శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు

by Shyam |
శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు
X

దిశ, హైదరాబాద్ :

ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ, శాసనమండలిలో వరుసగా రెండు రోజుల పాటు ప్రశ్నోత్తరాల సమయం రద్దయింది. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు బులెటిన్ విడుదల చేశారు. బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శుక్రవారం ప్రసంగించారు. ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్నందున దానిపై ఒక రోజు సమయాన్ని చర్చ కోసం బిజినెస్ అడ్వయిజరీ కమిటీ కేటాయించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని శనివారం (మార్చి 7వ తేదీ) ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేస్తున్నట్లు కార్యదర్శి ప్రకటించారు. అదే విధంగా ఆదివారం (మార్చి 8వ తేదీ) ఆర్థిక మంత్రి హరీశ్‌రావు రానున్న ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నందున ఆ రోజున కూడా ప్రశ్నోత్తరాల సమయం రద్దయింది. ప్రతీ ఏటా బడ్జెట్ రోజున ఎలాంటి ప్రశ్నోత్తరాల సమయం ఉండదు. ఈసారి కూడా అదే సంప్రదాయం కొనసాగుతోంది. ఇక మిగిలిన రోజుల్లో యధావిధిగానే ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది.

tags : Telangana, Assembly, Question Hour, Secretary

Advertisement

Next Story

Most Viewed