ASHA workers: సుల్తాన్ బజార్ సీఐపై చేయి చేసుకున్న ఆశా వర్కర్.. ఆందోళన ఉద్రిక్తం

by Ramesh N |
ASHA workers: సుల్తాన్ బజార్ సీఐపై చేయి చేసుకున్న ఆశా వర్కర్.. ఆందోళన ఉద్రిక్తం
X

దిశ, డైనమిక్ బ్యూరో/ కార్వాన్: హైదరాబాద్ కోఠి (Koti) డీఎంఈ కార్యాలయం ఆవరణలో సోమవారం (ASHA Workers) ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.18000 ఫిక్స్‌డ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు నిరసన తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆశాలు డిమాండ్ చేశారు. దీంతో డీఎంఈ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు, ఆశాలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన ఏసీపీ శంకర్‌ను ఆశాలు చుట్టుముట్టారు.

దీంతో పోలీసులు ఆశావర్కర్లను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ సంఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్లకు తరలించే డీసీఎంలో ఉన్న ఆశా వర్కర్.. సుల్తాన్ బజార్ సీఐ శ్రీనివాస్ చారిపై చేయి చేసుకున్నారు. ఆశా వర్కర్ చేయిచేసుకోవడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. అయితే, అలా ఆశా వర్కర్ ప్రవర్తించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed