కేజ్రీవాల్‌ తర్వాత నువ్వే.. మరో 5 పేజీల లేఖ విడుదల చేసిన సుఖేశ్

by GSrikanth |   ( Updated:2023-04-15 10:38:27.0  )
కేజ్రీవాల్‌ తర్వాత నువ్వే.. మరో 5 పేజీల లేఖ విడుదల చేసిన సుఖేశ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మనీ లాండరింగ్ కేసులో మండోలి జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ మరో లేఖను శనివారం విడుదల చేశారు. కేజ్రీవాల్‌తో పాటు కవితను కూడా ఆయన టార్గెట్ చేశారు. ‘ఆర్థిక నేరగాడు’ అంటూ తనను సంబోధించిన కవిత ఎలాంటి సంబంధాలూ లేవని ఇటీవల మీడియాకు చెప్పినట్లు తెలిసిందని, కానీ తన ఫోన్‌లో సేవ్ చేసుకున్న కాంటాక్ట్ నెంబర్ (6209999999, 8985699999) ఆమెదో కాదో క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనమీద అభాండాలు వేస్తూ రొటీన్‌గా చేసే కామెంట్లకు బదులు నిజాయితీగా దర్యాప్తును ఎదుర్కోవాలని సవాలు విసిరారు. కవితను అక్కా అని తాను సంబోధించినందుకు (వాట్సాప్ చాటింగ్‌లో) తెలుగు ఎలా వచ్చు అంటూ పాయింట్ లేవనెత్తారని, కానీ, తన మాతృభాష తెలుగు, తమిళం అని సుఖేశ్ క్లారిటీ ఇచ్చారు.

జైల్లో ఉన్న తన దగ్గర వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్‌లు ఎలా ఉన్నాయనే సందేహాలను సైతం కొద్దిమంది లేవనెత్తారని, కానీ తన దగ్గర ఉన్న మొత్తం 703 స్క్రీన్ షాట్‌లు ఇప్పటికే బైట ఉన్న తన టీమ్ దగ్గర ఉన్నాయని, జైలు అధికారుల అనుమతితో వాటిని మీడియాకు వెల్లడించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరికొన్నింటిని కూడా విడుదల చేస్తానని తెలిపారు. తొలి రెండు చాటింగ్‌లలో రూ. 15 కోట్ల (15 కిలోల నెయ్యి)కి సంబంధించిన అంశాలే ఉన్నాయని, కానీ ఇకపైన వచ్చేవాటిలో రూ. 7.5 కోట్లు, రూ. 11.25 కోట్లను గోవాకు తరలించిన విషయాన్ని కూడా వెల్లడిస్తానని తెలిపారు. దీనితో పాటు రూ. 10.. 70 కి.మీ. కోడ్ భాషలోని వివరాలను కూడా రానున్న రోజుల్లో రిలీజ్ చేస్తానని తెలిపారు.

కవితకు సవాలు విసిరిన సుఖేశ్

గతంలో తాను లేవనెత్తిన ఆరోపణలకు స్టాండర్ట్ సమాధానాలు ఇవ్వడానికి బదులుగా ఈడీ, సీబీఐ సంస్థల దర్యాప్తును ఎదుర్కోవాలంటూ ఎమ్మెల్సీ కవితను డిమాండ్ చేశారు. ఇలాంటి కామెంట్లు వస్తాయని అనుమానించినందునే ఎవిడెన్స్ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా అఫిడవిట్ రూపంలో అందించానని, కోర్టు నుంచి అనుమతి కూడా తీసుకున్నానని సుఖేశ్ స్పష్టత ఇచ్చారు. కవితతో తనకు పరిచయం ఉన్నప్పటి నుంచీ ఆమెను అక్కా అనే సంబోధిస్తానని, ఒక సోదరిగా ఆమెపైన తనకున్న గౌరవంతో ఇలా అలవాటు చేసుకున్నానని వివరణ ఇచ్చారు. కనీసం ప్రజల కోసం, ఈ దేశం కోసమైనా కొన్నిసార్లు నిజాలు చెప్పాలని సూచించారు. ఈ ఆరోపణలు చేయడం వెనక తనపైన ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని, కేసులను మాఫీ చేసుకోవాలనే తాపత్రయం కూడా లేదని క్లారిటీ ఇచ్చారు.

వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. అది జరిగి ప్రజల మద్దతు కోరాలంటే ముందుగా తనపైన వచ్చిన ఆరోపణలను వివరించాల్సి ఉన్నదని, క్లీన్ ఇమేజ్‌తో జైలు నుంచి బైటకు రావాలని అనుకుంటున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో ఉన్న పెద్ద నేతల నేర చరిత్రతో పాటు వారి డర్టీ సీక్ట్స్, ప్రజల మీద వేస్తున్న భారాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నానని తెలిపారు. ఒక ఎకనమిక్ అఫెండర్ అంటూ ఎమ్మెల్సీ కవిత తనపైన అభియోగాలను మోపుతున్నారని, దానికి తగినట్లే ఈ ఆరోపణల్లోని నిజానిజాలు వెల్లడి కావాలంటే విచారణను ఎదుర్కోవాలని ఆమెకు హితవు పలికారు. దర్యాప్తు ద్వారా మాత్రమే వాస్తవం బైటకు వస్తుందన్నారు. వ్యక్తులకంటే చట్టం చాలా శక్తివంతమైనదన్నారు.

ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిజాయితీతో, ధైర్యంగా సీబీఐ, ఈడీ దర్యాప్తులకు సిద్ధం కావాలన్నారు. ట్విట్టర్‌ల ద్వారా సిల్లీ రిప్లైలు ఇవ్వడానికి బదులు ఇన్వెస్టిగేషన్‌కు రెడీగా ఉండాలన్నారు. ఎలాగూ దర్యాప్తు సంస్థలు ఆ దిశగా సిద్ధమవుతున్నందున తనను ఆర్థిక నేరగాడు.. లాంటి ఎన్ని పదాలతో ఇమేజ్‌ను బద్నాం చేసినా ఫలితమేమీ ఉండదన్నారు. నిజంగా తనపై ఇప్పుడు ఇలాంటి ముద్రలు వేస్తున్న కేజ్రీవాల్, కవిత రెండేండ్ల నుంచి ఎందుకు వాడుకున్నారని ప్రశ్నించారు. ఏ ప్రయోజనాలను ఆశించి తనతో రిలేషన్స్ పెట్టుకున్నారని నిలదీశారు. త్వరలోనే తీహార్ క్లబ్ గ్రూపులో సభ్యులవుతారని అన్నారు.

Advertisement

Next Story