రిమ్స్ టీడీ హబ్ రిపోర్టులపై అనుమానాలు ?

by Prasanna |
రిమ్స్  టీడీ హబ్ రిపోర్టులపై అనుమానాలు ?
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో టీడీ హబ్ రిపోర్టులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాధులకు చికిత్స కోసం వస్తే రిమ్స్ లో ఇచ్చే రిపోర్టులు అయోమయానికి గురిచేస్తున్నాయి. వైద్యుల సూచన మేరకు రక్త పరీక్షలు చేసుకుంటే ఒక్కొక్కటి ఒక్కోవిధంగా రావడంతో రోగులు గందరగోళానికి గురవుతున్నారు. అనుమానాలతో ఈ రిపోర్టులతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి మరోసారి టెస్టులు చేయించుకుంటున్నారు. వారి అనుమానాలు నిజమయ్యేలా రిమ్స్, టీ– హబ్ పరీక్షలలో తేడాలు కనిపిస్తున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల వారు ఇచ్చే రిపోర్ట్ లు సరైనవే అని నమ్మకం తప్పడం లేదు.

తరచుగా పాడవుతున్న యంత్రాలు

ఎందరో మంది పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఏర్పాటు చేసుకున్న ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో వైద్యం అంతంత మాత్రం గానీ ఉంది. రోగులకు సంబంధించిన ఏ నివేదికల కోసమైనా వెళ్లాలంటే రోజుల తరబడి తిప్పలు తప్పడం లేదు. అసలే వ్యాధుల కాలం కావడంతో ఏ చిన్న రోగం వచ్చిన ప్రజలు రిమ్స్ ఆసుపత్రికి బార్లు తీరుతున్నారు. ఇలాంటి క్రమంలో వారికి నమ్మకమైన,నాణ్యమైన వైద్యం అందించాల్సిన వైద్యులు ముందుగా వారికి వచ్చిన రోగం గురించి తెలుసుకోవాలంటే రక్త నివేదికలు తప్పనిసరి.అయితే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది వేల మంది ప్రజలు రక్త నివేదికల కోసం ల్యాబ్ ల చుట్టూ తిరుగుతుంటే.. తీరా ఆ నివేదికలు సరైనవో కావో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారణం రిమ్స్ లో,టి హబ్ తరచుగా యంత్రాలు పాడవడంతోపాటు అవి ఏ విధంగా పనిచేస్తున్నాయో.. అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వచ్చిన రిపోర్టు సరైనదేనా.. కాదా అన్న సందేహంతో రోగులకు వైద్యులు ఇచ్చిన మందులు కూడా పనిచేయని పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి తోడు అర్హత లేని వారు రక్త పరీక్షలు చేస్తున్నారనీ ఆరోపణలు వస్తున్నాయి.

ల్యాబ్ అసిస్టెంట్లు, పేషంట్ కేర్ లతో రక్త పరీక్షలు

ఈ రిమ్స్ ,టి హబ్ లో ప్రస్తుతం ల్యాబ్ టెక్నీషియన్లు 40 మందికి పైగా పనిచేస్తున్నారు. వీరందరూ కూడా రిమ్స్ లో ఆయా విభాగాల్లో పని చేస్తున్నప్పటికీ రక్త పరీక్షలు మాత్రం వీరు చేయడం లేదు. గతంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పరిధిలో ఉన్న క్రమంలో అర్హులైన, అనుభవజ్ఞులైన, నిష్ణాతులైన ల్యాబ్ టెక్నీషియన్ల ద్వారా ఈ రక్త పరీక్షలు చేసేవారు.ఈ క్రమంలో ప్రభుత్వం టి డి హబ్ లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నుంచి తప్పించి వైద్య కళాశాల రిమ్స్ సూపరిండెంట్ లకు పరిధిలోకి తీసుకు వచ్చిన తరువాత రిమ్స్ లోని హబ్ లో చాల వరకు ఎల్ టి లకు బదులుగా ల్యాబ్ అసిస్టెంట్ లు ,పేషంట్ కేర్ లతో ఈ టెస్టు లు నిర్వహించడం జరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఈ టెస్టుల ద్వారా వైద్యులను సంప్రదించి మందులు, మాత్రలు తీసుకున్నప్పటికీ రోగం తగ్గకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి ప్రైవేట్ ఆసుపత్రులను రోగులు సంప్రదించాల్సి వస్తుంది. దీంతో కూలి, నాలి చేసుకునే మామూలు మధ్యతరగతి, పేద, ప్రజలు వారి రోగాలకు ప్రైవేట్ ఆసుపత్రులకు వేలకు వేలు రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. రిమ్స్ లో ఉన్న పరికరాలు చెడిపోవడం, గత మూడు నెలలుగా ల్యాబ్ లో రసాయనాలు అయిపోవడం వల్ల అక్కడి సిబ్బందికి పని లేకుండా పోగ ఇక్కడ భారమంతా టి హబ్ పైనే పడడంతో అధిక భారం వల్ల అవి కూడా ఒకటి రెండు రోజులు పని చేసి తిరిగి మోరాయిస్తున్నాయి. వీటిని పట్టించుకోవాల్సిన రిమ్స్ డెరైక్టర్, అధికార యంత్రాంగం చూసి చూడనట్లుగా వదిలేయడంతో అటు రిమ్స్ ఇటు టీ హబ్ లో సరైన రిపోర్టులు సకాలంలో రాక రోగులకు ప్రాణాల మీదకు వస్తోంది.

హబ్ సెంటర్ పైనే ఆధారం

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురవడంతో వరదల వల్ల వివిధ గ్రామాలతో పాటు జిల్లా కేంద్రంలోనూ విష జ్వరాల తాకిడి ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. ఇలాంటి సమయంలో రోగులకు రక్త పరీక్షలు తప్పనిసరి. ఇందుకోసం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు ఆయా కోసం రోగుల రక్త నమూనాలు టి హబ్ కు ల్యాబ్ కు పంపిస్తున్నారు. కానీ రిమ్స్ ఆస్పత్రిలో యంత్రాలు సరిగా పనిచేయకపోవడంతో రోజుల తరబడి రోగులు వేచి చూడక తప్పడం లేదు. డెంగ్యూ, మలేరియా, విషజ్వరాల వంటి వ్యాధులతో బాధపడుతున్న రోగులకు అవసరమైన సిబిపి టెస్టుల కోసం తెలంగాణ టీ హబ్ సెంటర్ పైనే ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో రిమ్స్ ఆవరణలోని టీహబులో రక్త నివేదికల కోసం రోగులకు నిరీక్షణ తప్పడం లేదు. రిమ్స్ లో నిండుకున్న రసాయనాలతో బయో కెమిస్ట్రీ విభాగం సరిగా పనిచేయకపోవడంతో అక్కడ పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్లు ఖాళీగానే కూర్చుంటున్నారు. అయితే టెస్టుల కోసం రోగులకు టీ హబ్ దిక్కవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలను విష రోగాల నుంచి కాపాడేందుకు రక్తనివేదికలు ఎంతగానో కీలకం. అలాంటిది రిమ్స్ లేదా టీ హబ్ ద్వారా ఇచ్చి రిపోర్టులు ఎంతవరకు సరైనవి అని సరి చూడాల్సిన బాధ్యత రిమ్స్ సంబంధిత అధికారులపై ఉంది. వీటిని తూతూ మంత్రంగా పరిశీలించి మందులు రాసి ఇస్తుండడంతో వారి సూచన మేరకు మందులు వాడిన బాధితులకు విష జ్వరాలు మాత్రం తగ్గడం లేదు. ఈ జ్వరాలు ముఖ్యంగా డెంగ్యూ తో బాధపడుతున్న క్రమంలో ఎంతో అనుభవజ్ఞులైన, నిష్ణాతులైన ల్యాబ్ టెక్నీషియన్లు చేయాల్సిన రక్త పరీక్షలను వీరి కింద పని చేసేటటువంటి ల్యాబ్ అసిస్టెంట్ లు, పేషంట్ కేర్ లు పరీక్షలు నిర్వహించడంతో సరైన నివేదికలు రాక రోగులు అయోమయానికి గురవుతున్నారు.ఈ రిపోర్టులపై వైద్యులే సరిగా ఏమి చెప్పలేకపోవడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి, సరైన టెస్టులు చేయించుకొని, రోగాలను నయం చేసుకునేందుకు వేలాది రూపాయలు ఖర్చు చేసుకున్నట్లు రోగులు చెబుతున్నారు.

జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలి

పరిసరాల పరిశుభ్రత తో పాటు విష జ్వరాలు ప్రబలకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని,ఒకవేళ జ్వరాలు ఎక్కువైతే రిమ్స్ ఆసుపత్రిని సంప్రదించి చికిత్స పొందాలని చెబుతున్న జిల్లా కలెక్టర్ రోగుల పరిస్థితి పై దృష్టి సారించాలి. ముఖ్యంగా సరైన రక్త పరీక్షలు చేసి రోగులకు మెరుగైన వైద్యం అందించాల్సిన సమయంలో అసలు రక్తం నివేదికలే సరిగా రావడం లేదన్న విషయం తెలుసుకోవాలని రోగులు కోరుతున్నారు. ముఖ్యంగా విష జ్వరాల బారిన పడి రక్త నివేదికల కోసం ల్యాబ్ ల వద్దకు వెళ్లే రోగులకు అర్హులైన ల్యాబ్ టెక్నీషియన్లు పరీక్షలు చేస్తున్నారా.. లేక అనుభవం లేని వారు చేస్తున్నారా.. రిమ్స్ లో గాని టీ హబ్ సెంటర్ ద్వారా గాని ఇచ్చే రక్త నివేదికలు సరైనవేనా, కాదా అన్న విషయం జిల్లా కలెక్టర్ పరిశీలించి సరైన చర్యలు తీసుకోవాలని రిమ్స్ కు వచ్చే రోగులు వారి బంధువులు కోరుతున్నారు. ముఖ్యంగా ల్యాబ్ లలో అనుభవం కలిగిన ల్యాబ్ టెక్నీషియన్ లే పని చేసేలా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story

Most Viewed