Special Story: రైలా.. బుల్లెట్టా? గంటకు వేయి కిలో మీటర్ల వేగం

by Shiva |
Special Story: రైలా.. బుల్లెట్టా? గంటకు వేయి కిలో మీటర్ల వేగం
X

రైలు ఏంటి.. విమానం కన్నా వేగంగా వెళ్లడమేంటి? అదికూడా గాల్లో ప్రయాణించడమేంటి? అనుకుంటున్నారా..? అవును మీరు చదివింది నిజమే. ప్రజా రవాణాలో భాగంగా ఇప్పుడున్న వాటిలో విమానాన్ని మించిన వేగం సాధ్యంకాదు. కానీ, చైనా చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. విమానాన్ని మించిన వేగం రైలు ద్వారా సాధ్యం కాబోతుంది. చైనా అంటేనే ప్రయోగాలు. ప్రపంచంతో పోల్చితే చైనా ఎప్పుడు టెక్నాలజీలో ఓ అడుగు ముందే ఉంటుంది. అలాంటి చైనా ఇప్పుడు మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. ప్రపంచంలోనే అతి వేగంగా ప్రయాణించే రైళ్లు ప్రస్తుతం చైనాలోనే ఉన్నాయి. ఈ ప్రయోగంతో ఏకంగా విమానం స్పీడ్‌‌నే బద్ధలు కొట్టబోతున్నది. విమానం స్పీడ్ గంటకు 600-700కి.మీలు ఉంటుంది కానీ ఇప్పుడు చైనా తయారుచేస్తున్న రైలు ఏకంగా గంటకు 1000కి.మీ వేగంతో ప్రయాణించే అవకాశం ఉన్నది. అంటే విమానం కంటే స్పీడ్‌గా.. దాదాపుగా బుల్లెట్ వేగంతో వెళ్లే రైలు అన్నమాట. దానికి సంబంధించిన ప్రయోగాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మధ్యే ఇందుకు సంబంధించిన ప్రయోగం సక్సెస్ అయినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇందుకోసం జపాన్ కు చెందిన మాగ్లేవ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇంతకీ దాని ప్రత్యేకతలు.. సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం. - రాజు గోపు

మాగ్లేవ్ టెక్నాలజీ అంటే..

సాధారణంగా ఏ రైళ్లు అయినా.. పట్టాలపై చక్రాలు పరిగెడితే నడుస్తాయి. కానీ, ఈ రైలుకు చక్రాలు ఉండవు. రైలుకు చక్రాలకు బదులు క్లిప్.. పట్టాలకు బదులు విద్యుదయస్కాంత క్షేత్రాలు గీతల్లా ఉంటాయి. రైలు ప్రయాణించే సమయంలో.. ఆ క్లిప్ షేప్‌కు ఆ విద్యుదయస్కాంత గీతల మధ్య వ్యతిరేక సంఘర్షణ మొదలవుతుంది. అప్పుడు రైలు పట్టాలకు 10 సెంటీమీటర్లు పైకి లేస్తుంది. ప్రత్యేక వ్యవస్థ దానిని వేగంగా ముందుకు నెడుతుంది. ఇప్పుడు ఉన్న వ్యవస్థలో ఈ రైలు అత్యంత వేగంతో దూసుకుపోతుంది. ప్రస్తుతం చైనాలో షాంఘై‌ ర్యాపిడ్ రైలు గరిష్ఠంగా గంటకు 460 కి.మీ వేగంతో వెళ్తున్నది. ఈ స్థాయి వేగంతో వెళ్లేందుకు రైలు మూడు పట్టాల లైన్లు మారాల్సి ఉంటుంది. అప్పుడే అనుకున్న వేగాన్ని అందుకోవడం వీలవుతుంది. రైలు వేగాన్ని నెమ్మదించేందుకు కూడా అలాగే పట్టాల లైన్లు మారాల్సి ఉంటుంది. మరో విశేషం ఏమిటంటే.. ఈ మాగ్లేవ్ సాంకేతికతో పని చేసే రైలు గరిష్ఠ వేగాన్ని 1000 కి.మీ కూడా పెంచే అవకాశం ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. అయితే, ఇందుకు ప్రత్యేకంగా ట్యూబ్ లు రూపొందించాల్సి ఉంటుంది. గాలి కూడా దూరని వాక్యూమ్ ట్యూబ్‌లో ప్రయాణిస్తే రైలును 1000 కి.మీ వేగాన్ని అందుకోవడం సాధ్యమేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రిసెర్చ్ టీమ్ ఇందుకు సంబంధించిన టెస్ట్‌ను కూడా విజయవంతంగా నిర్వహించింది. 2022లోనే ఈ టీమ్ వాక్యూమ్ ట్యూబ్ వాడకుండా గంటకి 600 కి.మీ వేగంగా వెళ్లే ప్రయోగాన్ని సక్సెస్ చేశారు. భవిష్యత్తులో ఈ రైళ్ల రాకపోకలు కూడా సాగవచ్చని అక్కడి అధికారులు చెబుతున్నారు.

2003 నుంచి

హై స్పీడ్ రైళ్ల విషయంలో ప్రపంచంలోనే చైనా అగ్రస్థానంలో ఉంది. చైనాలో 2003 నుండి ఈ మాగ్లేవ్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ మాగ్లేవ్ సాంకేతికపై దాదాపు 100 సంవత్సరాల నుంచి పరిశోధనలు మరియు అభివృద్ధి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆరు మాగ్లెవ్ రైళ్లు మాత్రమే ఉన్నాయి - చైనాలో మూడు, దక్షిణ కొరియాలో రెండు మరియు జపాన్‌లో ఒకటి. రైళ్లతో పాటు కార్లకు కూడా ఈ మాగ్లేవ్ టెక్నాలజీ వాడేందుకు చైనా కసరత్తు చేస్తున్నది. 2022 సెప్టెంబర్ లో సిచువాన్ ప్రావిన్స్‌లోని చెంగ్డులోని సౌత్‌వెస్ట్ జియాటాంగ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు మాగ్లేవ్ టెక్నాలజీని వినియోగించి రోడ్డుపై 35 మిల్లీమీటర్ల ఎత్తులో తేలేందుకు అయస్కాంతాలను ఉపయోగించి అందుకు అనుగుణంగా తయారుచేసిన కార్లను ఈ ప్రయెగంలో వాడారు. ఒకే మార్గంలో వెళ్లాల్సి వస్తే ఈ సాంకేతికతను ఉపయోగించుకోవడం వీలవుతుంది. కానీ, కార్లు దిశను మార్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి.. ఈ ప్రయోగానికి మాగ్లేవ్‌లో ఎటువంటి మార్పులు చేస్తారో వేచి చూడాలి.

భారత్‌లో బుల్లెట్ ట్రైన్?

ఇండియాలో ఇప్పటివరకు మాగ్లేవ్ లాంటి వ్యవస్థ కానీ ఆ రైళ్లు కానీ లేవు. ప్రస్తుతం భారతీయ రైల్వే తన మొదటి బుల్లెట్ రైలును నిర్మిస్తున్నది. 2017లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే ముంబై నుంచి అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు (MAHSR)ప్రాజెక్ట్‌కు పునాది వేశారు. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, మహారాష్ర్ట, గుజరాత్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. అందుకోసం అహ్మదాబాద్ - ముంబై మధ్య మొత్తం 508 కి.మీ.ల మేర ఈ ట్రాక్ నిర్మించబోతున్నారు. ఈ మార్గం పూర్తయితే గరిష్ఠంగా గంటకు 350 కిమీ వేగంతో బుల్లెట్ రైలు దూసుకుపోతుందని అంచనా. అందుకు అనుగుణంగా

ట్రాక్‌ను, రైలును సిద్ధం చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ బాధ్యతలను తీసుకున్నది. ఈ వ్యవస్థ కోసం అండర్ గ్రౌండ్ నుంచి, నదుల మీది నుంచి కూడా ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ఇప్పటికి 40-50% శాతం పనులు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. 2026 లేదా 2027 వరకు ఈ బుల్లెట్ ట్రైన్లను అందుబాటులోకి తెచ్చేందకు ప్రయత్నిస్తున్నామని కేంద్రం చెప్పుకొస్తున్నది. ఈ హై-స్పీడ్ రైలు మార్గం పూర్తయితే ముంబై, బోయిసర్, వాపి, విరార్, థానే, బిలిమోరా, బరూచ్, వడోదర, ఆనంద్/నడియాడ్, సూరత్ మరియు సబర్మతి అహ్మదాబాద్ బుల్లెట్ రైల్వే స్టేషన్లు ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. బుల్లెటు రైలు ద్వారా అహ్మదాబాద్ - ముంబై మధ్య దూరాన్ని కేవలం 3గంటల్లో చేరుకోవచ్చు.

వందే భారత్

ఇండియాలో టాప్ స్పీడ్ రైళ్ల గురించి మాట్లాడినప్పుడల్లా వందే భారత్ పేరు అగ్రస్థానంలో వస్తుంది. ఈ రైలు గరిష్ట వేగం గంటకు 180 కిమీ. మేకిన్ ఇండియాలో భాగంగా 2019 ఫిబ్రవరి 15లో న్యూఢిల్లీ-వారణాసి మార్గంలో వీటిని కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. మిగతా రైళ్లతో పోలిస్తే దేశంలో ఇవే అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లు. గంటకు 180కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి. వీటి సంఖ్యను పెంచేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. గత నెల ఆగస్టు వరకు 55 వందేభారత్ రైళ్లను నడుపుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. గతంలో భారతీయ రైల్వే ఆవిరితో రైళ్లను నడిపేవారు. ఆ తర్వాత డీజీల్, ఎలక్ట్రిక్ ఇంజన్ల సహాయంతో నడిచే రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. మన దేశంలో రోజుకు 2.5 కోట్ల మందికి పైగా రైళ్లలో ప్రయాణిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్, మెయిల్, డిఎంయు వంటి అనేక రైళ్లు నడుస్తున్నాయి.

ఇండియాలో వేగవంతమైన 5 రైళ్లు

రైలు వేగం (కి.మీ/గం)

1 వందే భారత్ - 180

2. తేజస్ - 162

3. గతిమాన్ - 160

4. శతాబ్ది - 155

5. రాజధాని - 140

ప్రపంచంలోని వేగవంతమైన 10 రైళ్లు

రైలు దేశం వేగం(కిమీ/గం)

1. షాంఘై మాగ్లేవ్ - చైనా - 460

2. CR హార్మొనీ - చైనా - 350

3. CR ఫక్సింగ్ - చైనా - 350

4. DB ICE - జర్మనీ - 350

5. SCNCF TGV - ఫ్రాన్స్ - 320

6. JR షింకన్‌సెన్ - జపాన్ - 320

7. ONCF అల్ బోరాక్ - మొరాకో - 320

8. రెన్ఫే AVE 103 - స్పెయిన్ - 310

9. కోరైల్ KTX-సాంచియోన్ - కొరియా - 305

10. ట్రెనిటాలియా ఫ్రెకియరోస్సా 1000 - ఇటలీ - 300

ఫాస్ట్ ట్రైన్లతో లాభాలు:

సమయం ఆదా చేయడం

పర్యావరణానికి అనుకూలం

రోడ్లపై రద్దీ తగ్గడం

ఉపాధి పెరగడం

సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన ప్రయాణం

రియల్ ఎస్టేట్‌కు లాభదాయకం

నష్టాలు

భారీ ఖర్చు

అధిక ఛార్జీలు

Advertisement

Next Story

Most Viewed