Secretariat: 'మీ వల్లే.. కాదు మీ వల్లే..' సచివాలయం డ్యామేజీపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్

by Prasad Jukanti |
Secretariat: మీ వల్లే.. కాదు మీ వల్లే..  సచివాలయం డ్యామేజీపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తిని రేపుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం పూట పూటకు పదునెక్కుతోంది. తాజాగా సచివాలయ భవనం ఆరో అంతస్తు నుంచి పెచ్చులూడిన (Secretariat damage) ఘటనపై ఇరు పార్టీల మధ్య సోషల్ మీడియాలో వార్ (social media war) మొదలైంది. ఈ ఘటనకు కారణం మీరంటే మీరంటూ.. పరస్పరం సామాజిక మాధ్యమాల వేదికగా ఆరోపణలు గుప్పించుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. గత పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అవినీతికి సచివాలయం రెయిలింగ్ పెచ్చులు ఊడిన ఘటన మరో సాక్ష్యం.. అంటూ తెలంగాణ కాంగ్రెస్ (Congress) తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా విమర్శలు గుప్పించింది.

డ్యామేజ్ కంట్రోల్ కోసం బీఆర్ఎస్

ఇప్పటికే కాళేశ్వరం, సుంకిశాల, వంటి అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ (BRS) పార్టీ తాజాగా జరిగిన సచివాలయం ఘటన ఆరోపణల నుంచి బయటపడేందుకు సోషల్ మీడియాలో అధికార పార్టీకి కౌంటర్స్ ఇస్తోంది. ఇందులో తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి లోపాలు లేవని బీఆర్ఎస్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా బదులిచ్చింది. ‘సెక్రటేరియట్‌ 5, 6వ అంతస్తుల్లో కేబుల్, లైటింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల మరమ్మతుల్లో భాగంగా లైటింగ్ కోసం, కొత్త కేబుల్స్ కోసం జీఆర్సీ ఫ్రేమ్‌పై డ్రిల్లింగ్ చేపట్టారు. డ్రిల్ చేస్తే జీఆర్సీ డ్యామేజ్ అవుతుంది. అదే జరిగింది. ఇది నిర్మాణ లోపం కాదు’ అంటూ ట్వీట్ చేసింది. మొత్తంగా సోషల్ మీడియాలో మరోసారి ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్‌కు సెక్రటేరియట్ డ్యామేజ్ వ్యవహారం కేంద్ర బిందువుగా మారింది.

Next Story

Most Viewed