ విధంగా తూట్లు పొడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ వెంచర్‌లో కూడా నీటి కాలువలను సైతం ఆక్రమించి వెంచర్ చేస్తున్నారని స్థానికులు తెలిపారు. 111 జీవోలో సామాన్యులు ఒక ఇల్లు కట్టుకుంటే అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేసే మున్సిపాలిటీ అధికారులు, తోండుపల్లిలో ఇంత పెద్ద ఎత్తున ఎలాంటి అనుమతులు లేకుండా ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారులు 10 ఎకరాలలో వెంచర్ చేస్తుందంటే ఇక్కడ ఎందుకు పట్టించుకోరు అన్నారు. 111 జీవో అంటే కేవలం పేద ప్రజలకేనా? రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వర్తించదా అంటున్నారు.

హైడ్రా కమిషనర్ హెచ్చరించినా..

శంషాబాద్ 111 జీవో పరిధిలో ఉండగా అక్రమ వెంచర్లు చేయనిచ్చారని గతంలో మున్సిపల్, రెవెన్యూ అధికారులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. కానీ మున్సిపల్ అధికారులు అక్రమ వెంచర్లపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. ఇప్పుడు తాజాగా తొండుపల్లెలో 10 ఎకరాల భూమిలో అక్రమ వెంచర్‌కు తెరలేరు. అందులో ఒక ఎకర మేర నక్ష రోడ్డును కూడా కబ్జా చేసి వెంచర్ చేయడం విశేషం. ఇప్పటికైనా మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఫిర్యాదు అందింది..

తొండుపల్లిలో ఎలాంటి అనుమతి లేకుండా అక్రమ వెంచర్ చేస్తున్నారని, అందులో నక్ష రోడ్డు కూడా ఉందని ఫిర్యాదు అందింది. దానిపై విచారించి సర్వే చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి రోడ్డును కబ్జా చేసినట్లు తేలితే కేసు నమోదు చేస్తాం. ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేసినా సహించేది లేదు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి కేసులు నమోదు చేస్తామని శంషాబాద్ తహశీల్దార్ రవీందర్ దత్ హెచ్చరించారు.




Next Story

Most Viewed