BRS: కేటీఆర్ తప్పుడు సమాచారంతో మాట్లాడారు.. సొంత పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
BRS: కేటీఆర్ తప్పుడు సమాచారంతో మాట్లాడారు.. సొంత పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సొంత పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. అమృత్ టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి, కేటీఆర్ ల మధ్య మాటల యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన బీఆర్ఎస్ నేత, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమృత్ టెండర్లపై అనవసరంగా వివాదం చేస్తున్నారని, అసలు రేవంత్ రెడ్డికి టెండర్లకు ఎలాంటి లింకు లేదని వ్యాఖ్యానించారు. అంతేగాక సీఎం రేవంత్ రెడ్డికి సుజన్ రెడ్డి సొంత బావమరిది కాదని, ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదని, రాజకీయ పలుకుబడులతో టెండర్లు దక్కించుకోలేదని స్పష్టం చేశారు, అలాగే ఆన్ లైన్ టెండర్ల ద్వారా రూల్స్ ప్రకారమే సుజన్ రెడ్డి టెంటర్లు దక్కించుకున్నాడని, ఈ అంశంపై అవసరమైతే మీడియా ముందుకు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

ఇక బీఆర్ఎస్ నేతగా ఉన్న ఆయన సొంత పార్టీ నేతపైనే కామెంట్లు చేశారు. టెండర్లపై కేటీఆర్ కామెంట్లు కరెక్ట్ కాదని, అమృత్ టెండర్లపై ఆయనకు సరైన సమాచారం లేదని అన్నారు. అంతేగాక ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారంతో కేటీఆర్ మాట్లాడారని, ఆయన్ను ఎవరో మిస్ గైడ్ చేశారని తెలిపారు. ఇక అంశంపై త్వరలోనే కేటీఆర్ ను కలిసి చర్చిస్తానని, అలాగే తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని, పార్టీ మారే ఆలోచనలు లేవని మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కాగా అమృత్ టెండర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత బావమరిది సుజన్ రెడ్డికి కట్టబెట్టి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని వ్యాఖ్యలు చేశారు. దీనిపై మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. సుజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి బావమరిది కాదని, కానీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు అల్లుడేనని కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.

Next Story