AP: జగన్‌ను దేశ బహిష్కరణ చేయాలి..హోంమంత్రి వంగలపూడి అనిత డిమాండ్

by Ramesh Goud |
AP: జగన్‌ను దేశ బహిష్కరణ చేయాలి..హోంమంత్రి వంగలపూడి అనిత డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పూటకో మాట మాట్లాడటం జగన్‌కు అలవాటేనని, డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం ఇష్టం లేక తిరుమలకు వెళ్లలేదని, దేశం గురించి మాట్లాడిన జగన్ ను దేశ బహిష్కరణ చేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె వైసీపీ నేత జగన్ ఫైర్ అయ్యారు. పూటకో మాట జగన్ కు అలవాటుగా మారిందని, ఆఖరి నిమిషంలో పర్యటన రద్దు చేసుకొని నోటీసులు ఇచ్చారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. జగన్ తిరుమలకు రాకుండా అడ్డుకోవడానికి ఎలాంటి హౌజ్ అరెస్టులు, ముందస్తు అరెస్టులు చేయలేదని, కనీసం పోలీసు పహారా కూడా వేయలేదని, ఆయన సెక్యూరిటీ నిమిత్తం ఉండే పోలీస్ అధికారులు మాత్రమే అక్కడ ఉన్నారని తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని, జగన్ మీద కొందరు దార్మిక సంఘాలు కోపంతో ఉన్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నోటీసులు ఇస్తే.. తిరుమలకు రానివ్వకుండా నోటీసులు ఇచ్చారని అబద్దాలు చెబుతున్నారని తెలిపారు. చంద్రబాబును ఎయిర్ పోర్టుల్లో ఆపినట్లు మేము జగన్ ను ఎన్నడు ఆపలేదని, అలా చేసి సెంట్రల్ జైల్ విజిట్ లు చేసే వారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్దంగా ముందుకు వెళుతున్నప్పుడు మా మీద బురద జల్లడానికి పోలీసులు నోటీసులు ఇచ్చారని చెబుతున్నాడు కానీ.. ఫస్ట్ అతనికి తిరుమలకు వెళ్లడం ఇష్టం లేదని, అతడు డిక్లరేషన్ ఇస్తే కుటుంబ సభ్యులకు పట్టిన గతే తనకు పడుతుందని ఊహించి తిరుమలకు వెళ్లట్లేదని ఆరోపించారు.

డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నామని చెప్పటం సిగ్గుచేటు

తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో వీవీఐపీలు వస్తారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదని నోటీసులు ఇస్తే దానిని డైవర్ట్ చేసి ఈ విధంగా మాట్లాడుతున్నాడని, మళ్లీ మేమే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నామని చెప్పటం సిగ్గుచేటన్నారు. అలాగే ప్రసాదం ఇస్తే పక్కన పెట్టేవాడని, ఎన్నడు లడ్డూ రుచి కూడా చూడని జగన్ లడ్డూ నాణ్యత.. టేస్ట్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జూన్ 12, 2024న నాలుగు లారీలలో వచ్చిన నెయ్యి వాడి చేసిన లడ్డూ టేస్ట్ మారిందని భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని తర్వాత వచ్చిన లారీలను టెస్ట్ కు పంపితే.. నెయ్యి కల్తీ జరిగిందని, నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని రిపోర్టులు వచ్చినట్లు తెలిపారు. దాని గురించి మాట్లాడకుండా ఎన్డీటీవీ వాళ్లు వేసిన డిస్‌క్లైమర్ గురించి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. వీళ్లు జరిగిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తు్న్నారు తప్పించి తప్పు జరిగిందని, క్షమాపణలు కోరే ప్రయత్నం చేయట్లేదని మండిపడ్డారు. దీనిపై ఎక్స్ స్పీకర్ నెయ్యి కల్తీలో కాదు ఆవులో ఉందని మాట్లాడుతున్నాడని, ఇంకో వ్యక్తి లాయర్ పంది కొవ్వు రేట్ల గురించి మాట్లాడున్నారని వీళ్ల పరిజ్ఞానం ఎలా ఉందో ఒక్క సారి ఆలోచించాలని అన్నారు.

జగన్‌కు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదు

అలాగే దీనిపై విచారణకు సిట్ ఏర్పాటు చేస్తే.. సొంత మనుషులతో ఏర్పాటు చేశారని విమర్శలు చేస్తున్నారని, సిట్ ప్రభుత్వ ఉద్యోగులతోనే ఏర్పాటు చేస్తారని, సాక్షి ఉద్యోగులతో కాదని వ్యంగ్యస్త్రాలు సంధించారు. జగన్ కుటుంబం క్రిస్టియన్లు అని అందరికీ తెలుసని, అందుకే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి తిరుమలకు వెళ్లడం ఇష్టం లేక కోడిగుడ్లు, టమాటాలు విసురుతారని మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారని అన్నారు. జగన్ హయాంలో టీటీడీ బోర్డులో ఒక్క దళితుడు కూడా లేడని, చంద్రబాబు హయాంలో బోర్డు మెంబర్ గా ఉన్న దళితురాలినైన నన్ను అవమానించారని, ఇప్పుడు జగన్ దళితుల గురించి మాట్లాడటం హస్యాస్పదంగా ఉందన్నారు. అసలు జగన్ కు దళితుల గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. జగన్ మానవత్వం గురించి మాట్లాడితే మానవత్వం కూడా సిగ్గుపడుతుందని, ఆయనకు మానవత్వం ఉంటే తన చెల్లి వీధి వీధి తిరిగి తన మీదనే తిరగబడేది కాదని తెలిపారు. "ఇది ఏం దేశం" అని, దేశం గురించి, సెక్యూలరిజం గురించి మాట్లాడిన జగన్‌ను దేశ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ను ఇప్పటికీ కూడా ఎవరు ఆపడం లేదని, డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఏ హోదాలో కావాలంటే ఆ హోదాలో ప్రోటోకాల్ దర్శనం చేపిస్తామని చెప్పారు. హిందుత్వాన్ని గౌరవించే ఇష్టం లేక డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేక వెళ్లకుండా మా మీద బురద జల్లే ప్రయత్నాన్ని ప్రజలు గమణిస్తున్నారని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed