కలెక్టర్‌పై దాడి.. రాళ్లు, కర్రలతో విరుచుకుపడిన రైతులు

by karthikeya |   ( Updated:2024-11-11 08:28:00.0  )
కలెక్టర్‌పై దాడి.. రాళ్లు, కర్రలతో విరుచుకుపడిన రైతులు
X

దిశ, వెబ్‌డెస్క్/బొంరాస్ పేట్: వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి జరిగింది. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు.. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చిన కలెక్టర్, అధికారుల వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడులు చేశారు. ఈ క్రమంలోనే రైతులను శాంతపరిచేందుకు కలెక్టర్ ప్రయత్నించగా.. ఆయనపై కూడా వెనుక నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసినట్లు విజువల్స్ కనిపిస్తున్నాయి.

అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. దుద్యాల మండలం లగచర్ల గ్రామ సమీపంలో ఫార్మా సంస్థ ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం.. అందుకు సంబంధించిన భూ సేకరణ కోసం రైతులతో ప్రభుత్వం చర్చిస్తోంది. అయితే ఫార్మా కంపెనీ ఏర్పాటును స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలుసుకున్న ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే దుద్యాల శివారులో నేడు (సోమవారం) ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నామని, అక్కడకు రైతులంతా రావాలని గ్రామస్థులకు అధికారులు సూచించారు.

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, కొడంగల్‌ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కడా) ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ లింగానాయక్‌, సబ్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌ దుద్యాల శివారు ప్రాంతానికి చేరుకోగా.. రైతులు మాత్రం లగచర్లలోనే ఉండిపోయారు. అదే టైంలో గ్రామానికి చెందిన సురేశ్‌ అనే వ్యక్తి బాధిత రైతుల తరఫున ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్దకు వచ్చి.. కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌తో మాట్లాడారు. రైతులంతా తమ ఊరిలో ఉన్నారని.. అక్కడే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కోరారు. దీంతో కలెక్టర్‌, ఇతర అధికారులు అంగీకరించి అక్కడికి బయల్దేరి వెళ్లారు.

కానీ అధికారులు గ్రామంలోకి చేరుకోగానే.. రైతులంతా ఒక్కసారిగా వారితో వాగ్వాదానికి దిగడమే కాకుండా.. వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డికి రాళ్లు తగలడంతో గాయాలయ్యాయి. కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్‌‌లపై కూడా రైతులు దాడి చేశారు. వెంకట్ రెడ్డి పొలాల వెంబడి పరుగెత్తి అక్కడి నుంచి వెళ్లిపోయారు. జిల్లా కలెక్టర్‌‌తో పాటు మిగిలిన అధికారులు వాహనాల్లో వెనుతిరిగి వెళ్లిపోయారు. అయితే ముందు జాగ్రత్తగా బందోబస్తు లేకుండా వెళ్లడం వల్లే ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది.

Advertisement

Next Story