బొగ్గు బావుల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం: మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.

by Shiva |
బొగ్గు బావుల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం: మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.
X

దిశ, నస్పూర్: సింగరేణి బొగ్గు బావులను ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటామని రాష్ట్ర దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం నస్పూర్ పట్టణంలోని సీసీసీ కార్నర్ వద్ద మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం సింగరేణికి చెందిన బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ ఏర్పాటు చేసిన మహాధర్నా కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి ని పూర్తిగా ప్రైవేటీకరించి సంస్థను నిర్వీర్యం చేయాలని చూస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వం సింగరేణి ని కూడా అమ్మాలని కంకణం కట్టుకుందని ఆరోపించారు. లాభాల బాటలో ఉన్న సింగరేణికి భవిష్యత్తులో బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల బాట పట్టించాలని కేంద్రం కుతంత్రం చేస్తుందన్నారు. మోదీ దోస్త్ అదానీకి సింగరేణి ని కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సింగరేణి ని ప్రైవేటీకరించకపోతే బొగ్గు గనులను సంస్థకు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు.

నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడి విజయం సాధించినట్టే నల్ల సూర్యుల కోసం కార్మికుల పక్షాన పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, ఆత్రం సక్కు, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు అరవింద రెడ్డి, నల్లాల ఓదెలు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఇన్ చార్జి నారదాసు లక్ష్మణ్, గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, టీబీజీకేఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story