- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనా భయం.. విమర్శలపాలవుతున్న మావోయిస్టులకు డీజీపీ ఆఫర్
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనాతో చనిపోయే బదులు జనజీవన స్రవంతిలో కలిసిపోతే మెరుగైన చికిత్స అందించి బతికిస్తామంటూ మావోయిస్టుల విషయంలో డీజీపీ మహేందర్ రెడ్డి చేసిన ప్రకటన తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. వైరస్ బారిన పడిన మావోయిస్టుల విపత్కర పరిస్థితుల్ని లొంగుబాటు కోసం పోలీసులు వినియోగించుకోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మావోయిస్టులకు వైద్య చికిత్స అందించడంపై స్పందించిన డీజీపీ అటవీ గ్రామాల్లో వైరస్ బారిన పడిన ఆదివాసీలకు, గిరిజనులకు చికిత్స అందించడంపై మాత్రం క్లారిటీ ఇవ్వకపోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. పోలీసు శాఖ ఇచ్చే పిలుపులకు విశ్వసనీయత ఉండదని, నిజానికి ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారా? లేక వ్యక్తిగత స్థాయిలో పోలీసు బాస్‌గా ఈ పిలుపు ఇస్తున్నారా? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉన్నదనే అభిప్రాయాలు మేధావుల నుంచి వినిపిస్తున్నాయి. మెరుగైన కరోనా ట్రీట్‌మెంట్ ఇప్పిస్తామని పోలీసులు చెప్పే మాటలను మావోయిస్టులు ఎలా నమ్మకంలోకి తీసుకుంటారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మావోయిస్టులు, పోలీసులకు మధ్య యుద్ధమే జరుగుతున్నప్పుడు ప్రభుత్వం తరఫున రాజకీయ నిర్ణయం జరగకుండా పోలీసులే అత్యుత్సాహంతో పిలుపు ఇవ్వడానికి అర్థం ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి.
పైగా ప్రభుత్వమే మావోయిస్టు పార్టీని, దానికి అనుబంధంగా ఉండే సంఘాలంటూ ముద్రవేసి నిషేధించిన తర్వాత వాటితో సంబంధాలు కలిగినవారిని పోలీసులు ఎప్పుడూ మట్టుబెట్టడానికే ప్రయత్నిస్తాయని, ఈ అభిప్రాయం ఉన్న సమయంలో డీజీపీ ఇచ్చే పిలుపుపై మావోయిస్టులు ఎందుకు స్పందిస్తారన్న అభిప్రాయాలు మేధావుల నుంచి వ్యక్తమవుతున్నాయి. కరోనా బారిన పడినవారికి చికిత్స అందించడం ప్రభుత్వ బాధ్యత అయినప్పుడు లొంగుబాటును ఒక షరతుగా డీజీపీ ఖరారు చేయడాన్ని తప్పుపడుతున్నారు. నిత్యం ఆదివాసీ ప్రజలతో కలిసి ఉన్న మావోయిస్టులకు వైరస్ సోకితే అది అక్కడి గూడేల్లోని జనానికి కూడా అంటుకునే ఉంటుందని, వారికి చికిత్స అందించడంపై మాత్రం డీజీపీ ఎందుకు ప్రస్తావించలేదని వారు ప్రశ్నించారు.
ఆదివాసీ, గిరిజన ప్రజలకు వైద్యం అందించడం ప్రభుత్వాల బాధ్యత అని, వైద్యం పొందడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దాని ప్రకారం ఆ గ్రామాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంపులు పెట్టి వైద్యచికిత్స అందించాలన్న అభిప్రాయాన్ని సామాజిక కార్యకర్తలు వ్యక్తం చేశారు. మైదానాల్లో ప్రజలు కరోనా బారిన పడిన తర్వాత వైద్య చికిత్స అందించడం మాత్రమే కాక పోషకాహారాన్ని అందించడం, ఐసొలేషన్ అవసరాన్ని నొక్కి చెప్పడం, క్వారంటైన్‌లో ఉంచడం లాంటివి అమలు చేస్తుండగా.. ఆదివాసీ, గిరిజన గూడేల్లో ఇలాంటి వాటి గురించి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడాన్ని వాళ్లు తప్పు పడుతున్నారు. మావోయిస్టులను ఏరివేయడానికి కరోనా పరిస్థితిని అవకాశంగా తీసుకోవడం సహజ న్యాయం అనిపించుకోదని వ్యాఖ్యానిస్తున్నారు.
మావోయిస్టులకు కరోనా సోకలేదంటూ ఆ పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన ఎలా ఉన్నా.. వైరస్ బారిన పడి చనిపోతున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఎంత మందికి కరోనా సోకింది, దాని వ్యాప్తి, తీవ్రత ఎలా ఉంది అనే అంశంలో స్పష్టత లేకపోయినా.. అడవుల్లోకి సైతం వైరస్ వ్యాపించిందనేది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. గ్రామాల్లో ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ పెడుతున్న ప్రభుత్వం అటవీ గ్రామాల్లో ఇప్పటివరకు టెస్టులు కూడా చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. కనీస రోడ్డు సౌకర్యం లేని అటవీ గ్రామాలకు ప్రత్యేకంగా వైద్య బృందాలను పంపి కరోనా చికిత్సను మొదలుపెట్టాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జైళ్ళలో అండర్ ట్రయల్ ఖైదీలు, శిక్షపడిన ఖైదీలకు కూడా ప్రభుత్వమే ఉచితంగా కరోనా చికిత్స అందిస్తుండగా.. మావోయిస్టుల విషయంలో మాత్రం లొంగిపోతే అనే షరతు పెట్టడం విమర్శలకు దారితీసింది. పైగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తున్న కార్యకర్తల కుటుంబాలపై లొంగుబాటు ఒత్తిడి తీసుకురావడం, వివిధ రూపాల్లో కౌన్సెలింగ్ ఇవ్వడాన్ని ప్రస్తావిస్తున్న మేధావులు.. బెటర్ ట్రీట్‌మెంట్ గురించి మాట్లాడడం పరస్పర విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు.
శాంతిచర్చల సమయంలో గతంలో ప్రభుత్వాలు వ్యవహరించిన విధంగానే ఇప్పుడు కరోనా ట్రీట్‌మెంట్ విషయంలోనూ మావోయిస్టులకు భరోసా లభించే విధంగా స్పష్టమైన నిర్ణయం వెలువడాలని పౌర సమాజం కోరుతున్నది. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. అటు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని, ఆదివాసీ గూడెంలలోకి వైద్య బృందాలను పంపించాలని డిమాండ్ చేస్తున్నది. మావోయిస్టులు కూడా మానవతా దృక్ఫథంతో వ్యవహరించాలని, తమ ప్రాంతాల్లోకి ఈ టీంలను రానివ్వాలని అభిప్రాయపడుతున్నది.
అందరికీ వైద్యం ప్రభుత్వ బాధ్యత: ప్రొఫెసర్ హరగోపాల్, పౌరహక్కుల నేత
“నిజానికి ఉద్యమాన్ని నడుపుతున్నది మావోయిస్టులు కాదు. ఆ ఉద్యమానికి ప్రాణం ఆదివాసీలు. అటవీ గ్రామాల్లో బతుకుతున్న ఆదివాసీలు చేస్తున్న పోరాటానికి మావోయిస్టులు మద్దతు ఇస్తున్నారు. ఆదివాసీల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకుంటే మావోయిస్టుల అవసరమే ఉండదు. వారి మద్దతు లేకుండానే బతకగలరు. అభివృద్దిని అన్నలు అడ్డుకుంటున్నారంటూ ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి. అదే నిజమైతే అన్నల ఉనికే లేకుండా ఉన్న వేలాది ఆదివాసీ గ్రామాలు ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోకుండానే ఎందుకు ఉన్నాయి? అన్నలు లేనిచోట అభివృద్ధి ఉండాలి గదా! ఆదివాసీలకు మలేరియా, విషజ్వరాలతో పాటు కరోనా లాంటివి రాకుండా, వచ్చినా తగిన వైద్యచికిత్స అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఇప్పటికైనా వైద్యాన్ని వారికి అందుబాటులోకి తీసుకురావాలి. పోలీసులు ఇచ్చే లొంగుబాటు పిలుపును మావోయిస్టులు పరిగణనలోకి తీసుకోవడం కష్టమే. ‘మీ రక్షణ చూసుకుంటాం.. రండి..‘ అని ప్రభుత్వం, ముఖ్యమంత్రి పిలుపు ఇస్తే వేరుగా ఉంటుంది. అలాంటి పిలుపే ఇవ్వాలి. అప్పుడే లొంగుబాటు పిలుపుకు అర్థం ఉంటుంది. పోలీసులు ప్రత్యక్షంగా పిలుపు ఇస్తే అర్థం ఉండదు. వారికి, పోలీసులకు మధ్య పోరాటమే జరుగుతూ ఉంటే ఈ పిలుపుకు మావోయిస్టులు సానుకూలంగా స్పందిస్తారని ఎలా భావించగలం?” అని హరగోపాల్ వ్యాఖ్యానించారు.
పౌరసమాజాన్ని భాగస్వామిని చేయాలి:కే. రామచంద్రమూర్తి, సీనియర్ సంపాదకులు
“కరోనా అన్ని చోట్లకూ వ్యాపిస్తున్నందున అటవీ గ్రామాల్లోని ఆదివాసీల కోసం ప్రభుత్వం ప్రత్యేక మెడికల్ క్యాంపులు పెట్టడం అవసరం. కరోనా బారిన పడిన మావోయిస్టులను లొంగిపోవాలని, మెరుగైన చికిత్స అందిస్తామంటూ పోలీసు అధికారులు పిలుపునిస్తున్నారు. కానీ ఇది ఒక పొలిటికల్ ఫ్రేమ్ వర్క్‌లో జరగాలి. గతంలో ఐఏఎస్ అధికారి శంకరన్ నేతృత్వంలో ‘కన్సర్న్ సిటిజన్స్ కమిటీ‘ ఉండేది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మావోయిస్టులతో శాంతిచర్చలకు చొరవ తీసుకున్నది. చర్చల సమయంలోనైనా, ఇప్పుడు కరోనా చికిత్స కోసమైనా ఇరువైపులా విశ్వసనీయత ఉండాలి. పౌర సమాజాన్ని భాగస్వామిని చేయాలి. ప్రభుత్వం రాజకీయంగా, విధానపరంగా తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. హోం మంత్రిత్వశాఖ తరఫున కూడా కొన్ని సూచనలు, స్పష్టత ఉండాలి. మావోయిస్టులు లొంగిపోతే కరోనా చికిత్స అనే పిలుపును పోలీసులు ఇవ్వాల్సింది కాదు. పోలీసులకు లేదా ప్రభుత్వానికి మావోయిస్టులు సరెండర్ కావడం అనేది కూడా ఒక నిర్దిష్టమైన విధానానికి లోబడి ఉంటుంది” అని రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు.