సర్కార్ షాకింగ్ డెసిషన్.. డబుల్​బెడ్ రూం ఇండ్ల పథకానికి బ్రేక్!

by Sathputhe Rajesh |
సర్కార్ షాకింగ్ డెసిషన్.. డబుల్​బెడ్ రూం ఇండ్ల పథకానికి బ్రేక్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో డబుల్​బెడ్ రూం ఇండ్ల పథకానికి బ్రేక్ ​వేసేందుకు ప్రభుత్వం ప్లాన్​ చేస్తున్నది. ఇప్పటి వరకు మంజూరు చేసిన వాటితోనే ఈ పథకాన్ని ముగించాలని భావిస్తున్నది. ఈ క్రమంలో 2.86 లక్షల ఇండ్లను మరో రెండు, మూడేండ్లలో పూర్తి చేసి, లబ్ధిదారులకు అప్పగించే యోచనలో ఉన్నది. ఇక డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం స్థానంలో జాగా ఉన్న వారికి ఆర్థిక సాయం పథకాన్ని అమలు చేయనున్నట్టు అధికార వర్గాలకు సమాచారం అందించింది. గృహ నిర్మాణ సంస్థ పరిధిలో నిర్మాణమవుతున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల పనులను గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయించే చాన్స్ ఉంది.ఇప్పటికే పీఎంఏవై (అర్బన్)కు మెప్మా నోడల్​ఏజెన్సీగా వ్యవహరిస్తున్నది. పీఎం ఆవాస్​యోజనలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం అవుతున్న నేపథ్యంలో డబుల్​బెడ్​రూం పథకానికి ఇక ముగింపు పలుకుతుందని సమాచారం.

నిర్మాణాలకు బ్రేక్​

సర్కారు నుంచి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను నిలిపివేశారు. ప్రతిఏటా బడ్జెట్‌లో వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నా.. వందల కోట్లు కూడా రిలీజ్ కావడం లేదు. కొన్నిచోట్ల ఇండ్ల పనులు 90% పూర్తి అయినట్టు ప్రభుత్వం చెబుతున్నది. ఇప్పటి వరకు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం రూ.812 కోట్లు బాకీ పడింది. దీంతో బిల్లులు చెల్లించే వరకూ నిర్మాణాలు చేయలేమంటూ కాంట్రాక్టర్లు పనులను నిలిపివేశారు. వాస్తవానికి ముందు నుంచే వీటిని నిర్మించేందుకు కాంట్రాక్టర్లు వెనుకాడారు. ప్రభుత్వం ఫిక్స్​చేసిన రేట్ల ప్రకారం ఇండ్లు నిర్మిస్తే తమకు గిట్టుబాటు కాదని తెలిపారు. కొన్ని జిల్లాల్లో ధైర్యం చేసి కొందరు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చినా.. తర్వాత పనులను మధ్యలోనే వదిలేశారు. నిజామాబాద్​లాంటి జిల్లాల్లో మహారాష్ట్రకు చెందిన ఒకటి, రెండు కంపెనీలు టెండర్ దక్కించుకున్నా పనులను పూర్తి చేయలేదు. మరి కొన్ని చోట్ల పనులు పునాది దాటడం లేదు. గ్రేటర్​హైదరాబాద్‌తో కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా 2,86,057 ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ ఇప్పటి వరకు కేవలం 54 వేల గృహాలనే నిర్మించగలిగింది. ఒక్కో డబుల్ బెడ్‍రూం ఇంటి నిర్మాణానికి రూరల్​ఏరియాలో రూ.5.04 లక్షలు, అర్బన్​ఏరియాలో రూ.5.30 లక్షల చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. ఇంకా మౌలిక వసతుల కోసం పట్టణ ప్రాంతాల్లో ఒక్కో యూనిట్‌కు రూ.75 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షా 25వేలు అందజేస్తామని చెప్పింది. చాలా పట్టణాల్లో స్థల సేకరణ ప్రధాన సమస్యగా మారడంతో వ్యక్తిగత ఇళ్లకు బదులు జీ ప్లస్ వన్, జీ ప్లస్​ టు ​మోడల్​నిర్మాణాలు చేపట్టవచ్చని ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

పేరుకే కేటాయింపులు..

ఇటీవల రాష్ట్ర బడ్జెట్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి రూ.12 వేల కోట్లు కేటాయించగా, సొంత స్థలం ఉన్నవారికి ఇండ్లు నిర్మించుకోవడానికి బెనిఫీషియరీ లెడ్‌ కన్‌స్ట్రక్షన్‌ పేరిట రూ.3లక్షల చొప్పున సహాయం అందజేయనున్నట్టు బడ్జెట్‌లో ప్రకటించారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి ప్రగతిపద్దులో రూ.12వేల కోట్లు, నిర్వహణ పద్దులో రూ.9.7 కోట్లు, ప్రగతి పద్దులో పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాలకు రూ.2,272 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.9,797 కోట్లు కేటాయించారు. గతేడాది కూడా రూ.11,917 కోట్లు కేటాయించినా కేవలం రూ.360 కోట్లు మాత్రమే విడుదల చేసింది. రెండుసార్లు మరో రూ.550 కోట్లు విడుదల చేస్తున్నట్టు జీవో జారీ అయినా.. అవి సంస్థకు చేరలేదు. ప్రభుత్వం కొత్త పథకం తీసుకువస్తున్న నేపథ్యంలో డబుల్​బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి బ్రేక్​ వేస్తారని స్పష్టమవుతున్నది. ఇక నుంచి సర్కారు తరుపున ఇండ్లు నిర్మించి ఇవ్వకుండా.. సొంత స్థలంలో ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. నివాస స్థలాలు లేని వారికి పీఎం ఆవాస్​యోజన కింద చేర్చి, కేంద్ర సాయాన్ని అందించి, మిగిలిన సొమ్మును రుణాలుగా ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. ప్రభుత్వ సాయం మాత్రం పీఎంఏవై నిధుల వరకే పరిమితం చేయనున్నట్టు అధికారవర్గాలు చెప్పుతున్నాయి.

జీహెచ్‌ఎంసీ పరిధిలో

చేపట్టిన ఇండ్లు 97 వేలు

80% వరకు పూర్తయినవి 76,895

లబ్ధిదారులకు అందించినవి 8,052

---------––

డబుల్ ఇండ్లకు బడ్జెట్‌లో నిధులు కేటాయింపు ఇలా..

2015–16, 2016–17 రూ. 1441.70 కోట్లు

2017–18 రూ. 1898.39 కోట్లు

2018–19 రూ. 2,643 కోట్లు

2019–20 (ఓటాన్​అకౌంట్​బడ్జెట్)​ రూ. 4,709 కోట్లు

202‌0–21 రూ. 11,917 కోట్లు

2022–23 రూ. 12,000 కోట్లు

(డబుల్ బెడ్​రూం ఇండ్లకు ప్రభుత్వం కేటాయిస్తామని చెప్పిన బడ్జెట్​రూ.18,663 కోట్లు)

రుణాలు

హడ్కో నుంచి తీసుకున్నవి రూ. 3344.76 కోట్లు

ఇతర సంస్థల నుంచి తీసుకున్నవి రూ. 6055 కోట్లు

డబుల్ ఇండ్లకు ఖర్చు

ఇప్పటి వరకు చేసిన మొత్తం ఖర్చు రూ. 10,400.90 కోట్లు.

కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు (ఫిబ్రవరి, 28 నాటికి) రూ. 812 కోట్లు.

Advertisement

Next Story

Most Viewed