- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సబ్సిడీ ఎత్తేసిన సర్కారు
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రతిఏటా విత్తనాలపై సబ్సిడీ ఇచ్చే సర్కార్ ఈసారి పూర్తిగా ఎత్తేయడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. ఓవైపు కూలీ రేట్లు పెరిగి ఇప్పటికే రైతులు సతమతమవుతున్న ఈ వానకాలంలో ఎక్కువ రేట్లకు విత్తనాలను కొనాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే రైతులకు సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడంతో దొరికిన చోటల్లా అధిక ధరలకు కొంటున్నారు. దీంతో సన్న, చిన్నకారు రైతులకు మోతాదుకు మించిన భారం పడుతోంది. గతంలో వరి, వేరుశనగ, కంది, పెసర, మినుములు, పప్పు దినుసులు, సోయా విత్తనాలను జాతీయ, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థల నుంచి 50 శాతం సబ్సిడీపై అందించేవారు. కానీ ప్రభుత్వం ఈసారి పప్పు దినుసులు, కంది సాగును పెంచేందుకు ప్రణాళిక వేసింది. రాష్ట్రంలో 12లక్షల ఎకరాలకు పైగా కంది సాగు చేయాలని చెప్పడంతో చాలా ప్రాంతాల్లో కందిసాగు చేస్తున్నారు. అయితే గతంలో కంది విత్తనాలకు 50శాతం సబ్సిడీ ఇచ్చేవారు. గత వానాకాలంలో కంది విత్తనాలకు కిలోకు రూ.76 ఉండగా సగం ధరలకు ప్రభుత్వం రైతులకు ఇచ్చేది. కానీ ఈసారి కంది విత్తనాల ధర కిలోకు రూ. 84కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 12.51 లక్షల ఎకరాల్లో కంది పంటలు వేయాల్సి ఉండగా 30వేల క్వింటాళ్లు అవసరమని అంచనా వేశారు. కానీ జాతీయ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థల నుంచి 16వేల క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉంచారు. మిగిలిన 14వేల క్వింటాళ్ల కోసం రైతులు ప్రైవేట్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. దీంతో రైతులపై దాదాపు రూ. 2కోట్ల వరకు అదనపు భారం పడుతోంది.
వరి విత్తనాలకు కూడా కోత
గతంలో వరి విత్తనాలపై కిలోకు రూ. 8 నుంచి రూ. 10 వరకు సబ్సిడీ ఇచ్చేవారు. కానీ ఈసారి మొత్తం ధరకు విత్తనాలను కొనుగోలు చేయాలని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ సోన రకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంతో 25కిలోల బస్తాకు రూ.775 చొప్పున ధర నిర్ణయించారు. పాత విధానం ప్రకారం దీనికి రూ.250 తక్కువ ఉండాల్సి ఉంటుంది. ఈ లెక్కన రూ. 3.45కోట్లు రైతులు అదనంగా భారం మోయాల్సి వస్తోంది. అదేవిధంగా మినుములు, పెసర, ఇతర పప్పు దినుసుల విత్తనాలు కూడా మొత్తం ధరలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మినుములు కిలోకు రూ. 106.50, పెసర్లు రూ. 107.00, కందులు రూ. 84 చొప్పున అమ్ముతున్నారు.
సోయా డబుల్ రేట్
ప్రస్తుతం రాష్ట్రంలో సోయా విత్తనాల కొరతగా ఉండటంతో పక్క రాష్ట్రాల నుంచి కోనుగోలు చేయాల్సి వస్తోంది. సోయా విత్తనాలు బ్యాగు మన దగ్గర రూ. 1,250 చొప్పున ఉండగా… కొరత కారణంగా రూ. 2300 నుంచి రూ. 2500 వరకు పెట్టి కొనాల్సి వస్తుంది.
విత్తనాలు గతేడు అమ్మిన విత్తనాలు ఈ ఏడాది అవసరం
వడ్లు 58,554 క్వింటాళ్లు 1,38,148 క్వింటాళ్లు
కంది 2,637 క్వింటాళ్లు 30వేల క్వింటాళ్లు
సోయ 1,44,916 క్వింటాళ్లు 1,45,000 క్వింటాళ్లు
పచ్చిరొట్ట 93,388 క్వింటాళ్లు 1,55,464 క్వింటాళ్లు