public bore wells : పబ్లిక్ బోర్ బావుల స్టార్టర్లకు తాళాలు..

by Sumithra |
public bore wells : పబ్లిక్ బోర్ బావుల స్టార్టర్లకు తాళాలు..
X

దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో గల పబ్లిక్ బోరు బావుల స్టార్టర్లకు మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో సిబ్బంది తాళాలు వేశారు. దీంతో పట్టణ ప్రజలు లబోదిబోమంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తాగునీటి అవసరాలను తీర్చుకునేందుకు పట్టణంలోని 80% ప్రజలు ఈ బోరు బావుల పై ఆధారపడి ఉన్నారు. కానీ కొత్తగా విధులలో చేరిన మున్సిపల్ కమిషనర్ ఆదేశానుసారం బోరుబావుల స్టార్టర్లకు తాళాలు వేయడంతో పట్టణ ప్రజలు మున్సిపల్ కమిషనర్ పై భగ్గుమంటున్నారు.

పట్టణంలోని చాలా ప్రాంతాలలో మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇదే సమయంలో స్టార్టర్లకు తాళాలు వేస్తే ప్రజలు నీటి కోసం ఎక్కడికి పోవాలని ప్రశ్నిస్తున్నారు. స్థానిక మున్సిపాలిటీ పరిధిలో కనీస రోడ్డు, డ్రైనేజీ వసతులు లేక ప్రజలు అవస్థలు పడుతున్న నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ వాటి పై దృష్టి పెట్టక పోగా పేద ప్రజలకు అందుతున్న నీరు కూడా అందకుండా వ్యవహరిస్తున్నారన్నారు. దీనికి గల కారణాలు ఏంటో పట్టణ ప్రజలకు వివరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే తాగునీటి బోర్ల స్టార్టర్లకు వేసిన తాళాలు తీయాలని లేని యెడల పెద్ద ఎత్తున మహిళలు ఖాళీ బిందెలతో మున్సిపాలిటీ ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు.

మున్సిపల్ కమిషనర్ వివరణ : మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోరు బావులలో నీటిని వార్డులలో ప్రజలు ఎటువంటి సమయపాలన పాటించకుండా ఇష్టం వచ్చినట్లు అధిక మొత్తంలో వృధా చేస్తున్నారన్నారు. ఇలా చేయడంతో రాబోయే కాలంలో పట్టణంలో నీటి కొరత ఏర్పడుతుందనే ఉద్దేశంతో తాళాలు వేయించానన్నారు. జల వనరులను కాపాడడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటూ తొందర్లోనే ఒక నిర్ణయం తీసుకొని ఒక సమయపాలన నిర్ణయించి బోరు బావుల ద్వారా ప్రజలకు నీటి వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Advertisement

Next Story