అండగా ఉంటాం.. అధైర్య పడొద్దు

by Sridhar Babu |
అండగా ఉంటాం.. అధైర్య పడొద్దు
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : భారీ వర్షాలు, వరదలతో సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. మంగళవారం భారీ వర్షాల నేపథ్యంలో నిర్మల్ పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీలో స్థానిక శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల లతో కలిసి మంత్రి పర్యటించారు. భారీ వర్షాల నేపథ్యంలో వరద నీటి వలన ఏర్పడుతున్న ఇబ్బందులను కాలనీ ప్రజలు మంత్రికి వివరించారు. స్వర్ణ ప్రాజెక్టు కింద చెక్ డ్యామ్ నిర్మాణం, స్థానికంగా ఉన్న నాళాల ఆక్రమణ కారణంగా వరద నీరు సక్రమంగా ప్రవహించక నీరు కాలనీలోకి చేరుతుందని స్థానికులు మంత్రికి తెలిపారు. చెక్ డ్యామ్ వలన ప్రతి సంవత్సరం పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో నిర్మల్ సమీప గ్రామ రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలిపారు. చెక్ డ్యామ్ నిర్మాణాన్ని కుదించి, నాళా ప్రవాహ సామర్థ్యాన్ని పెంచి తద్వారా వరద నీటిని నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన రహదారి నుంచి కాలనీలోనికి సరైన రోడ్డు సదుపాయం లేకపోవడం వల్ల వర్షాలు కురిసినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న కాలనీ ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధైర్యపడవద్దని, ప్రభుత్వం ప్రజలకు, రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. కాలనీవాసుల సమస్యలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి సాంకేతిక నిపుణులతో చర్చించి నివేదికను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, రైతుల సహకారం అవసరమని తెలిపారు. జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పి స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

భారీ వర్షాల హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా కాలనీ ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించిన జిల్లా అధికార యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. గత కొన్ని సంవత్సరాలుగా వరదల కారణంగా కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న నష్టాలు, సమస్యలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను మంత్రి తిలకించారు. అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి జీఎన్ఆర్ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించారు. గత కొన్నేళ్లుగా వర్షాకాలం వరదల వలన కాలనీవాసులు, నిర్మల్ చుట్టుపక్కల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వారి సమస్యను పరిష్కరించాలన్నారు. నిర్మల్ పట్టణంలో వరద నీటి సమస్య పరిష్కారానికై ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలిపారు. కాలనీ వాసులు, రైతుల సమస్యల పరిష్కారానికి తాము అన్ని విధాలుగా ప్రభుత్వానికి సహకరిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీహరి రావు, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ లు, బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, డీఎస్పి గంగారెడ్డి, మునిసిపల్ కమిషనర్ రాజు, తహసిల్దార్ రాజు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాలనీవాసులు, రైతులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed