- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లిక్కర్ స్కామ్‌లో సరికొత్త ట్విస్ట్.. ఆయన నోరు విప్పితే కవితకు చిక్కులు తప్పవా?
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరబిందో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. దీనికి రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు ఆమోదం తెలిపింది. దీంతో కొన్ని రోజులుగా సాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. ఈ కేసు సీబీఐ దర్యాప్తు చేస్తున్న క్రమంలో దినేశ్ అరోరా అప్రూవర్‌గా మారారు. తాజాగా ఈడీ దర్యాప్తులో శరత్ చంద్రారెడ్డి ఫస్ట్ అప్రూవర్‌గా మారారు. జడ్జి సమక్షంలో ఆయన ఏయే వివరాలు వెల్లడిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఆయన నోరు విప్పితే ఎమ్మెల్సీ కవితకు చిక్కులు తప్పవనే చర్చ జరుగుతున్నది. ఆప్ నేతలకు, సౌత్ గ్రూపుతో ఉన్న సంబంధాలపై వెల్లడయ్యే అంశాలు ఆమె మెడకు చుట్టుకోక తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ సమర్పించిన చార్జిషీట్‌లో రెండో నిందితుడిగా ఉన్న శరత్‌చంద్రారెడ్డి ఇకపై అప్రూవర్‌గా స్పెషల్ జడ్జి సమక్షంలో ఇచ్చే స్టేట్‌మెంట్ రానున్న రోజుల్లో మరిన్ని ట్విస్టులిచ్చే అవకాశం ఉన్నది. గతంలో సీబీఐ దర్యాప్తు జరుపుతున్న సమయంలో దినేశ్ అరోరా అప్రూవర్‌గా మారి ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో మనీశ్ సిసోడియా అరెస్టయ్యారు. ఇప్పుడు ఈడీ దర్యాప్తులో శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా ఇచ్చే స్టేట్‌మెంట్ ఇంకెలాంటి కొత్త విషయాలు తెరమీదకు తెస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సౌత్ గ్రూపులోని నలుగురిలో శరత్‌చంద్రారెడ్డి ఒకరు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, సౌత్ గ్రూపు మధ్య జరిగిన చర్చల్లో శరత్‌చంద్రారెడ్డి యాక్టివ్‌గా పాల్గొన్నారు. లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూపులో ఎవరెవరి పాత్ర ఏ స్థాయిలో ఉన్నదో ఆయనకు లోతుగా తెలుసు. ఇప్పుడు ఆయన వెల్లడించే వివరాలు సంచలనాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే కవితకు గతంలో ఆడిటర్‌గా పని చేసిన గోరంట్ల బుచ్చిబాబు ఈ ఏడాది ఫిబ్రవరి 23, 28 తేదీల్లో ఈడీ ముందు హాజరై స్టేట్‌మెంట్లు ఇచ్చారు. లిక్కర్ స్కామ్‌లో వచ్చిన డబ్బు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగంలోకి పెట్టుబడిగా మారిందని వెల్లడించారు. ఫీనిక్స్ శ్రీహరి ద్వారా జరిగిన భూ క్రయ విక్రయాలు, అందులో పిళ్లై పాత్ర గురించి వివరంగానే చెప్పారు. పిళ్లైను సైతం ఈడీ గతేడాది నవంబర్ 11, 20, ఈ ఏడాది ఫిబ్రవరి 16న, మార్చి 6న విచారించి స్టేట్‌మెంట్లు రికార్డు చేసింది. కవిత తరఫున ప్రతినిధిగా వ్యవహరించినట్లు, ఇండో స్పిరిట్స్ కంపెనీలో ఆమె ఇచ్చిన ఆర్థిక సాయంతో వాటాదారునిగా చేరినట్లు అంగీకరించారు. ఇప్పుడు శరత్‌చంద్రారెడ్డి చెప్పే విషయాల్లో కవితకు ఈడీ నుంచి మనీ లాండరింగ్ ఉల్లంఘనల్లో ఎలాంటి చిక్కులు వస్తాయోననే చర్చ జరుగుతున్నది.
వెలుగులోకి రానున్న కొత్త అంశాలు?
శరత్‌చంద్రారెడ్డి వెల్లడించే విషయాలపై ఇప్పటికే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లిక్కర్ పాలసీ రూపకల్పనలో ఈ గ్రూపు ప్రమేయం ఏ మేరకున్నది? గ్రూపులో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరుల రోల్ ఏ స్థాయిలో ఉన్నది? మనీశ్ సిసోడియాతో వీరికి కుదిరిన లోపాయికారి ఒప్పందమేంటి? కవితకు, ఆప్ నేతలకు మధ్య రాజకీయ అండర్‌స్టాండింగ్ కుదిరింది నిజమేనా? ఇప్పటికే ఆమె వ్యక్తిగత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, ఆమె ప్రతినిధిగా వ్యవహరించారని భావిస్తున్న అరుణ్ రామచంద్ర పిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్లకు అదనంగా ఈడీకి మరికొన్ని అంశాలు లభిస్తాయా? కిక్‌బ్యాక్ రూపంలో రూ.100 కోట్లు సౌత్ గ్రూపు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముట్టిన వ్యవహారం మరింత ప్రస్ఫుటమవుతుందా?..ఇలాంటి అనేక చర్చలు తెరమీదకు వస్తున్నాయి.
వీటికి తోడు సౌత్ గ్రూపుగా ఈ నలుగురూ ఒక టీమ్‌గా ఏర్పడడానికి దారితీసిన పరిస్థితుల మొదలు ఎక్సయిజ్ పాలసీ ఏ విధంగా ఉండాలి? లిక్కర్ వ్యాపారులకు లాభాలు పండేలా ఎలా రూపొందించాలి? దానికి ప్రతిఫలంగా ఎవరి నుంచి ఎవరికి ఎంత ముట్టాలి? ఏ రూపంలో వీటిని అందజేయాలి? హైదరాబాద్‌లో కవిత నివాసంలో జరిగిన మీటింగ్‌లో ఏం చర్చించారు? ఆ తర్వాత ఐటీసీ కోహినూర్ హోటల్‌లో ఆప్ ప్రతినిధులతో జరిగిన చర్చల సారాంశమేంటి? కొనసాగింపుగా ఢిల్లీలోని తాజ్ మాన్‌సింగ్, ఒబెరాయ్ మెయిడెన్ హోటళ్లలో జరిగిన నిర్ణయాలేంటి? గౌరీ అపార్ట్‌మెంట్‌లో కుదిరిన డీల్ సంగతేంది? ఇలాంటి అనేక అంశాలపై ఇప్పటికే ఈడీ దగ్గరున్న ఆధారాలకనుగుణంగా శరత్‌చంద్రారెడ్డి కొత్తగా ఏం చెబుతారనేది కీలకంగా మారనున్నది.
సౌత్ గ్రూప్ అంశాలే ఎక్కువగా ప్రస్తావన
సౌత్ గ్రూపులో మెంబర్‌గా ఉన్నందున దీనికి సంబంధించిన అంశాలపైనే ఆయన ఎక్కువగా ప్రస్తావించే అవకాశమున్నది. లిక్కర్ పాలసీని ట్రేడర్లకు అనుకూలంగా మార్చినందుకు సౌత్ గ్రూపు ద్వారా రూ.100 కోట్లు ఆప్ నేతలకు ముట్టాయని, అందులో కొంత గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వాడినట్లు ఈడీ ఆరోపిస్తున్నది. హైదరాబాద్ నుంచే ఈ డబ్బు హవాలా రూపంలో వెళ్లినట్లు చార్జిషీట్లలో ఈడీ ప్రస్తావించింది. బోయిన్‌పల్లి అభిషేక్ ద్వారా ఒక ఇన్‌స్టాల్‌మెంట్‌లో రూ.30 కోట్లు హవాలా ఏజెంట్ల ద్వారా ఢిల్లీలోని బెంగాలీ మార్కెట్‌కు వెళ్లినట్లు ఆరోపించింది. ఇందుకు కోడ్‌గా వాడుకున్న రూ.20, రూ.50 నోట్లపై ఉన్న నంబర్ల వివరాలను ఈడీ తన దర్యాప్తులో భాగంగా సేకరించింది. దినేశ్ అరోరా, బోయిన్‌పల్లి అభిషేక్ ఈ వ్యవహారాన్ని నడిపినట్లు ఈడీ పేర్కొన్నది.
కవితకు చిక్కులు తప్పవా?
సౌత్ గ్రూపు తరఫున బోయిన్‌పల్లి అభిషేక్, గోరంట్ల బుచ్చిబాబు, పిళ్లయ్‌ల పాత్ర గురించి శరత్‌చంద్రారెడ్డి వెల్లడించే అంశాలు కవితకు చిక్కులు తెచ్చిపెట్టే అవకాశమున్నట్లు ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. మనీశ్ సిసోడియాతోనే సౌత్ గ్రూపు డీల్ కుదుర్చుకున్నందున చివరకు అది అరవింద్ కేజ్రీవాల్ మెడకు చుట్టుకుంటుందనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కవితను మూడుసార్లు ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆమె వాడిన సెల్‌ఫోన్లలోని డేటాను సేకరించారు. ఆప్ ప్రతినిధిగా వ్యవహరించిన విజయ్ నాయర్‌తో కవిత ఫేస్‌టైమ్‌లో మాట్లాడడం మొదలు హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో జరిగిన సమావేశం వివరాలను శరత్ బయటపెట్టే అవకాశమున్నది. ఢిల్లీలోని మొత్తం 32 రిటైల్ జోన్లలో ఐదు శరత్ చంద్రారెడ్డికి ఎలా దక్కాయనేది కూడా వివరించే చాన్స్ ఉన్నది.
ఈడీ అధికారులు వేధిస్తున్నారని, మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ కవిత స్వయంగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారినందున జడ్జి సమక్షంలో రికార్డెడ్ స్టేట్‌మెంట్‌లో ఏమేం విషయాలు వెల్లడిస్తారనేది ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దినేశ్ అరోరా అప్రూవర్‌గా మారిన తర్వాత మనీశ్ సిసోడియా మెడకు చుట్టుకున్నట్లు ఇప్పుడు శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడం ఎమ్మెల్సీ కవితకు ఇబ్బందికరంగా మారుతుందా?.. లేక అరవింద్ కేజ్రీవాల్‌కు సంకటంగా మారుతుందా? అనేది ప్రధానమైంది. శరత్‌చంద్రారెడ్డి వెల్లడించే అంశాలతో కవితను మరోసారి ఈడీ ఎంక్వయిరీకి పిలుస్తుందో లేక కేజ్రీవాల్‌ను ఇప్పటికే సీబీఐ విచారించగా, ఇకపైన ఈడీ నోటీసులు జారీ చేస్తుందో.. రానున్న రోజుల్లో తేటతెల్లం కానున్నది.