బ్రేకింగ్: BRS మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు మంత్రి KTR కీలక పిలుపు

by Nagaya |
బ్రేకింగ్: BRS మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు మంత్రి KTR కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన గ్యాస్ ధరలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.గ్యాస్ ధరల పెంపుపై బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో బుధవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రతిసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని మండిపడ్డారు. తాజాగా కేంద్రం గృహ అవసరాల సిలిండర్ ధరను రూ. 50, కమర్షియల్ సిలిండర్ ధరను 350 రూపాయల మేర భారీగా పెంచడం దారుణమన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు ప్రధాని మోడీ ఇచ్చే కానుక ఈ సిలిండర్ ధరల పెంపా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

మోడీ ప్రభుత్వం రాకముందు 400 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఈ రోజు 1160ని దాటి 1200లకు చేరుకుందని విమర్శించారు. ఒకవైపు ఉజ్వల స్కీం పేరుతో మాయమాటలు చెప్పిన బీజేపీ ప్రభుత్వం.. ఈరోజు భారీగా సిలిండర్ ధరలను పెంచి వారిని మళ్లీ కట్టెల పొయ్యిపై వంట చేసుకునేలా చేస్తోందని ఫైరయ్యారు. గ్యాస్ ధరల పెంపుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఎల్లుండి అన్ని నియోజకవర్గ, పట్టణ, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాలని కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎక్కడి వారక్కడ వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

మహిళా దినోత్సవం రోజున సైతం గ్యాస్ ధరల పెంపుపైన కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ధరలను పెంచుతున్న తీరును స్థానికంగా మీడియా ద్వారా ప్రజలకు చేరేలా చూడాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రజల కష్టాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే మాదిరిగా.. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed