కన్నాల గ్రామ పంచాయతీలో అక్రమ వైన్స్..

by Aamani |
కన్నాల గ్రామ పంచాయతీలో అక్రమ వైన్స్..
X

దిశ,మందమర్రి : జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీలో నీలిమ వైన్స్ యజమానులు ప్రభుత్వ అధికారులను బురిడీ కొట్టించారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో వైన్స్ నిర్వహణకు అనుమతులు పొంది, కన్నాల గ్రామ పంచాయతీని ఆనుకొని ఉన్న జాతీయ రహదారి నంబర్ 363 పై వైన్స్ ను ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. జాతీయ రహదారులపై వైన్స్ షాపులు నిర్వహించరాదని భారత ప్రభుత్వం, రోడ్లు రవాణా మంత్రిత్వ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఇక్కడ వాటిని పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ వ్యవహారం అంతా స్థానిక ఎక్సైజ్ శాఖ, మున్సిపల్ తదితర సంబంధిత శాఖ అధికారులకు తెలిసినప్పటికి చర్యలు తీసుకోకపోవడం లో ఆంతర్యం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడి వైన్స్ నిర్వహణ వెనుక గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ మంత్రి బంధువుల హస్తం ఉన్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై దిశ దినపత్రిక అందిస్తున్న ప్రత్యేక కథనం.

గత డిసెంబర్ మాసం 2023 సంవత్సరంలో కొత్త వైన్స్ (లిక్కర్) షాప్ లకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ లాంఛనంగా అనుమతులు ఇచ్చింది. అందులో భాగంగా నీలిమ వైన్స్ షాప్ నెంబర్- 54 అనే షాపు జనగామ రాజలింగు అనే వ్యక్తికి లాటరీ పద్ధతిన దక్కింది. మొదటగా ఈ షాప్ భవన నిర్మాణానికి మున్సిపాలిటీ టీపీఓ అనుమతులు అందించి ఇంటి నెంబర్ : 28-2-7/4/ఏ/1. కేటాయించడం గమనార్హం. ఈ భవనానికి కుడి, ఎడమల గృహాల నంబర్లను గొల్ల గూడానికి సంబంధించినవి చూపించి దీనికి అసెస్మెంట్ నెంబర్ : 109518893 జారీ చేసి టౌన్ ప్లానింగ్ అధికారి పర్మినెంట్ ఇంటి నెంబర్ మహమ్మద్ రఫీ పేరిట జారీ చేసినట్లు తెలుస్తోంది.

మున్సిపాలిటీ లైసెన్స్ ... పంచాయతీలో నిర్వహణ

కన్నాల గ్రామ పంచాయతీ బెల్లంపల్లి మున్సిపాలిటీలోని గాంధీ నగర్ నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడి నుండి జాతీయ రహదారి నెంబర్ : 363 ని ఆనుకొని కొంత మంది ఇళ్ళు నిర్మించుకున్నారు. ఆ గృహాలకు గ్రామ పంచాయతీ కార్యదర్శి అనుమతులు ఇచ్చారు. వాటికి ఇంటి నంబర్లు కూడా మంజూరు చేశారు. మరి ఈ క్రమంలో మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ ఒక్క భవన నిర్మాణానికి ఎలా అనుమతులు ఇచ్చారో అంత చిక్కడం లేదు. మున్సిపాలిటీలో లైసెన్స్ పొంది కన్నాల గ్రామ పంచాయతీలో మద్యం షాపు నిర్వహణ జరగడం సంబంధిత అధికారులకే తెలియాలి.

కన్నాల కార్యదర్శికి నోటీసు జారి..

కన్నాల గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా జనగామ రాజలింగు అనే వ్యక్తి నీలిమ వైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైన్స్ కు బెల్లంపల్లి మున్సిపాలిటీ వార్డు నెంబర్ 13లో అనుమతులు పొందడం జరిగింది. కానీ పంచాయతీ శివారులో మద్యం వ్యాపారం కొనసాగుతుంది. దీనిపై 'తామెందుకు చర్య తీసుకోకూడదో' తెలపాలని పంచాయతీ కార్యదర్శి నోటిస్ జారీ చేశారు. సదరు నోటీసులను ఎంపీడీవో మండల, పంచాయతీ,, డివిజనల్ పంచాయతీ అధికారులకు పంపారు. కాగా తెలుస్తోంది. కన్నాల కార్యదర్శికి ఈ మధ్య తరచుగా బెదిరింపు మొబైల్ కాల్స్ వస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ విధులు నిర్వహించాలంటే తాము చెప్పింది వినాల్సిందే. లేకుంటే నీ అడ్రస్ గల్లంతు అవుతుందని గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఈ హెచ్చరికలను ఖాతరు చేయని కార్యదర్శి మున్సిపాలిటీ, అబ్కారీ శాఖ అధికారులకు మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ సరిహద్దులు తేల్చాలని లిఖితపూర్వక ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.

అంతా మాజీ మంత్రి మాయ..

కన్నాల పంచాయతీలో వెలసిన నీలిమ వైన్స్ వెనుక ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి అనుచర బృందం, ప్రస్తుత పాలక పార్టీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరి కనుసన్నల్లోనే అక్రమ మద్యం షాపు వ్యవహారం మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లు తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఖజానాకు చిల్లులు కొడుతున్న అక్రమార్కుల పై కొరడా ఝుళిపించవలసిన అవసరం ఉంది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు దృష్టి సారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story