- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Uttam: రూ.18 వేల కోట్లకు పెంచినా నీరు పారలేదు
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పేరుతో వేల కోట్ల రూపాయలను దిగమింగిన బీఆర్ఎస్ నేతలు సీతారామ ప్రాజెక్టు విషయంలోనూ భారీ స్థాయిలో దోపిడీకి పాల్పడిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ పేర్లతో ఉన్న రెండు ప్రాజెక్టులను పక్కన పెట్టి ఆ స్థానంలో సీతారామ పేరుతో కొత్త డిజైన్ రూపొందించిందని పేర్కొన్నారు. కేవలం మూడున్నర వేల కోట్లతో పూర్తయ్యే ఆ రెండింటి స్థానంలో సీతారామ ప్రాజెక్టును తెరపైకి తెచ్చి రూ. 18 వేల కోట్లకు పెంచిందని, దీని వెనక కాసుల కక్కుర్తే ప్రధాన ఉద్దేశమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే ఆ రెండు ప్రాజెక్టులకు దాదాపు రెండు వేల కోట్లు ఖర్చయిందని, మరో రూ. 1500 కోట్లు ఖర్చు పెడితే వినియోగంలోకి వచ్చి నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుతో రైతులు లబ్ధి పొందేవారని అన్నారు. జలసౌధలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ పై వ్యాఖ్యలు చేశారు.
ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టి సీతారామ పేరుతో కొత్తదాన్ని టేకప్ చేసిన గత ప్రభుత్వం అంచనా వ్యయాన్ని దశలవారీగా రూ. 18 వేల కోట్లకు పెంచిందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఇరిగేషన్ వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసిందని, ఇప్పుడు దాన్ని చక్కదిద్దడం, ట్రాక్‌లో పెట్టడం తమ ప్రభుత్వం చేస్తున్నదన్నారు. ప్రస్తుతానికి మోటారు పంపులను ఆన్ చేస్తున్నామని, మొత్తం ప్రాజెక్టును 2026 నాటికి కంప్లీట్ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్టు పంప్‌లు పంద్రాగస్టు రోజున ఆన్ అవుతాయన్నారు. గత ప్రభుత్వం మొత్తం ఇరిగేషన్ వ్యవస్థకు రూ. 1.81 లక్షల కోట్లను ఖర్చు పెట్టిందని, కానీ కొత్త ఆయకట్టు అందుబాటులోకి వచ్చింది మాత్రం అంతంతేనని అన్నారు.
సీతారామ ప్రాజెక్టు కోసం అంచనా వ్యయంలో ఇప్పటికే రూ. 7,436 కోట్లను గత ప్రభుత్వం ఖర్చు పెట్టిందని, అయినా చుక్క నీరు అందలేదన్నారు. పదేండ్లలో పెండింగ్ ప్రాజెక్టుల పనులను చేపట్టలేదని, రీ-డిజైనింగ్ పేరుతో కొత్తవాటిని తెరమీదకు తెచ్చి కమిషన్ల కోసం ఆరాటపడిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్‌లను రూ. 1500 కోట్లతో పూర్తి చేయడానికి అవకాశాలున్నాయని, కానీ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే దురుద్దేశంతో ఆ రెండింటినీ కలిపి సీతారామ ప్రాజెక్టుగా మార్చిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టు పనులు దాదాపు 90% పూర్తయినట్లుగా మాజీ మంత్రి హరీశ్‌రావు గొప్పగా చెప్పుకుంటున్నారని, కానీ వాస్తవానికి పూర్తయింది మాత్రం 39 శాతమేనని మంత్రి గుర్తుచేశారు. కేంద్ర జల సంఘం నుంచి అనుమతి తెప్పించినట్లు కూడా ఆయన చెప్పుకుంటున్నా ఇప్పటికీ అలాంటి పర్మిషనే రాలేదని మంత్రి ఉత్తమ్ గుర్తుచేశారు.
రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను పక్కన పెట్టడంతో పాటు వాటిని కలిపి సీతారామ ప్రాజెక్టుగా రీ-డిజైన్ చేయాలన్న ఆలోచనే అతి పెద్ద తప్పిదమని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల కాలంలోనే రూ. 500 కోట్లు ఖర్చు చేసి పంపులను ఆన్ చేస్తున్నామన్నారు. మేడిగడ్డ విషయంలో సైతం మాజీ మంత్రి కేటీఆర్ నీటిని పంపింగ్ చేయాలని చెప్తున్నారని, కానీ అక్కడ నీటిని నిల్వ చేస్తే మొత్తం బ్యారేజీ ప్రమాదంలో పడుతుందని, దిగువ ప్రాంతాల్లోని ఆవాసాలు కొట్టుకుపోతాయన్నారు. అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే గోదావరి జలాలను నెత్తిమీద పోసుకున్న కేసీఆర్ ఖమ్మం జిల్లాకు నీటిని ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టు పంపులను ఆన్ చేసి సుమారు ఏడు లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామన్నారు.
ఖమ్మం ప్రజలతో గోక్కోవద్దు: మంత్రి పొంగులేటి
ఖమ్మం ప్రజలను ఎంత తక్కువ గోకితే హరీష్‌రావుకు అంత మంచిని మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. పంపులను బిగించడం ద్వారా ఎక్కువ కమిషన్ వస్తుందన్న ఉద్దేశంతోనే ప్రాజెక్టులో మొదట ఆ పనికి బీఆర్ఎస్ శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. ఆ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం అంచనా వేసిన వ్యయం రూ. 18,231 కోట్లుకాగా, అందులో రూ. 7,436 కోట్లను మాత్రమే ఖర్చు పెట్టిందని, ఇది 40% కూడా దాటలేదని, దేని ప్రాతిపదికన 90 శాతం పనులు పూర్తయినట్లుగా హరీశ్‌రావు చెప్తున్నారని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. మోటార్లను బిగించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు వాటిని డ్రై రన్ కూడా చేయలేదని గుర్తుచేశారు. గత మూడు ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజలు బీఆర్ఎస్‌కు ఇచ్చింది ఒక్క సీటు మాత్రమేనని, భవిష్యత్తులో అది కూడా రాదని అన్నారు. గెలిచిన ఆ ఒక్క సీటు కూడా తన బొమ్మను పెట్టుకుని తన శిష్యుడే గెలిచాడని అన్నారు. ‘ఖమ్మం పౌరుషం ఏంటూ మీ మామను అడుగు’ అని హరీశ్‌రావును మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. ఖమ్మం ప్రజలను ఎంత తక్కువ గోకితే అది ఆయనకే అంత మంచిదని హితవు పలికారు.