పత్తి రైతు చిత్తు..దక్కని మద్దతు ధర

by Aamani |
పత్తి రైతు చిత్తు..దక్కని మద్దతు ధర
X

దిశ, లక్షెట్టిపేట: పత్తి రైతుకి యేటేటా కష్టాలు తప్పడం లేదు. పెట్టుబడి, శ్రమకు తగ్గ ఫలితం అందడం లేదు. దీనికి తోడు పంట చేతికి వచ్చాక మార్కెట్ ఊబిలో చిక్కుకుపోతున్నాడు. ఈ యేడాది కూడా అదే పరిస్థితి కనబడుతోంది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.7,521 ఉంటే రైతుల చేతికి మాత్రం రూ.6,500 కి మించి రావడం గగనంగా మారింది. పంట చేతికి వస్తున్న సమయంలో సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జాప్యంతో దళారులు, ప్రైవేట్ వ్యాపారులు పత్తి చేల కల్లాల వద్దకు వెళ్లి రైతులతో బేరసారాలు ఆడుతున్నారు. కొందరు రైతులు తమ అవసరాల నిమిత్తం దళారులు చెల్లించే ధరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో త్వరగా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా రూ.1.57 లక్షల ఎకరాల సాగు..

ఈ సీజన్లో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 1,57 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగయింది. దీంతో 1.30 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. సరైన సమయంలో వర్షాలు అనుకూలించకపోవడంతో దిగుబడిపై ప్రభావం పడింది. ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రావాలి. ప్రస్తుతం ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి రావడం కష్టంగా మారింది. సీజన్ ఆరంభంలో వర్షాలు అనుకూలించిన.. పూత, కాత దశలో చిలుకు లేదు. తడి అందక దిగుబడి తగ్గింది. పత్తి గింజ పగిలే సమయం లో పడిన వర్షాలతో గింజ నలుపు రంగులోకి మారి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. ఎకరాన రూ. 40-45 వేల పెట్టుబడి కాగా, తగ్గిన దిగుబడితో నష్టాలు వచ్చే పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు.

కల్లాల వద్దకు వెళ్లి కొనుగోలు..

జిల్లాలో పత్తి ఏరుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పత్తి కాత దశలో ఉంది. దళారులు, ప్రైవేట్ వ్యాపారులు కల్లాలు, రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి భేరసారాలు ఆడుతున్నారు. తమకు అమ్మితే రవాణా ఖర్చులు, తేమశాతం కొర్రీలు లాంటి ఇబ్బందులు ఉండవని చెబుతూ బుట్టలో వేసుకుంటున్నారు. వెంటనే డబ్బులు చెల్లిస్తామని ఆఫర్ ఇస్తున్నారు. వారి మాయమాటలతో బోల్తా పడుతున్న కొందరు రైతులు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.7,521 కాగా, వ్యాపారులు క్వింటాల్ కు రూ. 6 వేల నుంచి 6, 500 ధర చెల్లిస్తున్నారు. జిల్లాలో తాండూరు మండలం రేపల్లె వాడ లోని శ్రీరామ జిన్నింగ్ మిల్లులో మాత్రమే గురువారం సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ ఒక్క చోట మినహా ఇంకా ఎక్కడ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు.

ఈ పరిస్థితుల్లో మిగతా చోట్ల సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో సంబంధిత అధికారులు ఇంకా జాప్యం చేస్తే తమ అవసరాల కోసం రైతులు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది. కాగా, జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల్లో ఏడు జిన్నింగ్ మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తమ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed