Nirmal: మారితే మంచిది.. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ అధిష్టానం హుకుం

by Ramesh Goud |
Nirmal: మారితే మంచిది.. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ అధిష్టానం హుకుం
X

దిశ ప్రతినిధి నిర్మల్: కాంగ్రెస్ పార్టీ పిఎసి సమావేశం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత ఇంటలిజెన్స్ తో తెప్పించుకున్న నివేదిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికార పార్టీ శాసనసభ్యులపై పెదవి విరిచినట్లుగానే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ గ్రాఫ్ పెరగడం కన్నా పడిపోతుండడం పట్ల అధిష్టానం తీవ్ర నిరుత్సాహంతో ఉందన్న సంకేతాలను సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లు సమాచారం. మీరు మారకపోతే మేమే మారుస్తాము అనే రీతిలో సున్నిత హెచ్చరికలు కూడా పలువురు ఎమ్మెల్యేలకు వెళ్లినట్లు తెలిసింది.

మారాలి కదా..

సరిగ్గా ఏడాది క్రితం బలమైన కేసీఆర్ ను తట్టుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ... ఏడాది కాలం గడిచిన తర్వాత కూడా ప్రజల్లోకి తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను తీసుకువెళ్లడంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు విఫలం అవుతున్నారన్న అభిప్రాయంతో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అగ్రనేత ఏఐసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ శాసనసభ్యులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

సొంత కేడర్ లో అసంతృప్తి..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నలుగురు శాసనసభ్యులు ఉండగా వారిలో ఇద్దరిపై తీవ్రస్థాయిలో అసంతృప్తి ఉన్నట్లు పార్టీ అధిష్టానం గుర్తించినట్లు ప్రచారం జరుగుతున్నది. ఒక శాసనసభ్యుడు తానే అధిష్టానం అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది మరోవైపు ఇంకో శాసనసభ్యుడు తనకు రాష్ట్రస్థాయిలో కాకపోతే జాతీయస్థాయిలో అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయంటూ ఆ నియోజకవర్గంలో కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు అధిష్టానం దృష్టికి వెళ్లాయి. ఇక ఒక శాసనసభ్యుడు నియోజకవర్గం కార్యకర్తలను పట్టించుకోవడం లేదని చివరకు ముఖ్య నాయకుల ఫోన్లు కూడా ఎత్తడం లేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరో శాసనసభ్యుడు పూర్తిగా నియోజకవర్గ ప్రజల సమస్యలను తన వ్యక్తిగత సహాయకులకు వదిలేసి వెళ్లారని... ఆ ఎమ్మెల్యే తో పాటు మరో ఇద్దరు శాసనసభ్యులు కూడా వ్యక్తిగత సహాయకులను, కొందరు ముఖ్య అనుచరులను విపరీతంగా విశ్వాసంలోకి తీసుకుంటూ ఉండడంతో అనేకమంది పార్టీని నమ్ముకున్న సీనియర్లు కార్యకర్తలు పార్టీకి దూరం అవుతున్నారన్న సమాచారం పిఎసి సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ మార్టం లో తేలినట్లు చెబుతున్నారు. దీనికి తగ్గట్టుగానే త్వరలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యుల తో పార్టీ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Next Story

Most Viewed