Big News: మండలి అభ్యర్థి ఎవరు..? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్ఎస్‌ సైలెంట్

by Shiva |
Big News: మండలి అభ్యర్థి ఎవరు..? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్ఎస్‌ సైలెంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: శాసనమండలి స్థానానికి భారత రాష్ట్ర సమితి నుంచి ఎవరు ఎన్నికవుతారనే దానిపై పార్టీలో చర్చ మొదలైంది. ప్రస్తుతం పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల లెక్క ప్రకారం ఒక సీటు దక్కనుంది. అయితే, అది ఎవరికి దక్కనుందనేది పార్టీ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. ఇప్పుడున్న సిట్టింగ్​‌లకా లేదా కొత్త వారికి సీటు దక్కుతుందా? అనే దానిపై పార్టీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. పార్టీ అధినేత కేసీఆర్​‌ మదిలో ఎవరున్నారనేది అంత ఈజీగా తెలియదని ఆయన గురించి తెలిసిన వారంటున్నారు. నామినేషన్‌ ​వేయడానికి మంచి రోజు కూడా ఆయనే చూసి.. దాని కంటే ఒకటి రెండు రోజుల ముందుగా పార్టీ అభ్యర్థిని ఖరారు చేస్తారని చెబుతున్నారు. సామాజికవర్గ సమీకరణాలు, పార్టీ విధేయత.. ఈ రెండింటిని చూసి అభ్యర్థి ఎంపిక జరగనుంది. వచ్చే వారం క్యాండిడేట్‌ను ఖరారు చేయనున్నట్టు సమాచారం. అప్పటి వరకు ఎవరికి వారు తమకే సీటు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరకాటంలోకి నెట్టడానికి రెండో అభ్యర్థిని కూడా బరిలో దింపి ఓటింగ్‌ ​జరిగే విధంగా చేసి.. కాంగ్రెస్‌​ను సైతం ఇరకాటంలోకి నెట్టాలనే దిశగా సమాలోచన చేస్తున్నట్టు పార్టీ లీడర్ల ద్వారా తెలిసింది. ఎమ్మెల్యేలకు విప్​‌ జారీ చేసి అనర్హతకు మరో ఆధారాన్ని దొరికించుకునే విధంగా ప్లాన్​ చేస్తున్నట్టుగా సమాచారం.

ఎవరికి వారే ముగ్గురు సిట్టింగ్‌ల ధీమా..

సిట్టింగ్‌లో పార్టీకి చెందిన నలుగురు మహమూద్​ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్​‌రెడ్డి, యెగ్గె మల్లేశంలు.. 6 ఏండ్ల క్రితం ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. వీరిలో యెగ్గె మల్లేశం కాంగ్రెస్‌లో చేరారు. మిగిలిన ముగ్గురు సిట్టింగ్​ ఎమ్మెల్సీలు తమకు మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. మహమూద్​ అలీ తాను పార్టీకి విధేయుడనని, ఉద్యమ కాలం నుంచి ఉంటున్నానని, పార్టీకి, అధినేతకు నమ్మిన బంటుగా ఉంటున్న తనకు మరోసారి చాన్స్ కల్పించాలని, మైనార్టీ నుంచి కనీసం ఒక్కరైనా మండలిలో ఉండాలని, దీనిలో భాగంగా తనను తిరిగి ఎన్నికయ్యే విధంగా పార్టీ అభ్యర్థిగా నిర్ణయించాలని కోరుతున్నారు. సత్యవతి రాథోడ్​‌ లంబాడ సామాజిక వర్గానికి చెందిన తనకు మరో సారి అవకాశం ఇవ్వాలని, మహిళగా, తన విధేయుతకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. తనను ఇటీవలే మండలిలో గులాబీ పార్టీ విప్‌​గా నియమించినందున.. తనకు తప్పకుండా టికెట్ ఇవ్వడానికి నిర్ణయించుకునే విప్‌​గా చాన్స్ కల్పించారని తన అనుచరులు, పార్టీ నాయకుల వద్ద ఆమె చెప్పుకుంటున్నట్టుగా సమాచారం. కేసీఆర్‌కు ​గతంలో వెన్నంటి ఉన్న, ఆయన చెప్పిన ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటించిన నేతగా శేరి సుభాష్‌​రెడ్డికి గుర్తింపు ఉంది. ఈ విధేయతతో తనకు మరోసారి చాన్స్ కల్పిస్తారనే విశ్వసాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ముగ్గురు సిట్టింగ్‌​లు ఎవరికి వారు తమకు మరో సారి అవకాశం ఇస్తారనే ధీమాలో ఉన్నారు. తమకు ఉన్న ప్లస్‌ ​పాయింట్​లను చెప్పుకుంటున్నారు.

బీసీ లీడర్లకు చాన్స్..!

మరో వైపు వీరితో పాటుగా దాసోజు శ్రవణ్, ఆర్.ఎస్.ప్రవీణ్‌​కుమార్, బాలమల్లు, నారదాసు లక్ష్మణ్‌​రావు తదితరులు సీటు ఆశీస్తున్న వారిలో ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా ప్రస్తుతం రాష్ట్రం అంతా బీసీ జపం నడుస్తున్నందున బీసీలకు సీటు ఇవ్వడం ద్వారా ‘బీసీ వాదాన్ని’ మరింత బలపర్చినట్టు అవుతుందని అంచనా వేస్తున్నట్టుగా తెలిసింది. పార్టీ కీలక పదవులన్నీ ఒక సామాజికవర్గానికే ఉన్నందున, దానిని సరిచేయడానికి బీసీల్లో తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు పొందిన దాసోజు శ్రవణ్‌​కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే పార్టీలో టాక్​‌. ఆయనకు గవర్నర్‌ ​కోటాలో ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫార్సు చేసినా అప్పుడున్న గవర్నర్‌ ​నిర్ణయంతో ఆయన నామినేట్‌ ​కాలేకపోయారు. అప్పటి నుంచి కేసీఆర్​‌కు ఆయన పట్ల సానుభూతి ఉందని, ఆయనకు ఏదో ఒక చాన్స్ కల్పించాలని మదిలో ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. గతంలో గవర్నర్‌ ​కోటా వివాదంతో సీటు పెండింగ్‌లో పడటంతో పాడి కౌశిక్​‌రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యే విధంగా చేశారని, అదే తరహాలో దాసోజు శ్రవణ్‌​కు కూడా సీటు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముఖ్య నాయకుల ద్వారా తెలిసింది. బీఆర్ఎస్ మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి సామాజికవర్గానికే మరో సీటు ఇస్తారా? అని పార్టీలోని కొందరు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో పాటుగా పార్టీకి విధేయుడిగా ఉన్న నారదాసు లక్ష్మణ్‌​రావు‌కు బీసీ వర్గాల నుంచి చాన్స్ ​ఉందని తెలుస్తోంది.

ప్రవీణ్ కుమార్ పేరు సైతం పరిశీలన..

ఒక వేళ ఎస్సీలకు అవకాశం కల్పించాల్సి వస్తే పార్టీలో చేరిన ఆర్.ఎస్​.ప్రవీణ్​‌కుమార్, పార్టీలో మొదటి నుంచి ఉన్న బాలమల్లు తదితరులు పోటీలో ఉన్నారు. ప్రవీణ్ కుమార్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, ప్రస్తుతం ఆయన పార్టీలో అత్యంత చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఆనేక అంశాల్లో ఆయనను ముందు పెట్టి పార్టీ కార్యక్రమాలను నడిపిస్తున్నారు. ఆయనకు గుర్తింపు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో కీలక మాదిగ సామాజిక వర్గాన్ని సంతృప్తి పర్చవచ్చనే ఆలోచనలో పార్టీ ఉందని సమాచారం.



Next Story

Most Viewed