- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిర్పూర్ బరిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..?
దిశ, ప్రతినిధి నిర్మల్: యూనిఫాం లో ఉన్నప్పుడు కఠినమైన పోలీసు అధికారిగా... గురుకులాల బాధ్యత నిర్వర్తించినప్పుడు ఎన్నో విద్యా సంస్కరణలు తీసుకువచ్చిన అధికారిగా పేరుపొందిన మాజీ ఐపీఎస్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీలో నెంబర్ 1 అసెంబ్లీ స్థానమైన సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసేందుకు తీవ్ర ఆలోచన చేస్తున్నారని సమాచారం. గత కొంతకాలంగా ఆయన తరచూ ఆ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు బహుజన సమాజ్ పార్టీ శ్రేణులను సమాయత్త పరిచారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన వచ్చే ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం మొదలైంది.
సిర్పూర్ నుంచి ఎందుకంటే..!
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం వెనక పలు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. బహుజన సమాజ్ పార్టీ కేవలం దళిత ఓటు బ్యాంకుతో మాత్రమే పోటీ చేస్తుందన్న ప్రచారానికి తెర దింపే వ్యూహంలో భాగంగానే ఆయన సిర్పూర్ నుండి పోటీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. జనరల్ స్థానమైన సిర్పూర్ నియోజకవర్గం నుంచి 2014 లో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కోనేరు కోనప్ప ఎమ్మెల్యేగా అనూహ్య విజయం సాధించారు. ఆ తరువాత ఆయన అధికార భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ఆ నియోజకవర్గంలో మారుమూల గ్రామాల్లో సైతం ఏనుగు గుర్తు సుపరిచితమైంది. మరోవైపు దళితుల ఓట్లు కూడా గణనీయంగానే ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ సహా ఉత్తరాది రాష్ట్రాల నుంచి అనేక కుటుంబాలు కాగజ్ నగర్ సిర్పూర్ కౌటాల తదితర కేంద్రాల్లో వలస వచ్చి నివాసం ఉంటున్నాయి. వీరిలోనూ బహుజన వాదం ఉన్న కుటుంబాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
మరోవైపు ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓటర్లు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్ తదితరులు ప్రస్తుతం బీఎస్పీ లోనే కొనసాగుతున్నారు. పార్టీకి ఊరూరా క్యాడర్ కూడా ఉంది. ఇవన్నీ అనుకూల అంశాలుగా ఆర్ఎస్పీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సాంఘిక సంక్షేమ శాఖ విద్యాసంస్థల కార్యదర్శిగా పనిచేసిన సుదీర్ఘకాలంలో సిర్పూర్ నియోజకవర్గం నుంచి సుమారు 1000 మంది దాకా విద్యార్థులు ఆయన మార్గదర్శకత్వంలో విద్యాభ్యాసం చేసిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ విద్యార్థులు అనేకమంది ఉన్నత స్థానాల్లో స్థిరపడిన వారు కూడా ఉండడం గమనార్హం. ఆ విద్యార్థులు సైతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను సిర్పూర్ నుండి పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తరచూ పర్యటనలు వ్యూహాత్మకమేనా..?
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తరచూ సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో చేస్తున్న పర్యటనలు భవిష్యత్తు ఎన్నికల వ్యూహమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బహుజన యాత్ర పేరిట ఆయన నియోజకవర్గంలో సుమారు పక్షం రోజులపాటు పర్యటించారు. ఆ తర్వాత కూడా అనేక సార్లు నియోజకవర్గానికి వచ్చి పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమాలోచనలు జరిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కమిటీలు సైతం వేశారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ గ్రామ కమిటీలు కూడా ఉండడం విశేషం. ఈ వ్యూహం వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చే ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టు చెబుతున్నారు. ఆయన కాగజ్ నగర్ నుండి పోటీ చేస్తే దాని ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలపై పడుతుందని చెబుతున్నారు. సీనియర్ మాజీ ఐఏఎస్ అధికారిని అవసరమైతే తమ పార్టీ తరఫున ఎంపీగా బరిలో ఉంచేందుకు ప్రణాళిక సైతం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. మాజీ ఐపీఎస్ రాజకీయ వ్యూహం ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.