KTR: పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

by Prasad Jukanti |
KTR: పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు
X

దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో:రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వారిపై కక్ష్యపూరింతంగా దాడులు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి శనివారం ఆయన పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగుల అంశంపై గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. రాష్ట్రంలో రాజ్యాంగ హననం జరుగుతున్నదని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలన్నింటిని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తుంగలో తొక్కుతున్నదని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. సిటీ సెంటర్ లైబ్రరీలో ఉన్న విద్యార్థులను ఈడ్చుకొచ్చి అరెస్టులు చేశారని, నిరుద్యోగులపై దాడులు కేసులు పెట్టడం చూస్తుంటే హైదరాబాద్ లో భయానక వాతావరణం ఎలా ఉందో సూచిస్తున్నదన్నారు. రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ చెబుతున్న మాటలను తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని, అక్రమంగా పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకుందన్నారు. తేదీలతో సహా పార్టీ మారిన ఎమ్మెల్యేల వివరాలను గవర్నర్ కు సమర్పించామన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీ-ఫామ్ పై పోటీ చేశారని గవర్నర్ కు వివరించామన్నారు. పార్టీ ఫిరాయింపులపై అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పోటోకాల్ విషయంలో జరుగుతున్న అవమానాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. తమ ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించిన గవర్నర్ ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పినట్లు తెలిపారు.

త్వరలో మేడిగడ్డకు..

కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని, మేడిగడ్డ పూర్తిగా కొట్టుకుపోయిందని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ అన్నారు. మేడిగడ్డలో జరిగింది చిన్న విషయమే అని తాము మొదటి నుంచి చెబుతున్నామని కానీ దాన్ని కాంగ్రెస్ పార్టీ భూతద్దంలో పెట్టి చూపిందని విమర్శించారు. మేము అన్నట్టుగానే కొద్ది రోజుల్లోనే మేడిగడ్డను రిపేర్ చేశారని ఈరోజు గోదావరిలో వరద వస్తున్నా దాన్ని తట్టుకుని మేడిగడ్డ నిలబడిందని ఇదే కాళేశ్వరం గొప్పతనానికి నిదర్శనం అన్నారు. త్వరలోనే మేడిగడ్డను సందర్శించి అక్కడి వాస్తవాలను వీడియోలు తీసి ప్రజలకు వివరిస్తామన్నారు.

కాంగ్రెస్ కు ఎన్నికోట్లు ముట్టాయి?:

ఉద్యోగాల భర్తీలో పోస్టుల సంఖ్య పెంచడంతో పాటు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే వరకు నిరుద్యోగ యువత పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని చెప్పారు. గ్రూప్-2 వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు నెలకు రూ.100 కోట్ల లాభం వస్తుందనే సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మరి ఇప్పుడు నాలుగు నెలలు వాయిదా వేశారు అందులో కాంగ్రెస్ పార్టీకి వాటాలు ముట్టాయోమో ముఖ్యమంత్రే చెప్పాలన్నారు.

Advertisement

Next Story