- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Bandi Sanjay: బీసీ రిజర్వేషన్లపై డైలాగ్ వార్.. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కౌంటర్

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంచుకునేందుకు కేంద్రం అమోదం తెలపాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ ఢిల్లీ వేదికగా జరిగిన బీసీ మహాగర్జన ధర్నాలో (Delhi BC Dharna) చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సొంతంగా డెడికేషన్ కమిషన్ వేసుకుని చట్ట ప్రకారం బీసీ రిజర్వేషన్లను (BC Reservations) అమలు చేసుకునే అధికారం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చింది. ఆ హామీ ఇచ్చేటప్పుడు మోడీ ప్రభుత్వాన్ని సంప్రదించి ఇచ్చారా? మరి ఇప్పుడెందుకు మోడీ ప్రభుత్వంపై నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారని నిలదీశారు. రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని షో చేయడం కాదు... ఆ రాజ్యాంగంలో ఏముందో అర్థం చేసుకొని అమలు చేయాలనే ఇంగిత జ్ఞానం కాంగ్రెస్ నేతలకు లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ ఉంది. బీఆర్ఎస్ సపోర్ట్ కూడా ఉంది. అలాంటప్పుడు బీజేపీపై నెపం ఎందుకు నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేతగానితనాన్ని కేంద్రంపై రుద్ది తప్పించుకోవాలనుకుంటున్నారని విమర్శించారు.
మతపరమైన రిజర్వేషన్లకు మోడీ వ్యతిరేకం:
మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని ఈ విషయం మీకు తెలియదా అని సీఎంను బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ విషయం తెలిసి కూడా ముస్లింలను బీసీ జాబితాలో ఎందుకు చేర్చారని ప్రశ్నించారు.తెలంగాణలో 56 శాతానికి పైగా ఉన్న బీసీ జనాభాను కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కావాలనే 46 శాతానికి తగ్గించింది. 80 శాతానికి పైగా ముస్లింలను బీసీ జాబితాల్లో చేర్చి బీసీల పొట్ట కొడుతోందని ధ్వజమెత్తారు. ఇప్పటికే కేంద్రం ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోంది. కాంగ్రెస్ రూపొందించిన 42 శాతం రిజర్వేషన్ల బిల్లులో 10 శాతం మంది ముస్లింలే ఉన్నారు. అంటే ఈ బిల్లువల్ల ముస్లింలు అదనంగా 10 శాతం రిజర్వేషన్ల లబ్ది పొందితే, బీసీలకు అదనంగా దక్కేది 5 శాతం మాత్రమే. ఈ లెక్కన బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేసినట్లా? అన్యాయం చేసినట్లా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరును చూస్తుంటే ముస్లింల కోసమే బీసీ రిజర్వేషన్లు తెచ్చినట్లు స్పష్టమవుతోందన్నారు.
బీసీ సంఘాలు ఎందుకు నోరెత్తడం లేదు?
బీసీలకు ఇంతటి ఘోరమైన అన్యాయం జరుగుతుంటే బీసీ సంఘాల (BC Unions) నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు అని బండి సంజయ్ ప్రశ్నించారు పైగా కాంగ్రెస్ ను సంకనేసుకుని ఢిల్లీకిపోయి ధర్నాల పేరుతో డ్రామాలాడటం ఎంతవరకు కరెక్ట్? అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ తీరును, బీసీ సంఘాల తీరును బలహీనవర్గాల ప్రజలతోపాటు తెలంగాణ సమాజమంతా గమనిస్తోందని సమయం వచ్చినప్పుడు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకుని ఇకనైనా బీసీ రిజర్వేషన్ల అమలుపై చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు.