BJP: హస్తిన గెలుపుతో ఘనంగా బీజేపీ విజయోత్సవాలు..

by Ramesh Goud |
BJP: హస్తిన గెలుపుతో ఘనంగా బీజేపీ విజయోత్సవాలు..
X

దిశ, తెలంగాణ బ్యూరో : హస్తిన ఎన్నికల్లో కమలనాథులు విజయఢంకా మోగించడంతో ఆదివారం నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. శనివారం చేసుకోవాల్సిన సంబరాలు సికింద్రాబాద్​కు చెందిన బీజేపీ సీనియర్​నేత మృతి చెందడంతో విజయోత్సవాలు వాయిదా వేసింది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి నగరానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యాలయానికి తరలించారు. బ్యాండ్ వాయిస్తూ, టపాసులు కాల్చి నేతలు మిఠాయిలు పంచుకుని మోడీ జిందాబాద్​అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లోనే అభివృద్ధి వేగంగా జరుగుతోందని, ఢిల్లీలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు.

అదే విధంగా తెలంగాణాలో కూడా త్వరలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో జరిగే మూడు ఎమ్మెల్సీ సీట్లలో కూడా తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించారు. అనంతరం రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్ ప్రసంగిస్తూ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందని, దేశమంతా కమలం వికసిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కూడా ఢిల్లీ తరహా పాలన కోరుకుంటున్నారని, డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణాలో రావాలన్నది ప్రజల ఆకాంక్షగా ఉందని తెలిపారు. అంతేకాకుండా రేవంత్ ప్రభుత్వంపై ప్రజలు విరక్తి చెందారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ విజయోత్సవం రాష్ట్రంలోని బీజేపీ శ్రేణుల్లో కొత్త ఊపు నిచ్చింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీలో సాధించిన విజయంతో తెలంగాణలో కూడా అదే విధమైన ఫలితాలపై నమ్మకం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed