ఓయూ ఘటనతో అలర్ట్.. ‘కారు’ పార్టీకి అనుకూల ఆఫీసర్లపై ఆపరేషన్ కోవర్టు..!

by Disha Web Desk 4 |
ఓయూ ఘటనతో అలర్ట్.. ‘కారు’ పార్టీకి అనుకూల ఆఫీసర్లపై ఆపరేషన్ కోవర్టు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ శాఖల్లో ఉన్న బీఆర్ఎస్ కోవర్టులను ఏరేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల కోడ్ ముగియగానే చర్యలు చేపట్టేందుకు రెడీ అయినట్టు సమాచారం. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థికంగా, ఉద్యోగపరంగా ప్రయోజనం పొందిన ఆఫీసర్లు ఇప్పటికీ ఆ పార్టీతో టచ్‌లో ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమయం, సందర్భం చూసుకుని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఆఫీసర్ల వివరాలు సేకరించాలని ఇఫ్పటికే నిఘా వర్గాలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్టు టాక్. గతంలో ఇరిగేషన్, పవర్ డిపార్టుమెంట్లలో సైతం కొందరు ఆఫీసర్లు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేవిధంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.

కోవర్టుల గుర్తింపు షురూ..

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థికంగా, ఉద్యోగపరంగా ప్రయోజనం పొందిన ఆఫీసర్లు ఇప్పటకీ ఆ పార్టీతో టచ్‌లో ఉంటున్నట్టు విమర్శలు ఉన్నాయి. సమయం, సందర్భం చూసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు కీలక ఆఫీసర్లు బీఆర్ఎస్ లీడర్లతో టచ్ లో ఉంటూ, ప్రభుత్వానికి చెందిన సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. అలాంటి అధికారులను గుర్తించి, రిపోర్టు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిఘా వర్గాలను ఆదేశించినట్టు తెలిసింది. దీనితో ప్రతి శాఖలో బీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోన్న అధికారుల వివరాలు సేకరించే పనిలో ఇంటిలిజెన్స్ నిమగ్నమైనట్టు సమాచారం. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే సదరు ఆఫీసర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడమో, లేక అప్రధాన్య పోస్టులకు బదిలీ చేయడమో జరుగుతుందని సెక్రటేరియట్ వర్గాల్లో టాక్ ఉంది.

సర్క్యూలర్ వెనుక ఓయూ కీలక అధికారి?

విద్యుత్, తాగునీటి కొరత కారణంగా హాస్టల్స్ మూసివేస్తున్నట్టు ఉస్మానియా వర్సిటీ వార్డెన్ జారీ చేసిన సర్క్యూలర్ రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. అయితే ఓయూకు చెందిన ఓ కీలక అధికారి ఒత్తిడి కారణంగానే వార్డెన్ సర్క్యూలర్ జారీ చేశారనే ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకే సదరు ఆఫీసర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వర్సిటీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎందుకంటే మూడేళ్ల క్రితం బీఆర్ఎస్ లోని ఓ ఎమ్మెల్యే అండదండల వల్లే సదరు ఆధికారికి కీలక పదవి దక్కిందని ప్రచారం ఇప్పటికీ జరుగుతోంది. ఆ ఎమ్మెల్యే సలహాలు, సూచనలతోనే వర్సిటీకి చెందిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సరదు అధికారిపై ఆరోపణలున్నాయి.

ఎక్కవ మంది పవర్, ఇరిగేషన్‌లోనే..

విద్యుత్, ఇరిగేషన్ శాఖల్లో బీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరించే ఆఫీసర్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారనే ప్రచారం ఉంది. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన కొన్ని ఘటనలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పశు గ్రాసం కోసం ఉపయోగించే కట్టర్ మిషన్‌కు ఉచిత విద్యుత్ వెసులుబాటు లేదని ట్రాన్స్ కో అధికారులు కనెక్షన్లను కట్ చేశారు. అయితే పాలనాపరమైన నిర్ణయం తీసుకోకుండానే క్షేత్ర స్థాయిలో ఎందుకు అధికారులు కరెంట్ కనెక్షన్లు కట్ చేశారని ఆరా తీయగా, ట్రాన్స్ కోకు చెందిన ఓ అధికారి ఆదేశాల మేరకు కింది స్థాయి సిబ్బంది విద్యుత్ కనెక్షన్లు కట్ చేశారని తేలింది. వెంటనే ఆ అధికారిని అక్కడి నుంచి బదిలీ చేశారు. గత నెలలో మాజీ సీఎం కేసీఆర్ సూర్యాపేటకు వెళ్లారు. పంటలు ఎండిపోతుంటే సాగర్ నీళ్లు విడుదల చేయలేదని ఆయన విమర్శలు చేశారు. తెల్లారే ఆ ఏరియాకు సాగర్ నుంచి నీళ్లు విడుదల చేశారు. దీంతో తన వల్లే ప్రభుత్వం నీళ్లు వదిలిందని కేసీఆర్ ప్రకటించుకున్నారు. అవసరాలను గుర్తించి, ముందుగా నీళ్లు వదలకుండా ఓ ఇరిగేషన్ అధికారి కావాలనే కేసీఆర్ టూర్ తర్వాత నీళ్లు విడుదల చేశారని ఆరోపణలు వచ్చాయి.

Next Story