అసెంబ్లీ ప్రారంభం రోజే బడ్జెట్.. మండలి చైర్మన్ ఎన్నిక లేనట్లే?

by GSrikanth |   ( Updated:2022-03-06 14:16:41.0  )
అసెంబ్లీ ప్రారంభం రోజే బడ్జెట్.. మండలి చైర్మన్ ఎన్నిక లేనట్లే?
X

దిశ, తెలంగాణ బ్యూరో: సుమారు 9 నెలలుగా శాసనమండలికి చైర్మన్ లేడు. ప్రొటెం చైర్మన్‌తోనే కాలం వెల్లదీస్తోంది. నేటి నుంచి ప్రారంభమయ్యే సమావేశాలు గత సమావేశాల కొనసాగింపు కావడంతో చైర్మన్ ఎన్నిక నియమించబోరనే సమాచారం జరుగుతోంది. ఉత్తర ప్రదేశ్‌లో ప్రొటెం చైర్మన్ కొనసాగిన విధానాన్ని ప్రభుత్వం ప్రస్తావిస్తుండటంతో చైర్మన్ ఎన్నికపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో చైర్మన్ పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్సీలు నిరాశకు గురవుతున్నారు.

తెలంగాణ శాసన మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్లుగా పనిచేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్ రావుల పదవీకాలం గతేడాది జూన్ 3న ముగిసింది. దాంతో భూపాల్ రెడ్డిని ప్రొటెం చైర్మన్‌గా నియమించారు. ఆయన పదవీకాలం సైతం ఈ ఏడాది జనవరి 4న ముగియడంతో మళ్లీ ప్రొటెం చైర్మన్‌గా సయ్యద్ అమీన్ ఉల్ హసన్ జాఫ్రీని నియమించగా జనవరి 13న బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాల సమయంలో చైర్మన్‌ను నియమిస్తారని అందరూ భావించారు. కానీ, రాష్ట్ర రెండో శాసనసభ 8వ సమావేశాలు, శాసనమండలి 18వ సమావేశాలు పున: ప్రారంభం అవుతున్నాయి. గత సమావేశాలకు కొనసాగింపుగా సాగుతుండటంతో ప్రొటెం చైర్మన్‌తో మండలి సమావేశాలకు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఉత్తర ప్రదేశ్‌లో 13 నెలలు ప్రొటెం చైర్మన్ బాధ్యతలు నిర్వర్తించారని ప్రభుత్వ వర్గాలు ప్రస్తావించడంతో పాటు గతంలో గవర్నర్‌కు ఇదే విషయాన్ని వివరించారు. ఈ వాదనతో ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చైర్మన్ ఎన్నిక జరుగకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే సమావేశాలు ప్రారంభం రోజూనే బడ్జెట్‌ను ప్రవేశ పెడుతుండటంతో అదే రోజూ మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్, నామినేషన్లు, ఎన్నిక నిర్వహణ ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈసారి సమావేశాలను కొనసాగించి రాబోయే సమావేశాల్లో చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.

శాసనమండలి చైర్మన్‌గా సీనియర్ నేత, మండలి మాజీ చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డికి మరోసారి చైర్మన్ అవకాశం కల్పించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గుత్తాకు కేసీఆర్ కూడా హామీ ఇచ్చినట్లు ప్రచారం సైతం జరిగింది. అదే విధంగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేస్తున్న సమయంలో ఎమ్మెల్సీగా నియమించిన బండ ప్రకాశ్‌ను మండలి డిప్యూటీ చైర్మన్‌గా అవకాశం కల్పిస్తారని బోగట్ట. అయితే ప్రభుత్వం అసలు ఎన్నికలు నిర్వహించదని ప్రొటెం చైర్మన్‌ను కొనసాగించే అవకాశాలున్నాయని ప్రచారం నేపథ్యంలో ఆశావాహులు నిరాశకు గురవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed