Big News: ‘భూభారతి’కి సెంట్రల్ ఫండ్స్..! చట్టంలో కేంద్ర ప్రతిపాదిత అంశాలు

by Shiva |
Big News: ‘భూభారతి’కి సెంట్రల్ ఫండ్స్..! చట్టంలో కేంద్ర ప్రతిపాదిత అంశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూభారతి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం మార్గదర్శకాల రూపకల్పనలో అధికార యంత్రాంగం బిజీగా ఉన్నది. చట్టంలోని 19 అంశాల్లో మొదట కొన్నింటిని మాత్రమే అమలు చేయాలని భావిస్తున్నది. మానవ వనరులు, నిధుల కొరతతో మరికొన్నింటిని పెండింగులో పెడతారనే ప్రచారం జరుగుతున్నది. కేంద్రం ప్రతిపాదించిన భూ రికార్డుల ప్రక్షాళన వంటి కొన్ని అంశాలు ఆర్వోఆర్-2025లో ఉన్నాయని, సాధ్యమైనంత ఎక్కువగా నిధులు వచ్చేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే ఫండ్స్ మంజూరయ్యే అవకాశముందని అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు. కేంద్రం, రాష్ట్రంలో వేర్వేరు జాతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ.. ప్రతిపాదనలకు తగ్గట్లుగా నిధులు విడుదల చేయకపోతే చర్చ జరుగుతుందని, అందుకే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అధిక నిధులకు పట్టుబట్టాలని భూ భారతి చట్టం రూపకల్పనలో కీలక పాత్ర వహించిన ఒకరు అభిప్రాయపడ్డారు. స్టేట్, సెంట్రల్ ఫండ్స్ కలిస్తే చట్టం అమలు ఈజీ అవుతుందని పేర్కొంటున్నారు.

స్వమిత్వకు కేంద్ర నిధులు

కేంద్ర, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలు, రాష్ట్ర రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో స్వమిత్వ (సర్వే ఆఫ్ విలేజెస్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్) సర్వే చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర ఆస్తుల విలువకు పరిష్కారం కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నది. ప్రతి ల్యాండ్ పార్శిల్ కు డ్రోన్ టెక్నాలజీ, కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్ (సీఓఆర్ఎస్) విధానాలతో మ్యాపింగ్ చేస్తారు. 2020 నుంచి దేశ వ్యాప్తంగా దశల వారీగా ఈ మ్యాపింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. స్వమిత్వ వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ, వాస్తవ విలువల గుర్తింపు సాధ్యమవుతుంది. అలాగే ప్రభుత్వానికి రెవెన్యూ కలెక్షన్ నూటికి నూరుపాళ్లు సమర్థవంతంగా చేయొచ్చు. స్థలాల యజమానులకు హక్కుల గ్యారంటీ లభిస్తుంది.

మ్యాపులతో గ్రామ పంచాయతీల డెవలప్మెంట్ ప్లాన్స్ (జీపీడీపీ)ని అమలు చేయడానికి వీలవుతుంది. ఇప్పటికే హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పథకాన్ని అమలు చేస్తున్నారు. దశల వారీగా మిగతా రాష్ట్రాల్లోనూ నిర్వహించనున్నారు. ఇదే అంశానికి మరింత చట్టబద్ధత కల్పిస్తూ ఆబాదీలకు ప్రత్యేక రికార్డులను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలోనే ఆర్వోఆర్-2025లో సెక్షన్ 4(2)లో ఆబాది లేదా వ్యవసాయేతర భూములకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తేదీ నుంచి పూర్తి వివరాలతో ఒక ప్రత్యేక హక్కుల రికార్డును తయారు చేయడం, నవీకరించడం, నిర్వహించడం వంటి అంశాన్ని చేర్చారు. ఈ నిర్దేశించిన హక్కుల రికార్డులను ఎలక్ట్రానిక్ రూపంలో ఉంచుతారు.

అలాగే హక్కుల రికార్డుల పోర్టల్ లోనూ అందరికీ అందుబాటులో ఉంచుతారు. కేంద్రం రూపొందించిన స్వమిత్వ స్కీంలోనూ అమలు చేస్తున్న 14 రాష్ట్రాలకు గాను 12 రాష్ట్రాల్లో రెవెన్యూ శాఖనే ప్రాపర్టీ కార్డులను రూపొందించడం, రికార్డ్ ఆఫ్ రైట్స్ ని నిర్వహిస్తున్నది. అందుకే ఆబాదీల రికార్డుల తయారీ ఆర్వోఆర్ చట్టంలో పెట్టడమే మేలైందిగా నిపుణులు సూచిస్తున్నారు. భూ భారతిలో ఆబాదీలకు ప్రత్యేక గుర్తింపు నంబరు, రికార్డు తయారీకి ఉపయోగపడే ఈ సెక్షన్ ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అడిగే చాన్స్ ఉంది. ప్రతి రాష్ట్రానికి రూ.70 కోట్ల వరకు ప్రతి ఏటా వచ్చే అవకాశం ఉందని సమాచారం.

భూధార్ పర్మినెంట్ కూ నిధులు

ఆర్వోఆర్-2025 చట్టం ద్వారా ఇక ప్రతి ప్రాపర్టీకి యూనిక్ నంబర్ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి ఆస్తికి భూధార్ కార్డును జారీ చేయాలని నిశ్చయించారు. ఇప్పటి వరకు మాన్యువల్ రెఫరెన్స్‌ను క్రియేట్ చేశారు. తొలుత క్లియర్‌గా ఉన్న ప్రాపర్టీస్ అన్నింటికీ టెంపరరీ భూధార్ ఇవ్వాలని ప్రతిపాదించారు. టెంపరరీ ఎందుకంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో భూమి ఒక చోట, సర్వే నంబర్ మరో చోట ఉండే పరిస్థితులే అధికం. పైగా రికార్డుల్లో కంటే పాసు బుక్కుల్లో అధికంగా విస్తీర్ణం నమోదైంది. సమగ్ర భూ సర్వే చేపట్టిన తర్వాత పర్మినెంట్ భూధార్ నంబర్ ఇచ్చే వీలున్నది. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత యూనిక్ ల్యాండ్ పార్శిల్ ఐడెంటిటీ నంబర్ పొందేందుకు అవసరమైన ఒక ముందడుగు పడుతుంది. సర్వే చేసేందుకు కూడా ఈ తాత్కాలిక నంబర్లు ఉపయోగపడుతాయి. పట్టాదారుడికి యూనిక్ నంబర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రెండేండ్ల లక్ష్యంతో ప్రారంభించిన యూనిక్ ల్యాండ్ పార్శిల్ ఐడెంటిటీ నంబర్ (యూఎల్పీన్) పథకం అమలుకు ఉపయోగపడుతుంది. పర్మినెంట్ భూధార్ ఇవ్వాలంటే తప్పనిసరిగా ఆ ల్యాండ్ పార్శిల్ కో ఆర్డినేట్స్ ను ఫిక్స్ చేయాలి. అంటే సర్వే చేయాల్సి వస్తుంది. దీనికి డీఎల్ఆర్ఎంపీ కింద కేంద్రం ప్రకటించిన నిధులను సద్వినియోగం చేసుకోవచ్చు.

ఉచిత న్యాయ సేవలకు గ్రీన్ సిగ్నల్

పేద రైతులకు ఉచితంగా న్యాయ సేవలందిస్తామని చట్టంలో పేర్కొన్నారు. దీనికి కూడా మెకానిజం ఏర్పాటు కావాలి. లీగల్ ఎయిడ్ వంటి ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడకుండా అమలు చేసే సదుపాయాలు ఉన్నాయి. జాతీయ న్యాయ సేవల సంస్థ, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం వంటి వాటితో సమన్వయం చేసుకోవడం ద్వారా రాష్ట్రానికి ఆర్థిక భారం పడకుండా చూసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రతి ఊరిలోనూ గ్రామ న్యాయాలయం పేరిట కేంద్రాలను నెలకొల్పి పేద రైతులకు ఉచిత న్యాయ సాయం అందించేందుకు చట్టంలో వెసులుబాటు కల్పించారు. గతంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పారాలీగల్ వ్యవస్థ అమలైంది. వందలాది మంది పారాలీగల్ అసిస్టెంట్లు, సర్వేయర్లు పని చేశారు. వారందరికీ రెవెన్యూ చట్టాలపైన అవగాహన ఉంది. ఫీల్డ్ లెవెల్ లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం వారంతా సెర్ప్ ఆధీనంలో పని చేస్తున్నారు. అలాంటి వారిని ఉచిత న్యాయం అందించేందుకు ఉపయోగించుకునే అవకాశం కూడా ఉందంటున్నారు.

ఒక్కొక్కటిగానే అమలు

భూ భారతి చట్టంలో అనేక కీలకాంశాలు ఉన్నాయి. వాటిని అన్నీ ఒకేసారి అమలు చేయడం కష్టమే. ఉదాహరణకు సేల్ డీడ్, ఇతర లావాదేవీలకు సర్వే మ్యాప్ తప్పనిసరి అనే సెక్షన్ ఉంది. దాని అమలుకు ముందు ప్రభుత్వం కసరత్తు చేయాల్సి ఉంది. ప్రతి మండలంలోనూ సర్వే చేసేందుకు వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అది పూర్తయిన తర్వాతే అమల్లోకి వస్తుంది. అలాగే భూధార్ టెంపరరీ, పర్మినెంట్ నంబర్ ఇచ్చే సెక్షన్ అమలుకు కూడా కసరత్తు జరగాలి. సక్సెషన్ చేసేందుకు విచారణ చేసే వ్యవస్థ రావాలి. ఇలా ప్రతి అంశానికి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. వాటన్నింటినీ ఏర్పాటు చేయడం తప్పనిసరి. అలాగే ప్రతి సెక్షన్ అమలుకు రూల్స్ ఫ్రేం చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయిన తర్వాతే చట్టం అమల్లోకి రావాలి. అయితే అన్ని అంశాలపై క్లారిటీ వచ్చేంత వరకు ఆగాల్సిన పని కూడా లేదు. సాధారణ పనులు జరిగేందుకు ఇప్పుడున్న వ్యవస్థ అమలుకు తేదీని ప్రకటించే వీలుంది. చట్టం మొత్తం ఒకేసారి అమల్లోకి తీసుకొచ్చే తేదీని ప్రకటించాలంటే సమగ్రమైన రూల్స్ ని రెడీ చేయాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

Next Story