ఆత్మీయ సమ్మేళనాలపై రోజువారీగా రిపోర్ట్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు!

by GSrikanth |
ఆత్మీయ సమ్మేళనాలపై రోజువారీగా రిపోర్ట్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల నివేదికలు అధికార ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతున్నాయి. అసెంబ్లీ స్థానాల వారీగా రోజువారీ రిపోర్ట్ ను అధినేతకు పార్టీ ప్రోగ్రామ్స్ అమలు కమిటీ ఇస్తున్నది. వాటిని పాజిటివ్‌గా ఇస్తుందా? నెగిటివ్‌గా ఇస్తుందా? అనే టెన్షన్ ఎమ్మెల్యేల్లో పట్టుకుంది. వాటి ఆధారంగానే ఎమ్మెల్యేల పనితీరు కొలమానంగా మారింది. వచ్చే ఎన్నికల్లోనూ టికెట్లకు కూడా ప్రమాణికం కానుంది. దీంతో కమిటీ ఏం నివేదిక ఇస్తుందో తెలియని అయోమయంలో ఎమ్మెల్యేలు ఉన్నారు. గులాబీ బాస్ సైతం సెగ్మెంట్ల వారీగా ఆరా తీస్తున్నారు.

పార్టీపై ఎఫెక్ట్ పడుతుందని..

రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ సుమారు నెల రోజులుగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నది. అందులో నేతల మధ్య విభేదాలు బహిర్గతమవుతుండటం, సమస్యలపై ఎమ్మెల్యేలను కేడర్ నిలదీస్తుండటంతో పలుచోట రసాభాసగా మారుతున్నాయి. అధిష్టానం ఇన్ చార్జులను నియమించినా కూడా ఆశించిన ఫలితాలు రాకపోగా పార్టీపైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని భావించింది. ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఆధ్వర్యంలో ప్రోగ్రామ్స్ అమలు కమిటీని నియమించింది. ఈ కమిటీ ప్రతిరోజూ సెగ్మెంట్ల వారీగా నివేదికలను రూపొందించి అధినేతకు అందిస్తున్నది. అయితే.. వాటిలో ఏముంటుందనే భయం ఎమ్మెల్యేలకు పట్టుకుంది. ఆత్మీయ సమ్మేళనాల్లో నేతలను కేడర్ నిలదీయడమే కాకుండా సమస్యలపై నివేదిస్తుండగా.. కమిటీ నివేదికలోనూ పొందుపరుస్తున్నది. సమ్మేళనం ప్రారంభం నుంచి అయిపోయేవరకు జరిగిన చర్చను క్షుణ్నంగా పేర్కొంటున్నది. ఇప్పటికే కేసీఆర్ పనితీరు ఆధారంగానే పార్టీలో గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ఇక నివేదికలతో తమకు ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందోనని ఎమ్మెల్యేలు లోలోన మధనపడుతున్నారు.

హ్యాట్రిక్ కొట్టేందుకు వ్యూహాలు

ఈ సమ్మేళనాలను మండలాల వారీగా నిర్వహిస్తుండగా స్థానిక ఎమ్మెల్యేపై, పార్టీపై ప్రజల్లో, కేడర్ లో ఎలాంటి అభిప్రాయం ఉందనేది స్పష్టమవుతున్నది. నేతలకు, కేడర్‌కు మధ్య సఖ్యత ఎలా ఉంది. వచ్చే ఎన్ని్కల్లో మళ్లీ టికెట్ ఇస్తే గెలుస్తారా..? ఓడిపోతారా..? అనే అంశాలను కూడా కమిటీ నివేదికలో పొందుపరుస్తున్నట్లు సమాచారం. హ్యాట్రిక్ కొట్టేందుకు పావులు కదుపుతున్న కేసీఆర్.. సెగ్మెంట్లలో పార్టీపై, నేతలపై ఉన్న ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే కాకుండా పార్టీలో మరోనేత ఎవరు బలంగా ఉన్నారు.. ఇతర పార్టీల బలాబలాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. కమిటీ నివేదిక ఆధారంగానే రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు అధిష్టానం పదును పెట్టనున్నట్టు తెలిసింది. ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్న చోట ఎలా చెక్ పెట్టాలనేదానిపైనా ప్లాన్ సిద్ధం చేస్తున్నది. కొన్ని సెగ్మెంట్లలో సిట్టింగ్ ల మార్పు ఉంటుందని ఇప్పటికే సూచనప్రాయంగా నేతలకు అధినేత హింట్స్ ఇచ్చినట్లు సమాచారం. ఏదీ ఏమైనా ఆత్మీయ సమ్మేళనాలపై ప్రోగ్రామ్స్ అమలు కమిటీ ఇస్తున్న నివేదికలు ఎమ్మెల్యేలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed