లోక్‌సభ ఎన్నికలకు పటిష్ట భద్రత

by Naresh |   ( Updated:2024-03-21 13:15:32.0  )
లోక్‌సభ ఎన్నికలకు పటిష్ట భద్రత
X

దిశ, తాండూర్ : జిల్లాలో శాంతియుత వాతావరణంలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ అన్నారు. రెబ్బెన మండలం గోలేటి సీఈఆర్ క్లబ్లో గురువారం కేంద్ర సాయుధ (సీఆర్పీఎఫ్)బలగాలతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మే 13 న జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, గొడవలు, అల్లర్లు జరగకుండా సజావుగా నిర్వహించేందుకు జిల్లాకు కేంద్ర సాయుధ బలగాలు రావడం జరిగిందన్నారు. ఎన్నికల పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్ర సాయుధ బలగాలకు ప్రజలు, అధికారులు, స్థానిక పోలీసులు పూర్తి సహకారం అందించాలని సూచించారు.

అక్రమ నగదు, మద్యం, కానుకలు జిల్లాలోకి ప్రవేశించకుండా కేంద్ర సాయుధ బలగాలు స్థానిక పోలీసుల సహకారంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా ప్రజలలో మనోధైర్యాన్ని నింపేలా ప్రతిరోజు పెట్రోలింగ్ నిర్వహించాలని, ఎస్‌హెచ్‌ఓలు తమ ఏరియాపై పూర్తి అవగాహన కలిగి ఉండి అల్లర్లు సృష్టించేవారిని, పాత నేరస్తులను ముందుగా గుర్తించి బైండోవర్ చేయాలని ఆదేశించారు. ఎవరైనా విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాత్రి సమయాల్లో తనిఖీ నిర్వహించేటప్పుడు రేడియం జాకెట్స్ ధరించాలని, వాహనాల తనిఖీ నిర్వహించే సమయంలో ఇతరులతో మర్యాద పూర్వకంగా మాట్లాడాలని సూచించారు. గోలేటి టౌన్షిప్‌లో కేంద్ర సాయుధ పోలీసు బలగాల కోసం ఏర్పాటు చేసిన వసతి సదుపాయాలను ఎస్పీ పరిశీలించారు. ఈ సమావేశంలో ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య , ఎస్‌బీ సిఐ రాణప్రతాప్, రెబ్బెన సీఐ చిట్టి బాబు, ఎస్ఐ చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed